భారత్‌లో తొలి కరోనా మరణం.. కర్నాటక వృద్ధుడి మృతి

కరోనావైరస్ కారణంగా భారత్‌లో తొలి మరణం నమోదైంది. సౌదీ అరేబియా వెళ్లి వచ్చిన 76 ఏళ్ల కర్నాటకవాసి మరణించారు.

హైదరాబాద్‌లో చికిత్స పొందిన అనంతరం సొంత ఊరు కర్నాటకలోని కలబురగికి వచ్చిన ఆయన మరణించారు. ఆయనకు జరిపిన పరీక్షల్లో కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణైంది.

కర్నాటక ఆరోగ్య మంత్రి బి.శ్రీరాములు ''కలబుర్గికి చెందిన 76 ఏళ్ల వృద్ధుడు మరణించారు. ఆయనకు కోవిడ్-19 ఉన్నట్లు నిర్ధరణైంద''ని ట్వీట్ చేశారు. భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ఈ మేరకు నిర్ధారించింది.

ఈ ఏడాది జనవరి 29న సౌదీ అరేబియా వెళ్లిన ఆయన ఫిబ్రవరి 29న హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి కలబుర్గి వెళ్లారని 'ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో' తన ప్రకటనలో పేర్కొంది.

సౌదీ అరేబియా నుంచి తిరిగొచ్చేటప్పుడు ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ మార్చి 6న ఆయన జ్వరం, దగ్గుతో బాధపడుతూ ఇంటి దగ్గరే ఒక ప్రయివేట్ వైద్యుడితో చికిత్స చేయించుకున్నారు.

మార్చి 9న లక్షణాలు తీవ్రం కావడంతో కలబుర్గిలోని ఒక ప్రయివేట్ ఆసుపత్రికి ఆయన్ను తీసుకెళ్లారు. అక్కడ మిడ్ జోన్ వైరల్ న్యుమోనియా, కోవిడ్-19 లక్షణాలున్నట్లు తేల్చారు.

అదే రోజు ఆయన రక్త నమూనాలను బెంగళూరు పంపించారు. అయితే, ఆ పరీక్షల ఫలితాలు రాకముందే వైద్యుల సలహాను కాదని రోగి బంధువులు అతణ్ని హైదరాబాద్‌లోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారని మార్చి 12న ప్రెస్‌ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది.

అక్కడ మార్చి 10న అతణ్ని డిశ్చార్చ్ చేయగా తిరిగి కలబుర్గికి తీసుకొస్తున్న దారిలో మరణించారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకటనలో స్పష్టం చేసింది.

అతనితో సమీపంగా ఉన్నవారు, సంబంధీకులు అందరినీ ఆరోగ్య నిర్బంధంలో ఉంచి జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు కర్నాటక ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)