క‌రోనావైర‌స్: యూట్యూబ్‌లో త‌ప్పుదోవ ప‌ట్టించే వీడియోలు చూస్తున్న కోట్ల మంది యూజర్లు

యూట్యూబ్‌లో ఎక్కువ మంది చూసిన క‌రోనావైర‌స్ వీడియోల్లో నాలుగో వంతుకుపైనే ఫేక్ న్యూస్ లేదా త‌ప్పుదారి ప‌ట్టించేవి ఉన్నాయ‌ని‌ తాజా అధ్య‌య‌నం చెబుతోంది.

మొత్తంగా త‌ప్పుదారి ప‌ట్టించే వీడియోల‌ను నెటిజ‌న్లు 6.2 కోట్ల‌ సార్లు చూశారు.

ఫార్మా కంపెనీలు ఇప్ప‌టికే క‌రోనావైర‌స్ వ్యాక్సీన్‌ను త‌యారుచేశాయని, అయితే ఆ వ్యాక్సీన్‌ల‌ను కావాల‌నే విక్ర‌యించ‌డంలేద‌ని అస‌త్య స‌మాచారం ‌కూడా ప్ర‌ధాన‌ ఫేక్ న్యూస్‌ల‌లో ఒక‌టి.

ఇలాంటి ప్ర‌మాద‌క‌ర, త‌ప్పుదారి ప‌ట్టించే స‌మాచారానికి క‌ళ్లెం వేసేందుకు తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని యూట్యూబ్ తెలిపింది.

ప్ర‌భుత్వ సంస్థ‌లు, ఆరోగ్య నిపుణులు అప్‌లోడ్ చేసిన వీడియోల్లో క‌చ్చిత‌మైన‌, నాణ్య‌మైన స‌మాచారం ఉంద‌ని తాజా ప‌రిశోధన చెబుతోంది.

అయితే, చాలాసార్లు ఈ వీడియోల్లో యూట్యూబ్ స్టార్లు, వ్లాగ‌ర్లు లేక‌పోవ‌డంతో ఎక్కువ మందికి చేరువ కావ‌డం లేద‌ని, కొన్నిసార్లు ఇవి సామాన్యుల‌కు అర్థ‌మ‌య్యే రీతిలో ఉండ‌టంలేద‌ని వివ‌రిస్తోంది.

బీఎంజే గ్లోబ‌ల్ హెల్త్‌లో ప్ర‌చురితమైన ఈ అధ్య‌య‌నంలో.. మార్చి 21 వ‌ర‌కూ ఎక్కువ మంది చూసిన క‌రోనావైర‌స్‌కు సంబంధించిన యూట్యూబ్ వీడియోల‌పై దృష్టి సారించారు.

గంట కంటే ఎక్కువ నిడివి ఉన్న‌వి, త‌గిన ఆడియో లేదా విజువ‌ల్స్ లేవిని, ఒకే లాంటి వీడియోల‌ను జాబితాలో నుంచి తొల‌గిస్తే.. అధ్య‌య‌నానికి 69 మాత్ర‌మే మిగిలాయి.

వైర‌స్ వ్యాప్తి, ల‌క్ష‌ణాలు, నియంత్ర‌ణ‌, శ‌క్తిమంత‌మైన చికిత్సా విధ‌నాల‌పై క‌చ్చిత‌మైన స‌మాచారం ఆధారంగా వీడియోల‌కు స్కోరింగ్ ఇచ్చారు. మిగ‌తావాటి కంటే ప్ర‌భుత్వ సంస్థ‌ల వీడియోల‌కు ఇక్క‌డ మంచి స్కోర్ వ‌చ్చింది. అయితే, వీటిని త‌క్కువ మంది చూశారు.

త‌ప్పుడు స‌మాచారమున్న 19 వీడియోల్లో:

  • మూడో వంతు వీడియోలు ఎంట‌ర్‌టైన్‌మెంట్ న్యూస్ అందించే ఛానెళ్ల నుంచి వ‌చ్చాయి.
  • నాలుగో వంతు వీడియోలు నేష‌న‌ల్ న్యూస్ సంస్థల నుంచి వ‌చ్చాయి.
  • ఇంట‌ర్నెట్ న్యూస్ ఛానెళ్లు మ‌రో నాలుగో వంతును అప్‌లోడ్ చేశాయి.
  • 13 శాతం వీడియోల‌ను సొంతంగా వీడియోలు చేసుకొనేవారు అప్‌లోడ్ చేశారు.

క‌చ్చిత‌మైన స‌మాచారమున్న వీడియోలు ఎక్కువ మంది చూడాలంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్ న్యూస్ అందించే సంస్థ‌లు, సోష‌ల్ మీడియాను ప్ర‌భావితంచేసే వ్య‌క్తుల‌తో ప్ర‌భుత్వ సంస్థ‌లు, ఆరోగ్య నిపుణులు చేతులు క‌లపాల‌ని అధ్య‌య‌నం సూచించింది.

"ఈ కీల‌క‌మైన స‌మ‌యంలో అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే స‌మాచారాన్ని స‌కాలంలో చేర‌వేసేందుకు సిద్ధంగా ఉన్నాం. హానిక‌ర‌, త‌ప్పుడు దారి పట్టించే వార్త‌ల‌ను క‌ట్టడి చేసేందుకూ క‌ట్టుబ‌డి ఉన్నాం. ఇలాంటి స‌మాచారానికి క‌ళ్లెం వేసేందుకు.. ఎన్‌హెచ్ఎస్‌, ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) విడుద‌ల‌చేసే వివ‌రాల‌తో ప్ర‌త్యేక స‌మాచార ప్యానెల్స్‌ను రూపొందిస్తున్నాం" అని యూట్యూబ్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

"క‌రోనావైర‌స్ క‌ట్ట‌డికి వైద్య చికిత్స‌లకు బ‌దులుగా నిరాధార‌మైన చికిత్సా విధానాల‌ను ప్రోత్స‌హించే వీడియోల‌ను అడ్డుకోవాల‌ని మాకు స్ప‌ష్ట‌మైన విధానాలున్నాయి. అలాంటి వీడియోలు కనిపించిన వెంట‌నే తొల‌గిస్తున్నాం. కోవిడ్‌-19 వ్యాప్తి, నియంత్ర‌ణ‌కు సంబంధించి.. డ‌బ్ల్యూహెచ్‌వో, ఎన్‌హెచ్ఎస్‌ల స‌మాచారానికి విరుద్ధంగా ఉండే వీడియోల‌న్నీ యూట్యూబ్ విధానాల‌ను ఉల్లంఘించే వీడియోల కింద‌కు వ‌స్తాయి. మ‌రోవైపు స‌మాచారం కొంచెం అటూఇటూగా ఉండే ప్ర‌మోట్ చేయ‌డం త‌గ్గించాం"

"ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌పై ఇలాంటి వీడియోల ప్ర‌భావాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు అంచ‌నా వేస్తున్నాం"

విశ్లేష‌ణ

‌మ‌రియానా స్ప్రింగ్‌, బీబీసీ సోష‌ల్ మీడియా రిపోర్ట‌ర్‌

ఇటీవ‌ల కాలంలో, యూట్యూబ్‌లో మెరుగులుదిద్దిన అస‌త్య వార్త‌లు చాలా ఎక్కువ‌య్యాయి. వీటిని ప్ర‌జ‌లు ఎక్కువ‌గా చూస్తున్నారు.

తాజా ప‌రిశోధ‌న‌లో వెలుగుచూసిన అంశాలు ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ప్ప‌టికీ.. ఆశ్చ‌ర్యంగా అనిపించ‌డం లేదు.

యూట్యూబ్‌లో ప్ర‌భుత్వ సంస్థ‌లు షేర్ చేసే స‌మాచారం క‌చ్చితంగా ఉంటున్న‌ప్ప‌టికీ.. సంక్లిష్టంగా ఉంటోంది.

ఇన్ఫెక్ష‌న్ త్వ‌ర‌గా త‌గ్గిపోయే చికిత్స‌ల కోసం ఎదురుచూసే ప్ర‌జ‌ల‌ను ఫేక్ వీడియోలు ఎక్కువ‌గా ఆక‌ర్షిస్తుంటాయి. ప్ర‌భుత్వ సంస్థలు అప్‌లోడ్‌చేసే వీడియోలకు వీటిలా ప్ర‌జాద‌ర‌ణ ఉండ‌దు.

నిర్మాణ విలువ‌లు మెరుగ్గా ఉండ‌టం, నిపుణుల‌తో చెప్పించే స‌మాధానాలు, మ‌ధ్య‌మ‌ధ్య‌లో సంబంధంలేని లెక్క‌లు చెబుతూ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించేలా ఈ వీడియోల‌ను త‌యారుచేస్తున్నారు.

ఇలాంటి వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో నియంత్రించ‌డమంటే పిల్లీ, ఎలుక‌ల కొ‌ట్లాటే అవుతుంది.

ఒక‌సారి వీడియో వైర‌ల్ అయ్యాక‌... సొంత ఛానెల్ దాన్ని తొల‌గించినా వినియోగ‌దారులు ప‌దేప‌దే అప్‌లోడ్ చేస్తుంటారు.

కేవలం న్యూస్‌తో సంబంధంలేని సంస్థ‌లు మాత్ర‌మే త‌ప్పుడుదోవ ప‌ట్టించే వీడియోల‌ను అప్‌లోడ్ చేయ‌డం లేద‌నే సంగ‌తి గుర్తుపెట్టుకోవాలి. వ్యూస్ కోస‌మో లేదా క్లిక్స్ కోస‌మో.. కొన్ని ప్ర‌ధాన మీడియా సంస్థ‌లూ త‌ప్పుడుదోవ ప‌ట్టించే వార్త‌ల‌ను ఎంచుకుంటున్నాయ‌ని తాజా అధ్య‌య‌నం చెబుతోంది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)