కరోనావైరస్ సోకిందన్న భయంతో ఆత్మహత్య... అసలేం జరిగింది?

    • రచయిత, హృదయ విహారి బండి
    • హోదా, బీబీసీ కోసం

''నాకు కరోనావైరస్ సోకింది, దూరంగా ఉండాలంటూ నన్ను, నా బిడ్డల్ని దగ్గరకు రానీలేదు. ఆదివారం దూరదూరంగా తిరిగినాడు. దగ్గరికొస్తే మీరు కూడా సచ్చిపోతారని అరిచినాడు. సోమవారం తెల్లవారుజాము 4 గంటలకు మమ్మల్ని ఇంట్లో పెట్టేసి ఎల్లిపోయాడు సార్. పొలంలో మా అత్త సమాధి దగ్గరున్న చెట్టుకు ఉరిపోసుకుని సచ్చిపోయాడు'' అని బాలకృష్ణయ్య భార్య లక్ష్మిదేవి చెప్పారు.

చిత్తూరు జిల్లాలోని తొట్టంబేడు మండలం, శేషయ్యనాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన బాలకృష్ణయ్య వయసు 50 సంవత్సరాలు. సాధారణ అనారోగ్యాన్ని కరోనావైరస్ అని భావించి ఆయన ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు వచ్చాయి.

ఒకవైపు కడుపు నొప్పి, గొంతు నొప్పి మరోవైపు సోషల్ మీడియా, వార్తా చానెళ్లలో హోరెత్తుతున్న కరోనా వైరస్ వార్తలతో బాలకృష్ణయ్య అయోమయానికి గురయ్యారు.

ఫిబ్రవరి 5న తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో పక్షవాతంకు చికిత్స పొందుతున్న తన మామను (భార్య తండ్రి) పలకరించేందుకు బాలకృష్ణయ్య వెళ్లారు. పలకరింపులయ్యాక, కొంతకాలంగా తనను ఇబ్బంది పెడుతున్న కడుపు నొప్పి, గొంతు నొప్పి గురించి అక్కడే వైద్యులను సంప్రదించారు. బాలకృష్ణయ్యకు రక్తం, మూత్ర పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు మూత్రనాళ ఇన్ఫెక్షన్, నోటి అల్సర్ ఉన్నట్లు గుర్తించి మందులు ఇచ్చారు. అల్సర్ తీవ్రతరం కాకుండా నోటికి మాస్కు ధరించాలని ఆయనకు వైద్యులు సూచించినట్లు ప్రభుత్వానికి పంపిన నివేదికలో అధికారులు పేర్కొన్నారు.

వైరస్, అల్సర్ మాటలు వినగానే... ఆయన తనకు కరోనావైరస్ సోకిందన్న నిర్ణయానికి వచ్చేశారని కుటుంబ సభ్యులు బీబీసీతో చెప్పారు.

'దగ్గరికొస్తే గొంతు కోసుకుంటా...'

''అప్పటికే కరోనావైరస్ వార్తలను, వీడియోలను మా నాయన ఎక్కువగా చూసేసినాడు. 'టీవీలో చెప్పే లక్షణాలు అన్నీ నాలో ఉండాయి, నాకు కరోనా సోకింది, దగ్గరికొస్తే మీకు, ఊరోళ్లకు కూడా వ్యాపిస్తుంది' అని అరుస్తావుండాడు. అట్లకాదు నాయనా అని నచ్చజెప్పేందుకు దగ్గరకు వెళ్తే, మీదికి రాళ్లు ఇసిరినాడు. చేతిలోని కత్తి చూపించి, దగ్గరికొస్తే గొంతుకోసుకుంటానని బెదిరించినాడు'' అని బాలకృష్ణయ్య కొడుకు బాలమురళి అన్నారు.

బాలకృష్ణయ్య, లక్ష్మిదేవి దంపతులకు ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు. ఆడపిల్లలిద్దరూ ఇంకా చదువుతున్నారు. పెద్దకొడుకు బాలమురళి డిగ్రీ పూర్తి చేసి, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన 'గ్రామ వాలంటీర్'గా పనిచేస్తున్నారు.

గత కొన్నేళ్లుగా బాలకృష్ణయ్య గ్యాస్ట్రైటిస్ సమస్యతో బాధపడుతున్నారని, మూడేళ్ల కింద ఆయన సర్జరీ చేయించుకున్నారని జిల్లా వైద్యాధికారి డీఎంహెచ్ఓ డా.పెంచలయ్య తన నివేదికలో పేర్కొన్నారు. చనిపోయేముందు బాలకృష్ణయ్యకు హైపర్ టెన్షన్ కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

''బాలకృష్ణయ్యకు షుగర్ లేదు. మద్యం, సిగరెట్, బీడీ అలవాట్లు కూడా లేవు. కానీ వైద్య పరీక్షల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్, నోటి అల్సర్ ఉన్నట్లు తేలింది. ఇదేమీ పెద్ద విషయం కాదు. మందులు వాడితే తగ్గిపోతుంది. కానీ, ఆయన అనవసరంగా భయపడినాడు. మూత్రనాళ ఇన్ఫెక్షన్, నోటి అల్సర్... నోటికి మాస్క్ వేసుకోండని వైద్యులు చెప్పగానే, తనకు కరోనావైరస్ ఉందని భయపడినాడు'' అని చిత్తూరు డీఎంహెచ్‌వో డా.పెంచలయ్య బీబీసీకు వివరించారు.

'తెల్లవారు జామున, తల్లి సమాధి దగ్గర..'

రుయా ఆస్పత్రిలో వైద్యులను సంప్రదించాక ఫిబ్రవరి 8న బాలకృష్ణ తన స్వగ్రామానికి చేరుకున్నారని భార్య లక్ష్మిదేవి చెప్పారు. ఊరికి వచ్చినప్పటి నుంచి తమకు దూరంగానే మసిలేవాడని, పలకరించినా ఎక్కువగా మాట్లాడేవాడు కాదని ఆమె అన్నారు. నోటికి అడ్డంగా గుడ్డ పెట్టుకుని, ఎవరైనా దగ్గరికొస్తే కోప్పడేవాడని, రాళ్లు విసిరేవాడని ఆమె తెలిపారు.

''మా ఇంటాయన ఆదివారం ఊరికి వచ్చినాడు. తనకు కరోనావైరస్ వచ్చిందని, దగ్గరకు రావొద్దన్నాడు. నన్ను, నా బిడ్డల్ని దగ్గరకు రానీలేదు. ఆదివారం దూరదూరంగా తిరిగినాడు. దగ్గరికొస్తే మీరు కూడా సచ్చిపోతారని అరిసినాడు. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు మమ్మల్ని ఇంట్లో పెట్టేసి పోయినాడు. పొలంలో మా అత్త సమాధి దగ్గరున్న చెట్టుకు ఉరిపోసుకుని వేలాడుతూ కనిపించాడు'' అని లక్ష్మిదేవి వివరించారు.

'మెడికల్ రిపోర్టులనూ తగలబెట్టేసినాడు'

ఫిబ్రవరి 8, శనివారం ఉదయం స్వగ్రామం చేరుకున్న బాలకృష్ణయ్య కాసేపటికే ఎవరికీ కనిపించక అదృశ్యమయ్యాడని బాలమురళి చెప్పారు.

''ఊరికి వచ్చినాక ఇంట్లో ఒక రగ్గు తీసుకుని, పొలం కాడికి పోయినాడు. ఎంతకీ తిరిగి రాకపోతే అంతా వెతికినాం, కనపడలేదు. మరుసటి రోజు ఆదివారం మధ్యాహ్నం ఓ తావ దాపెట్టుకుని కనిపించినాడు. అక్కడికి పోతే, తనకు కరోనా వైరస్ ఉన్నట్లు రుయా డాక్టర్లు చెప్పినారని, దగ్గరకు రావద్దని అరిచినాడు. నేకేమీ అర్థం కాలేదు. బలవంతంగా ఇంటికి తీసుకుపోయినాం. తిరుపతి రుయా ఆస్పత్రిలో తాను చేయించుకున్న తన మెడికల్ రిపోర్టులను కూడా అప్పటికే తగలబెట్టి ఉన్నాడు'' అని బాలమురళి వివరించారు.

ఆదివారం మధ్యాహ్నం నుంచి వంతుల వారీగా బాలకృష్ణయ్యకు కాపలా ఉన్నారు కుటుంబ సభ్యులు. కానీ, సోమవారం తెల్లవారుజాము 4 గంటలకు ఇల్లు మొత్తం నిద్రపోతోంది.

''తెల్లవారుజాము 4 గంటలకు మెల్లగా బయటికి పోయినాడు నాయన. శబ్దం రాకుండా తలుపు తీసుకుని, మళ్లీ తలుపుకు గెడియ పెట్టి వెళ్లిపోయినాడు. ఆ టైంలో ఊరంతా నిద్రపోతాంది. మాకు మెలకువ వచ్చి చుట్టూ చూస్తే, నాయిన లేడు. బయట గెడి వేసినాడు. మేం గట్టిగా అరిస్తే, చుట్టుపక్కలవాళ్లు వచ్చి, తలుపు తీసినారు. మళ్లీ నాయన కోసం అంతా వెతికితే, పొలంలో మా నాయనమ్మ సమాధి దగ్గర చెట్టుకు వేలాడుతూ కనిపించినాడు'' అని చెబుతున్న బాలమురళి స్వరం బొంగురుపోయింది.

'ఫోన్ చేస్తే ఎవ్వరూ స్పందించలేదు'

''మనిషి సచ్చిపోయేకి కరోనావైరస్ అవసరం లేదు సార్... పేషెంటుకు అర్థంకాని భాషలో డాక్టర్లు మాట్లాడినా చాలు. మా నాయిన విషయంలో అదే జరిగింది. తిరుపతి రుయా ఆస్పత్రిలో డాక్టర్లు ఎవ్వరూ తెలుగులో మాట్లాడరు. కానీ, వైద్యం కోసం అక్కడికి వచ్చేవాళ్లంతా గ్రామీణ పేదలే. కనీసం వారి మాసిపోయిన బట్టలు చూసి కూడా పేషెంట్లకు అర్థమయ్యేట్ల మాట్లాడరు. అంతా ఇంగ్లీషే..! ప్రపంచమంతా కరోనా... కరోనా అని వార్తలు వస్తున్నపుడు, 'మౌత్ అల్సర్', యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్', 'నోటికి మాస్క్ కట్టుకో' అంటే మా నాయనకు ఏమర్థం అవుతుంది సార్? మందులు కాదు, ఆ డాక్టర్లు మా నాయనకు భయాన్ని ఇచ్చుండారు'' అన్నారు బాలమురళి.

ఆదివారం మధ్యాహ్నం తన తండ్రిని వెతికిపట్టుకున్నాక, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు, అన్ని ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేశానని బాలమురళి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కరోనావైరస్ టోల్ ఫ్రీ నంబర్, ఇతర ఏ అత్యవసర సేవల విభాగంవారు స్పందించలేదని ఆయన ఆరోపించారు.

''అధికారులు ఎవరైనా వచ్చి నాయనకు కౌన్సెలింగ్ ఇస్తారన్న ఆశతో, ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 4గంటల వరకు, కనిపించిన అన్ని టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసినా సార్. కరోనావైరస్ నోడల్ ఆఫీసర్ నంబరు తెలుసుకుని ఫోన్ చేసి విషయం చెబితే, 'మీ నాయన చైనా, జపాన్ పోలేదుకదా, ఏమీ కాదులే' అని నిర్లక్ష్యంగా మాట్లాడినాడు. 100కు ఫోన్ చేస్తే, గొడవలు, కొట్లాటలు చేస్తే వస్తాంకానీ, ఇట్ల మేం రాలేమన్నారు. ఇంగోవైపు రుయా ఆస్పత్రిలో డాక్టర్లు ఇంగ్లీషులో మాట్లాడి భయపెట్టుండారు. చివరికి ప్రాణం పోయింది సార్'' అన్నారు బాలమురళి.

ఈ విషయంపై రుయా ఆస్పత్రి ఆసిస్టెంట్ ఆర్‌ఎంవో ఈఆర్ హరికృష్ణ బీబీసీతో మాట్లాడారు. బాలకృష్ణ ఆస్పత్రికి వచ్చినప్పుడు కాస్త దగ్గుతున్నాడని, కాబట్టి ముందు జాగ్రత్తగా మాస్క్ ధరించమని చెప్పామని, దగ్గు, తుమ్ముల లాంటి లక్షణాలు కనిపిస్తే ఎవరికైనా అదే సలహా ఇస్తామని ఆయన అన్నారు.

ఈవిషయమై చిత్తూరు జిల్లా వైద్యాధికారులను బీబీసీ సంప్రదించింది. "కరోనా వైరస్ గురించి మండలస్థాయి నుంచి, రేణిగుంట విమానాశ్రయం వరకు అన్నిచోట్ల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ వైరస్ సోకకుండా తీసుకోవల్సిన ముందుజాగ్రత్తల గురించి కరపత్రాలు, ఫ్లెక్సీలు, పోస్టర్ల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం, ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం" అని డాక్టర్ పెంచలయ్య చెప్పారు.

బాలకృష్ణయ్య ఆత్మహత్య చేసుకున్న విషయం తమకు ఆలస్యంగా తెలిసిందన్న బి.ఎన్.కండ్రిగ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి. ఆరోహణారావు, ''బాలకృష్ణయ్య ఆత్మహత్యకు సంబంధించి మాకు ఎలాంటి సమాచారం లేదు. ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదు. విషయం బయటకు పొక్కి, మాకు తెలిసేటప్పటికి బాలకృష్ణయ్య మృతదేహాన్ని దహనం చేశారు. పూడ్చిపెట్టినా దర్యాప్తు సులువయ్యేది. మేం ఎలాంటి కేసును ఫైల్ చేయలేకపోయాం'' అని అన్నారు.

మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే వెంటనే మీ దగ్గర్లోని మానసిక వైద్యుడిని సంప్రదించండి. One Life +91 7893078930, Roshni Trust: +91 40 6620 2000, +91 40 6620 2001, Makro Foundation - Suicide Prevention Helpdesk +91 040 46004600లను సంప్రదించండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)