కరోనావైరస్: తీవ్ర అనారోగ్యం పాలైన 30 శాతం రోగుల రక్తం గడ్డ కట్టి ప్రాణాలు పోతున్నాయి - వైద్య నిపుణులు

    • రచయిత, రిచర్డ్ గాల్పిన్
    • హోదా, బీబీసీ న్యూస్

కరోనావైరస్ కారణంగా తీవ్ర అనారోగ్యం పాలైన రోగుల్లో 30 శాతం మందిలో ప్రమాదకరంగా రక్తపు గడ్డలు(బ్లడ్ కాట్స్) ఏర్పడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

వైద్యభాషలో థ్రాంబోసిస్ అనే ఈ బ్లడ్ క్లాట్స్ చాలామంది చనిపోవడానికి కారణమవుతున్నాయని చెబుతున్నారు. ఊపిరితిత్తుల్లో తీవ్రమైన మంట వల్ల ఇలాంటి క్లాట్స్ ఏర్పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

సాధారణంగా వైరస్ సోకినప్పుడు ఊపిరితిత్తుల్లో ఇలాంటి మంట కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా రోగులు అనేక సంక్లిష్ట ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ప్రాణాలు కోల్పోతున్నారు.

మార్చి నెలలో ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందిన దశలో వైద్యులు తాము ఊహించిన దానికంటే అధికంగా ఇలాంటి బ్లడ్ క్లాట్స్‌ను ఎక్కువమంది రోగుల్లో చూశారు.

అంతేకాదు... కొందరు రోగుల ఊపిరితిత్తుల్లో సూక్ష్మ పరిమాణంలో రక్తపు గడ్డలు ఏర్పడడాన్నీ గమనించారు.

ప్రమాదకరమైన సమస్య

ఏప్రిల్ నెలలో ఆర్టిస్ట్ బ్రయాన్ మెక్‌క్లూర్ కరోనావైరస్ కారణంగా వచ్చిన న్యుమోనియాతో బాధపడుతూ హాస్పిటల్‌లో చేరారు.

‘‘ఊపిరితిత్తులను స్క్రీనింగ్ చేయగా అందులో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. అవి చాలా ప్రమాదకరమని డాక్టర్లు నాకు చెప్పారు’’ అన్నారు బ్రయాన్.

‘‘దాంతో నాలో ఆందోళన మొదలైంది. ఆ బ్లడ్ క్లాట్స్ కనుక తగ్గకపోతే నా ప్రాణాలు ప్రమాదంలో పడతాయని అర్థమైంది’’ అన్నారాయన. ప్రస్తుతం ఆయన ఇంటిలో కోలుకుంటున్నారు.

హార్ట్ అటాక్ కూడా వస్తుంది

‘‘కొద్దివారాలుగా అందుబాటులో ఉన్న విస్తృత డేటా ఆధారంగా థ్రాంబోసిస్ ప్రధాన సమస్య అని స్పష్టమవుతోంది’’ అన్నారు లండన్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ థ్రాంబోసిస్, హీమోస్టాసిస్ ప్రొఫెసర్ రూపేన్ ఆర్య.

‘‘ముఖ్యంగా క్రిటికల్ కేర్‌లో ఉన్న కోవిడ్ రోగుల్లో సుమారు సగం మందికి ఊపిరితిత్తుల్లో పల్మనరీ ఎంబోలిజమ్ లేదా బ్లడ్ క్లాట్స్ కనిపిస్తున్నాయ’’న్నారు రూపేన్.

యూరప్‌లో ఇలా 30 శాతం మందిలో కనిపిస్తుందని చెబుతున్న డేటా కంటే కూడా ఈ శాతం ఎక్కువే ఉండొచ్చన్నారాయన. రూపేన్ ఆర్య బృందం రోగుల రక్తం శాంపిళ్లను విశ్లేషిస్తోంది.

కరోనావైరస్ వల్ల రోగుల రక్తానికి జిగురు స్వభావం పెరుగుతోందని.. దానివల్ల రక్తపు గడ్డలు ఏర్పడుతున్నాయని గుర్తించారు.

ఊపిరితిత్తుల్లో తీవ్రమైన మంట వల్ల రక్తంలో ఇలాంటి మార్పు వస్తోందని తేల్చారు. మొత్తానికి ఇవన్నీ కలిసి రోగి పరిస్థితిని విషమంగా మార్చేస్తున్నాయని రూపేన్ ఆర్య చెప్పారు.

థ్రాంబోసిస్ నిపుణురాలు ప్రొఫెసర్ బెవర్లీహంట్ చెబుతున్న ప్రకారం జిగురుగా మారిన రక్తం గడ్డకట్టడం కంటే ప్రమాదకర పరిస్థితులకూ దారితీస్తుంది. ఇది ఒక్కోసారి హార్ట్ అటాక్, స్ట్రోక్ కలిగిస్తుంది.

‘‘కరోనావైరస్ కారణంగా సంభవిస్తున్న మరణాల్లో అత్యధిక మరణాలకు ఇలా రక్తం జిగురుగా మారడం కారణం’’ అని ఆమె చెప్పారు.

రక్తాన్ని పలుచన చేసే మందుల ప్రయోగాలు

అయితే, ఇప్పటివరకు వివిధ రకాల రోగుల్లో రక్తపు గడ్డలను కరిగించడానికి వాడే బ్లడ్ థిన్నర్స్ ఈ కరోనా రోగులకు ఏ్పడుతున్న రక్తపు గడ్డల విషయంలో అన్నిసార్లూ పనిచేయడం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి.

దీనివల్ల ఇలాంటి మందులను డోసేజ్ పెంచి ఇస్తే రక్తస్రావం జరిగి చనిపోయే ప్రమాదముంది.

అయితే.. ఎంత మోతాదులో ఇలాంటి బ్లడ్ థిన్నర్స్ ఇవ్వాలనే విషయంలో ప్రయోగాలు జరుగుతున్నాయి.

మరోవైపు ఇంకొందరు నిపుణులు ఈ రక్తపు గడ్డలకు కారణమవుతున్న ఊపిరితిత్తుల్లో మంటను నివారించే ప్రయత్నం చేసినా సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటున్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)