WHO హెచ్చరిక: ‘కరోనావైరస్ ఎప్పటికీ పోకపోవచ్చు’

కరోనావైరస్ ‘ఎప్పటికీ పోకపోవచ్చు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) హెచ్చరించింది.

బుధవారం మీడియాతో మాట్లాడిన డబ్ల్యుహెచ్ఓ అత్యవసర పరిస్థితుల డైరెక్టర్ డాక్టర్ మైక్ రియాన్ వైరస్ ఎప్పుడు అంతమవుతుందో ఊహించడానికి చేస్తున్న ప్రయత్నాలను హెచ్చరించారు.

“వ్యాక్సిన్ కనుగొన్నప్పటికీ, ఈ వైరస్‌ను అదుపు చేయడానికి ఒక ‘భారీ ప్రయత్నం’ అవసరమవుతుంది’’ అని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వల్ల దాదాపు 3 లక్షల మంది చనిపోగా.. 43 లక్షల 45 వేలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.

“కరోనా మన సమాజాల్లో మరో అంటువ్యాధి వైరస్‌గా మారవచ్చు. ఇది ఎప్పటికీ మనకు దూరం కాకపోవచ్చు అనేది గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం” అని డాక్టర్ రియాన్ జెనీవా నుంచి ఇచ్చిన వర్చువల్ మీడియా సమావేశంలో చెప్పారు.

“హెచ్ఐవీ పోలేదు, కానీ మనమే ఆ వైరస్‌తో కలిసిపోయాం. ఈ వ్యాధి ఎప్పుడు అంతమవుతుందో ఎవరైనా ఊహించగలరని నాకు అనిపించడం లేదు” అని డాక్టర్ రియాన్ అన్నారు.

ప్రస్తుతం దీనికోసం 100కు పైగా టీకాలను తయారు చేసే పనిలో ఉన్నట్టు చెబుతున్నారు. కానీ తట్టు లాంటి కొన్ని ఇతర వ్యాధులకు టీకాలు కనిపెట్టినా, వాటిని అంతం చేయలేకపోయామని డాక్టర్ రియాన్ చెప్పారు.

ఆ రెండూ ప్రమాదమే

గట్టి ప్రయత్నాలతో వైరస్‌ను అదుపు చేసే అవకాశం ఇప్పటికీ ఉందని డబ్ల్యుహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసస్ బలంగా చెబుతున్నారు.

“ఆ మార్గం మన చేతుల్లో ఉంది. అది ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈ మహమ్మారిని అడ్డుకోడానికి మనమంతా కలిసి భాగస్వామ్యం అందించాలి” అని ఆయన అన్నారు.

డబ్ల్యుహెచ్ఓ ఎపిడమాలజిస్ట్ మరియా వాన్ కెర్‌ఖోవ్ కూడా ఈ సమావేశంలో మాట్లాడారు. “ఈ మహమ్మారి నుంచి బయటపడ్డానికి మనకు కొంతకాలం పడుతుందనే మనస్తత్వాన్ని మనం అలవర్చుకోవాలి” అన్నారు.

లాక్‌డౌన్‌ను క్రమంగా ఎత్తివేస్తూ, తమ ఆర్థికవ్యవస్థలను ఎప్పుడు, ఎలా తెరవాలి అనేదానిపై ఆయా దేశాధినేతలు ఆలోచిస్తున్న సమయంలో డబ్ల్యుహెచ్ఓ ఈ స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది.

సెకండ్ వేవ్ ఇన్ఫెక్షన్లను చూడకుండానే ఆంక్షలను సడలించేలా భరోసా అందించే మార్గం ఏదీ లేదని డాక్టర్ ట్రెడో హెచ్చరించారు.

“చాలా దేశాలు రకరకాల చర్యల నుంచి బయటపడాలని చూస్తున్నాయి. కానీ ఏ దేశం అయినా వీలైనంత ఎక్కువ స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మేం ఇప్పటికీ సిఫార్సు చేస్తున్నాం” అని డబ్ల్యుహెచ్ఓ చీఫ్ చెప్పారు.

“లాక్‌డౌన్ చాలా చక్కగా పనిచేసిందని, ఇక దానిని ఎత్తివేస్తే బాగుంటుందని కొంతమంది అనుకుంటున్నారు. ఆ రెండూ ప్రమాదాలతో కూడినవే” అని డాక్టర్ రియాన్ ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)