కరోనావైరస్: ‘నాకూ కోవిడ్-19 పరీక్ష జరగొచ్చు’ - డోనల్డ్ ట్రంప్.. అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ

కరోనావైరస్ విజృంభణను అడ్డుకునేందుకుగాను చేపట్టిన చర్యలకు మద్దతుగా నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.

అమెరికాలో కరోనావైరస్ పరీక్షలు చాలా ఆలస్యం అవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఎమర్జెన్సీని ప్రకటించిన నేపథ్యంలో ఈ పరీక్షల నిర్వహణ వేగం పుంజుకునే అవకాశాలున్నాయి. అలాగే, అత్యయిక ఉపశమన నిధుల నుంచి 50 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3.6 లక్షల కోట్లు) ప్రభుత్వం ఖర్చు చేసుకునే అవకాశం లభిస్తుంది.

అమెరికాలో ఇప్పటి వరకూ 1701 కోవిడ్-19 కేసులు నిర్థరణ అయ్యాయి. 40 మంది చనిపోయారు.

వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చాలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడటాన్ని, క్రీడా కార్యక్రమాలను రద్దు చేశాయి. పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి.

వైరస్ మరింత ప్రబలకుండా నిరోధించడంలో వచ్చేవారం చాలా కీలకమని ట్రంప్ తెలిపారు.

‘నాకు స్వీయ గ‌ృహ నిర్బంధం అవసరం లేదు’ - ట్రంప్

కాగా, వీలైనంత త్వరలోనే తాను కూడా కోవిడ్-19 పరీక్ష చేయించుకునే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ చెప్పారు.

కరోనావైరస్ సోకినవారిని కలిసినప్పటికీ పరీక్ష ఎందుకు చేయించుకోలేదు? అన్న ప్రశ్నకు సమాధారంగా ట్రంప్ ఈ విషయాన్ని తెలిపారు. తనకు కరోనా లక్షణాలు ఏమీ లేవని, అందుకే ఇప్పటి వరకూ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం రాలేదని అన్నారు.

బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సెనారో మీడియా సెక్రటరీ ఫాబియో వజ్నగర్టెన్‌కు కరోనావైరస్ సోకినట్లు నిర్థరణ అయ్యింది. ఈమధ్యనే ట్రంప్ ఫ్లోరిడా పర్యటనకు వెళ్లారు. అక్కడికి వచ్చిన బ్రెజిల్ అధ్యక్షుడితో పాటు ఫాబియోను కూడా కలిశారు. ట్రంప్‌తో భుజంభుజం కలిపి నిలబడిన ఫొటోను ఫాబియో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

కోవిడ్-19 వ్యాధి వచ్చినవారిని కలిసిన ఎవరైనా సరే 14 రోజులపాటు ఇతరులు ఎవరినీ కలవకుండా స్వీయ గృహ నిర్బంధంలో గడపాలని అమెరికా అధికారికంగా సలహా ఇచ్చింది.

కానీ, తనకు కరోనా లక్షణాలు ఏమీ లేనందువల్ల తాను స్వీయ గృహనిర్బంధంలో ఉండాల్సిన పనిలేదని ట్రంప్ చెప్పారు.

కరోనా మహమ్మారికి కేంద్రంగా మారిన యూరప్ - డబ్ల్యుహెచ్ఓ

ప్రపంచ కరోనావైరస్ మహమ్మారికి యూరప్ కేంద్రంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) తెలిపింది.

ప్రజల ప్రాణాలను కాపాడేందుకు యూరప్ దేశాలన్నీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డబ్ల్యుహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనమ్ ఘెబ్రెయెసస్ కోరారు.

యురోపియన్ యూనియన్‌లో భాగమైన ఇటలీ దేశంలో గత 24 గంటల్లో 250 మంది చనిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తంగా కరోనావైరస్ మృతుల సంఖ్య 1266కు చేరింది. 17660 మందికి కోవిడ్-19 సోకినట్లు నిర్థరణ అయ్యింది.

ఆ తర్వాత ఎక్కువ మరణాలు నమోదైన యురోపియన్ దేశం స్పెయిన్. ఇక్కడ శుక్రవారం ఒక్కరోజే 120 మంది చనిపోయారు.

ప్రపంచవ్యాప్తంగా 123 దేశాల్లో కోవిడ్-19 వచ్చినట్లు నిర్థరణ అయిన కేసుల సంఖ్య 1,32,500 అని డబ్ల్యుహెచ్ఓ ప్రకటించింది. కరోనా మృతుల సంఖ్య 5 వేలకు చేరిందని వెల్లడించింది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)