You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లోక్‌సభ ఎన్నికలు 2019: దేశంలో అత్యంత సుదీర్ఘ ఎన్నికలు ఇవేనా.. ఇది బీజేపీకి లాభిస్తుందా?
స్వతంత్ర భారత దేశ చరిత్రలో 1951- 52 తర్వాత ఈసారి ఎన్నికల ప్రక్రియ అత్యంత సుదీర్ఘ కాలంపాటు జరుగుతోంది. ఏప్రిల్ 11, 18, 23, 29, మే 6, 12, 19 తేదీల్లో మొత్తం 7 దశల్లో పోలింగ్ నిర్వహిస్తారు.
మే 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అంటే, మొదటి విడతలో పోలింగ్ జరిగిన నియోజకవర్గాల ప్రజలు, అభ్యర్థులు ఫలితాల కోసం 42 రోజులు వేచిచూడాల్సి ఉంటుంది.
మరి, చాలా ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటి రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుండగా... భారత్‌లో ఇంత సుదీర్ఘ సమయం ఎందుకు పడుతోంది?
తొలిసారి ఎన్నికలకు 3 నెలలు
స్వతంత్ర భారత దేశంలో 1951- 52లో తొలిసారి లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. 1951 అక్టోబర్ 25 నుంచి 1952 ఫిబ్రవరి 21 వరకు 68 దశల్లో పోలింగ్ జరిగింది. అంటే, ఎన్నికలు పూర్తవడానికి మూడు నెలలకు పైనే పట్టింది. దేశంలో తొలి ఎన్నికలు కావడం వల్ల ఏర్పాట్లు చేసేందుకు ఎక్కువ సమయం పట్టింది.
ఆ తర్వాత 1962 నుంచి 1989 మధ్య కాలంలో జరిగిన ఎన్నికలు నాలుగు నుంచి 10 రోజుల్లో పూర్తయ్యాయి. ఇప్పటి వరకు అత్యంత తక్కువ వ్యవధిలో ఎన్నికలు పూర్తయింది 1980లో జరిగిన 7వ లోక్‌సభ ఎన్నికలు మాత్రమే. అప్పుడు పోలింగ్ ప్రక్రియ కేవలం నాలుగు రోజుల్లోనే పూర్తయింది.
నాలుగు విడతల్లో జరిగిన 2004 ఎన్నికల పోలింగ్‌కు 21 రోజులు, 2009లో 28 రోజులు, తొమ్మిది దశల్లో నిర్వహించిన 2014 లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు 36 రోజులు పట్టింది. ఇప్పుడు అంతకంటే మూడు రోజులు ఎక్కువ పడుతోంది.
శాంతి భద్రతలే కారణమా?
అయితే, అప్పటి ఎన్నికల్లో చాలాసార్లు అవతకవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల్లో పారదర్శకతపై విమర్శలు వ్యక్తమయ్యాయి. బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లడం తీవ్రమైంది. హింసాత్మక ఘటనల్లో అనేకమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో స్థానిక పోలీసులు విఫలమవుతున్నారని, అధికార పార్టీల నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి.
కానీ, 1990ల్లో ఎన్నికల కమిషనర్‌గా టీఎన్ శేషన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితిలో మార్పు మొదలైంది. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు కేంద్ర పారామిలిటరీ బలగాలను వినియోగించడం ప్రారంభించారు. తర్వాత ఎన్నికలు జరిగేటప్పుడు భద్రతా బలగాలు అందుబాటులో ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కూడా సూచించింది.
"ఎన్నికల ప్రక్రియకు ఎక్కువ రోజులు పట్టడానికి ప్రధానమైన కారణం శాంతిభద్రతల పరిరక్షణే. స్థానిక పోలీసులు కొందరు నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తారన్న భావన ఉండేది. దాంతో, మేం కేంద్ర బలగాలను మోహరించాల్సిన అవసరం వచ్చింది. అయితే, దేశవ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ జరిగితే అంతటా బలగాలను మోహరించడం సాధ్యం కాదు. కాబట్టి, దశలవారీగా పోలింగ్ నిర్వహిస్తూ.. ఒక ప్రాంతంలో ముగిసిన తర్వాత అక్కడి నుంచి మరోచోటుకు బలగాలను తరలిస్తారు. అందుకు కొంత సమయం పడుతుంది’’ అని మాజీ ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషీ గతంలో బీబీసీతో చెప్పారు.
దేశ సరిహద్దుతో పాటు, వేర్వేరు ప్రాంతాల్లో భద్రతను చూసే బలగాలను బస్సులు, రైళ్లలో పోలింగ్ జరిగే ప్రాంతాలకు తరలిస్తారు.
పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు పోలింగ్ కేంద్రాలతో పాటు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు, ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూంల దగ్గర వారిని మోహరిస్తారు.
2014 ఎన్నికల సమయంలో లక్షా 20 వేలకు పైగా కేంద్ర భద్రతా బలగాలను వినియోగించారు.
ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
సుదీర్ఘకాలం పాటు ఎన్నికల ప్రక్రియ సాగడం ద్వారా తొలి విడతలో పోలింగ్ జరిగిన నియోజకవర్గాల అభ్యర్థులు, ప్రజలు ఫలితాల కోసం 42 రోజులు ఉత్కంఠతో నిరీక్షించాల్సి ఉంటుంది. అయితే, తొందరగా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో అభ్యర్థులకు ప్రచార ఖర్చుల భారం తగ్గుతుంది.
ఆఖరి విడతల్లో పోటీపడే అభ్యర్థులు మండే ఎండల్లో వారాల తరబడి ప్రచార కార్యక్రమాలతో చెమటోడ్చాల్సి ఉంటుంది. ఖర్చులు కూడా తడిసి మోపెడయ్యే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఒకే విడత, ఒడిశాలో 4 విడతలా?
అయితే, భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని వివిధ విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం చెప్పినా, ఒడిశా, పశ్చిమ బంగాలో బీజేపీకి అనుకూలంగా షెడ్యూల్ ఉందంటూ సోషల్ మీడియాలో కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఒడిశాలో 4 విడతల్లో పోలింగ్ నిర్వహిస్తూ... పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం ఒకే విడతలో పోలింగ్ జరపడమేంటని స్వరాజ్ ఇండియా పార్టీ జాతీయ అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ ప్రశ్నించారు.
అయితే, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని, దాన్ని అనుమానించాల్సిన అవసరం లేదని కొందరు అభిప్రాయపడ్డారు.
మరికొందరేమో.. కొన్ని ప్రాంతాల్లో బీజేపీ ఎక్కువ రోజుల పాటు ప్రచారం చేసుకునేందుకు వీలుగా షెడ్యూల్ ఉందని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- ఇథియోపియా విమాన ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతి
- ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూసుకోండి.. 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి
- ఏపీలో అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఏ నియోజకవర్గంలో ఉన్నారో తెలుసా?
- పది నిమిషాల్లో ఆనందాన్ని పెంచుకోవడం ఎలా?
- రియాలిటీ చెక్: బుల్లెట్ రైలు గడువులోగా పట్టాలెక్కుతుందా?
- ఓటరు జాబితాలో మీ పేరు నమోదు చేసుకోవడం ఎలా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.