You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: విమానాల్లో మధ్యలోని సీట్లు ఖాళీగా వదిలేసి, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ తిరిగి ప్రయాణాలు ప్రారంభించవచ్చా?
- రచయిత, జాన్ వాల్టన్
- హోదా, బీబీసీ కోసం
కరోనావైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్లను ఎత్తేయాలని చాలా దేశాల్లో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ కట్టుబాట్లను సడలించడం మొదలు పెడితే.. విమాన ప్రయాణం ఎలా ఉంటుంది? అన్న కోణంలో విమానయాన కంపెనీలు పరిశీలించడం ప్రారంభించాయి.
విమానయాన సంస్థల నిర్వహణ వ్యయం భారీగా ఉంటుంది. విమానాలన్నింటినీ ప్రయాణాలు లేకుండా విమానాశ్రయాల్లో నిలిపి ఉంచినా కూడా చాలా ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా వాటిని రన్‌వే పైకి ఎక్కించాలని విమానయాన కంపెనీలు కోరుకుంటున్నాయి. అయితే, తిరిగి ప్రయాణాలు ప్రారంభించాలంటే ఎన్నో సవాళ్లు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ప్రయాణీకుల విశ్వాసాన్ని పొందడం. అలాగే, ఒక ప్రయాణీకుడికీ, మరొక ప్రయాణీకుడికీ మధ్య సాధ్యమైనంత దూరాన్ని పాటించేలా చూడటం ఎలా అన్నది కూడా.
దీంతో విమానాల్లో మధ్య సీట్లను ఖాళీగా వదిలేయాలని చాలా విమానయాన సంస్థలు అనుకుంటున్నాయి. అంటే, మూడు సీట్లలో మధ్యలోని సీటులో ఎవరూ లేకపోతే, మిగతా రెండు సీట్లలో కూర్చునే ప్రయాణీకుల మధ్య కొంత దూరం సాధ్యమవుతుంది. ఈ ప్రతిపాదన చేసిన వాటిలో యురోపియన్ విమానయాన సంస్థ ఈజీజెట్ ఒకటి. దాని ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లుండ్‌గ్రెన్ మాట్లాడుతూ.. ''కస్టమర్లు దీన్ని ఇష్టపడతారు'' అన్నారు. అలాస్కా ఎయిర్‌లైన్స్, విజ్ ఎయిర్ వంటి విమానయాన సంస్థలు సైతం ఇలాంటి ప్రణాళికలనే ప్రకటించాయి.
చాలామంది విమాన ప్రయాణీకులకు ఈ మిడిల్ సీటు అస్సలు నచ్చదు. కాబట్టి, ఈ ప్రతిపాదనలను వాళ్లు చాలా ఆనందంగా స్వాగతించొచ్చు. కిటికీ పక్కన సీటులో కూర్చుంటే బయటి అందాలను ఆస్వాదించొచ్చు, తలవాల్చి, హాయిగా నిద్రపోవడానికి కూడా ఆసరా దొరుకుతుంది. ఇక దారిపక్కన సీటులో కూర్చుంటే టాయిలెట్‌కి వెళ్లడానికి, కాళ్లు చాపుకోవడానికీ వీలుగా ఉంటుంది. మధ్యసీటులో మాత్రం సాధారణంగా ఎవరికీ ఎలాంటి అదనపు లాభాలూ ఉండవు. పక్కవాళ్లతో కబుర్లు చెప్పే స్వభావం ఉన్నవారికి తప్ప.
అయితే, ఇలా మధ్య సీటును ఖాళీగా వదిలేస్తే నిజంగానే తగినంత సామాజిక దూరం పాటించినట్లు అవుతుందా? అలాగైతే, ఎంతకాలం పాటు విమానయాన సంస్థలు దీన్ని కొనసాగించాలి? కొంతకాలం తర్వాత కూడా దీన్ని పాటించడం కరెక్టేనా?
''ఇప్పుడైతే, మాకిది కావాలి. ఇలా చేయకపోతే అధికారిక మార్గదర్శకాలను పాటించనట్లే, పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కామన్‌సెన్స్‌కు కూడా వ్యతిరేకం అవుతుంది. వైరస్ సోకడాన్ని తగ్గించేందుకు ఇప్పటికిప్పుడు ఇలా చేయడం (సామాజికదూరం పాటించడం) తప్పనిసరి అయ్యింది, ఈ పరిష్కారం అద్భుతమైనది కాకపోయినా కూడా'' అని వివరించారు టోక్యో కేంద్రంగా పనిచేసే లిఫ్ట్ ఏరో డిజైన్ మేనేజింగ్ డైరెక్టర్ డానియెల్ బారన్. ఈ కంపెనీ విమానయాన సంస్థలకు క్యాబిన్లు రూపొందిస్తుంటుంది. కస్టమర్లకు ప్రయాణ అనుభూతిని మెరుగుపర్చే డిజైన్లను తయారు చేస్తుంది. ''దీర్ఘకాలం పాటు మాత్రం ఇది ఆర్థికపరంగా మనగలిగేది కాదు. ఇప్పుడున్న పరిస్థితి సద్దుమణిగిన తర్వాత మనమంతా చౌకగా ప్రపంచ ప్రయాణం చేయడానికే మొగ్గుచూపుతాం. దానికి తగినట్లుగా విమానయాన సంస్థలు ధరల్ని నిర్ణయించేందుకు, ముఖ్యంగా ప్రయాణీకుల సంఖ్య తగ్గినప్పుడు, విమానంలోని అన్ని సీట్లూ నిండిపోవాలి''.
రెండు మీటర్ల థియరీ ప్రకారం నలుగురు ప్రయాణీకులకు 26 సీట్లు కావాలి
నిజం చెప్పాలంటే విమానాలు సామాజిక దూరం కోసం రూపొందించలేదు, దానికి వ్యతిరేకంగా రూపొందించాయి. అత్యంత తక్కువ ప్రదేశంలో వీలైనంత ఎక్కువ మంది ఉండేలా విమానాలను రూపొందించేందుకు గత కొన్నేళ్లుగా వేల కోట్లు ఖర్చు చేశారు. ఉదాహరణకు భారీగా, వెడల్పు బాడీ, లోపల రెండు నడకదారులు, రెండు ఇంజిన్లు ఉన్న బోయింగ్ 777 విమానం 1990ల్లో ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ విమానాల ఎకానమీ క్లాసుల్లో, ముఖ్యంగా సుదీర్ఘ ప్రయాణాలు చేసేవాటిలో అడ్డు వరుసలో తొమ్మిది సీట్లుంటాయి. ఇప్పుడు దాదాపు అన్ని విమానయాన సంస్థలూ ఈ విమానాన్ని నడుపుతున్నాయి. సుదీర్ఘ దూరాలు ప్రయాణించే ఎమిరేట్స్ వంటి సంస్థల విమానాల్లో 9 సీట్లుంటే, తక్కువ దూరాలు ప్రయాణించే జపాన్ వంటి చోట్లపది సీట్లున్న విమానాలనూ వాడుతున్నారు. అంటే వీటిలో సీట్లు, నడకదారులు చాలా చిన్నవిగా ఉంటాయన్నమాట.
కోవిడ్-19 నేపథ్యంలో బాధ్యతాయుతమైన సామాజిక దూరం అంటే అర్థం ప్రతి మనిషీ ఇతరులకు కనీసం 2 మీటర్లు (ఆరడుగులు) దూరం పాటించాలి. ఆధునిక విమానాల్లో ఇది అసాధ్యం. వీటిలో సీట్లు అడ్డంగా 45 సెంటీమీటర్లు (17 నుంచి 18 అంగుళాలు ఉంటాయి. ఒకవేళ మధ్యసీటును ఖాళీగా వదిలేసినప్పటికీ పక్కవారితో ఉండే దూరం 45 సెంటీమీటర్లు మాత్రమే. రెండు మీటర్ల దూరం పాటించాలంటే కనీసం నాలుగు సీట్ల దూరంలో కూర్చోవాలి. సింపుల్‌గా చెప్పాలంటే, ఒకే నడకదారి ఉన్న, అడ్డు వరుసలో ఆరు సీట్లున్న (భారతదేశంలో దేశీయ విమానాల్లో ఎక్కువ శాతం ఇలాగే ఉంటాయి) విమానాల్లో ప్రయాణీకులంతా కిటికీల పక్కన మాత్రమే కూర్చుని ప్రయాణించాలి.
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
ఇప్పుడు చెప్పుకున్నదంతా అడ్డు వరుసలో కూర్చునే ప్రయాణీకుల గురించి. ఇక ముందు, వెనుక కూర్చునే వారి గురించి మాట్లాడుకుంటే.. విమానాల్లో ఒక వరుసకూ, మరో వరుసకూ సీట్ల మధ్య దూరం 75 నుంచి 80 సెంటీమీటర్లు (29 నుంచి 32 అంగుళాలు) ఉంటుంది. మనం రెండు మీటర్ల దూరం పాటించాలి అంటే ప్రతి ప్రయాణీకుడికీ ముందు, వెనుక రెండు వరుసల సీట్లను ఖాళీగా ఉంచాలి. దీనర్థం.. ప్రతి నలుగురు ప్రయాణీకుల కోసం 26 సీట్లు కాళీగా వదిలేయాలి. అప్పుడు విమానంలో 15 శాతం మాత్రమే నిండుతుంది. ఈ శాతాన్నే విమానాలు 'లోడ్ ప్యాక్టర్' అంటాయి.
సైద్ధాంతికంగా, విమానయాన సంస్థలన్నీ కనీసం తమ ఖర్చులు వసూలయ్యేలాగా విమానాలు నడపాల్సి ఉంటుంది.
లోడ్ ఫ్యాక్టర్ అంటే.. ప్రయాణీకులతో నిండిన సీట్ల శాతం.. వాటి ద్వారా విమానాన్ని నడిపేందుకు చేసే ఖర్చంతా వసూలవుతోందా, ఇలా విమానం నడపొచ్చా? అన్నవి నిర్థరించుకునే అంశం. ఒక నిర్దిష్ఠ లోడ్ ఫ్యాక్టర్ వద్ద విమానాలు నడపడం వల్ల లాభాలు వస్తాయి. ఆయా రూట్లలో విమానాలను నడపడం వల్ల నష్టాలు వస్తాయా? రావా? అనేది ఆ రూట్‌లో ప్రయాణించే ప్రయాణీకులపై ఆధారపడి ఉంటుంది. 2019వ సంవత్సరంలో అంతర్జాతీయ విమాన రవాణా సంఘం (ఐఏటీఏ) గణాంకాల ప్రకారం ప్రపంచ సగటు లోడ్ ఫ్యాక్టర్ 84 శాతం. ప్రాంతీయంగా చూస్తే.. ఉత్తర అమెరికాలో 89 శాతం, ఆఫ్రికాలో 71 శాతం, ఆసియా పసిఫిక్‌లో 82 శాతం. భారతదేశంలో దేశీయ (డొమెస్టిక్) లోడ్ ఫ్యాక్టర్ 87.4 శాతం.
3-3 లేఔట్ (మూడు సీట్ల చొప్పున రెండు నిలువు వరుసలు) ఉండే బోయింగ్ 737, ఎయిర్ బస్ ఎ320 విమానాల్లో కానీ, భారీ విమానాలు, 3-3-3 లేఔట్ ఉండే బోయింగ్ 787, ఎయిర్ బస్ ఎ350 వంటి వాటిలో మధ్య సీటును ఖాళీగా వదిలేస్తే విమానంలోని మిగతా సీట్లన్నీ ప్రయాణీకులతో నిండినా లోడ్ ఫ్యాక్టర్ 66.7 శాతం అవుతుంది. ఈ లోడ్ ఫ్యాక్టర్‌తో నష్టాలు రాకుండా విమానాలు నడపడం విమానయాన సంస్థలకు సాధ్యం కాదు.
ఎయిర్‌లైన్ టారిఫ్ పబ్లిషింగ్ కంపెనీలో కాటలాగ్డ్ డాటా విభాగానికి నేతృత్వం వహిస్తున్న జేసన్ రాబిన్‌విజ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ను బట్టి చూస్తే కొంతకాలం పాటు ఇది మంచిదేనని అన్నారు. ''విమానయాన సంస్థల లోడ్ ఫ్యాక్టర్ తక్కువగా ఉన్నంతకాలం ఎలాంటి సమస్యలూ లేకుండా అవి మధ్య సీట్లను ఖాళీగా వదిలేస్తాయి. ప్రస్తుతం ప్రయాణిస్తున్న విమానాలు ఇలాగే చేస్తున్నాయి, ఎందుకంటే వాటి లోడ్ ఫ్యాక్టర్ తక్కువే ఉంది, మిడిల్ సీట్లలో కూర్చోబెట్టేంత మంది ప్రయాణీకులు లేరు కాబట్టి'' అని ఆయన వివరించారు.
ఇప్పుడు రాకపోకలు సాగిస్తున్న విమానాలన్నీ.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్‌డౌన్ కారణంగా కొందరు ప్రజలను, సరుకులను రవాణా చేస్తున్నాయి.
అయితే, ప్రస్తుత పరిస్థితి ఎల్లకాలం కొనసాగదు. ప్రభుత్వాలు నిబంధనలను మార్చి, సామాజిక దూరం పాటించడాన్ని తప్పనిసరి చేసి, ఆ విధంగా విమానయాన సంస్థలు కోల్పోతున్న ఆదాయాన్ని తిరిగి చెల్లిస్తే తప్ప. ''విమానయాన రంగం తిరిగి కోలుకుని, సాధారణ షెడ్యూల్ ప్రకారం విమాన ప్రయాణాలను మొదలు పెడితే లోడ్ ఫ్యాక్టర్ పెరుగుతుంది కాబట్టి మధ్య సీట్లను కూడా ఉపయోగించాల్సిన పరిస్థితి విమానయాన సంస్థలకు ఎదురవుతుంది'' అని రాబినోవిట్జ్ అన్నారు. ''రాబోయే రోజుల్లో ప్రయాణీకుల మధ్య వీలైనంత సామాజిక దూరాన్ని ఉంచేందుకు, విమానంలో ప్రయాణించే వారిని తదనుగుణంగా సీట్లలో కూర్చోబెట్టేందుకు విమానయాన సంస్థలు కష్టపడాల్సి వస్తుంది''.
కాబట్టి, మళ్లీ మనం విమాన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, మీ సీటు మారితే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
తీసుకోవాల్సిన చర్యల్లో దూరం ఒకటి మాత్రమే
అయితే, ఈ మధ్య సీటు ప్రతిపాదనపై అన్ని విమానయాన సంస్థలూ ఆసక్తి చూపట్లేదు. ర్యాన్ఎయిర్ సంస్థకు చెందిన మైఖేల్ ఓ లీరే స్పందిస్తూ.. కేవలం 45 సెంటీమీటర్ల దూరం వల్ల ఉపయోగం ఏమిటని, మరీ ముఖ్యంగా, నేలపై ఉన్నప్పుడు ప్రయాణీకులు తగినంత దూరం పాటించకపోతే విమానంలో దూరం పెట్టినా దాని ప్రభావం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు.
లిఫ్ట్ ఏరో డిజైన్స్‌కు చెందిన డేనియల్ బారన్ స్పందిస్తూ.. ప్రయాణాలు సురక్షితంగా జరిగేందుకు విమానయాన సంస్థలు తీసుకోవాల్సిన చర్యలు చాలా ఉన్నాయని చెప్పారు. ''క్యాబిన్‌లో గాలి ప్రసరణను మర్చిపోకూడదు. దాంతోపాటు విమానంలోకి వెళ్లే ముందే ప్రయాణీకులందరినీ పరీక్షించడం, క్యాబిన్‌ను శుద్ధి చేయడం, సీట్లను తెలివిగా సర్దుబాటు చేయడం, మాస్కులు ఉపయోగించడం వంటివన్నీ కొంతకాలం పాటు కొనసాగుతాయి''.
ఇంకా చాలాచాలా ఐడియాలు ముందుకొస్తున్నాయి. ప్రయాణీకులను విమానం వెనుకనుంచి ఎక్కించాలని డెల్టా ఎయిర్‌లైన్స్ నిర్ణయించింది. అంటే, విమానం ముందు సీట్లలో కూర్చునే ప్రయాణీకులంతా విమానం వెనుకవైపు నుంచి ఒక్కొక్కరుగా ఎక్కుతారు, అంటే వెనుక కూర్చున్న ప్రయాణీకులు ముందు కూర్చున్న వారిని దాటాల్సిన పనిలేదు. అలాగే, ఈ విమానయాన సంస్థ తక్కువ తక్కువ మంది విమానం ఎక్కేలా, తద్వారా సామాజిక దూరం మెరుగయ్యేలా చూస్తోంది.
విమానం ప్రయాణించేప్పుడు లోపల రాకపోకల్ని తగ్గించే చర్యల్లో భాగంగా కొన్ని విమానయాన సంస్థలు ప్రయాణ సమయాల్లో ఆహారం అందించడాన్ని రద్దు చేయడమో, కుదించడమో చేస్తున్నాయి. కొన్ని విమానయాన సంస్థలు ప్రయాణీకులు అడిగినప్పుడల్లా మంచినీళ్లు ఇవ్వడానికి బదులు ఒకేసారి బాటిల్ ఇస్తున్నాయి. మరికొన్ని విమానయాన సంస్థలు గేట్ల వద్దే ఆహారం, మంచినీళ్లు ఉన్న సంచుల్ని ఇచ్చేస్తున్నాయి.
కోవిడ్-19 మన ప్రపంచాన్ని చాలా రకాలుగా ఇప్పటికే మార్చేసింది. దానితో పోరాడేందుకు మానవ ప్రావీణ్యాలను మెరుగ్గా ప్రదర్శించే క్రమంలో మరింతగా మన ప్రపంచం మారిపోతుంది. మనలో చాలామంది ప్రయాణాల్సి చేయాల్సి రావొచ్చు, అలా చేసేప్పుడు మనం ప్రయాణించే విధానాలు కూడా మారిపోతాయి.
(జాన్ వాల్టన్ విమానయాన రంగ జర్నలిస్ట్. )
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104
ఇవి కూడా చదవండి:
- మా ఇళ్లకు వెళ్లేదెప్పుడు? వలస కార్మికుల ప్రశ్న
- కోవిడ్-19 విషయంలో కొందరు నైజీరియన్లు తెగ సంబరపడుతున్నారు.. ఎందుకో తెలుసా
- కరోనావైరస్: మూలికా వైద్యానికి వైరస్ లొంగుతుందా? టీ తాగితే రాకుండా ఉంటుందా?
- కరోనావైరస్: కోవిడ్ పరీక్షల ఖర్చును ప్రజలే భరించాలా?
- కరోనావైరస్: ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? దీనితో కోవిడ్ వ్యాధి నయమవుతుందా? ఎంత ఖర్చవుతుంది?
- కరోనావైరస్ 2005లో వస్తే ఏం జరిగి ఉండేది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)