నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్: పెట్టుబడుల కోసం పోటీ పడేందుకు రాష్ట్రాలకు ర్యాంకులు

పెట్టుబడులను త్వరితగతిన పరిష్కరించేందుకు ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్‌ను ఏర్పాటు చేస్తామని, ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులకు ఉన్న ఆకర్షణలను బట్టి రాష్ట్రాలకు ర్యాంకులు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ వివరాల్లో భాగంగా శనివారం నాలుగో విడత ప్రెస్ మీట్ పెట్టారు.

సోలార్ పీవీల ఉత్పత్తి, అడ్వాన్స్‌డ్ సెల్ బ్యాటరీల స్టోరీజీ వంటి సరికొత్త రంగాలను ప్రోత్సహిస్తామని తెలిపారు.

అన్ని రాష్ట్రాల్లోనూ పారిశ్రామిక మౌలిక సదుపాయాలను ఆధునీకరిస్తామని చెప్పారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలోని అన్ని పారిశ్రామిక పార్కులకు ర్యాంకులు ఇస్తామన్నారు.

బొగ్గు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాల్సి ఉందని, ఇందుకోసం ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తామని, ఈ మేరకు ఆదాయాన్ని పంచుకునే విధానాన్ని కూడా మారుస్తామని చెప్పారు.

దేశంలో కొత్తగా 50 బొగ్గు గనులకు తక్షణం అనుమతి ఇస్తామని చెప్పారు.

ఈ రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు.

దేశంలో ఖనిజాల రంగంలో కూడా ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తామని, 500 మైనింగ్ గనులకు వేలం నిర్వహిస్తామని చెప్పారు.

రక్షణ రంగంలో స్వీయ శక్తిని పెంచుకునేందుకు గాను ప్రతి ఏటా దిగుమతులను తగ్గిస్తామన్నారు.

రక్షణ రంగంలో ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) హద్దును ప్రస్తుతం ఉన్న 49 శాతం నుంచి 74 శాతానికి పెంచుతామని తెలిపారు.

పౌర విమానయాన రంగంలో ప్రతి ఏటా రూ.వెయ్యి కోట్ల లాభం వచ్చేలా భారతీయ వాయు మార్గాల్లో నిబంధనలను సడలిస్తామని చెప్పారు.

దేశంలో మరిన్ని విమానాశ్రయాలను ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడి (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేస్తామని, తొలి రెండు దశల్లో 12 విమానాశ్రయాలను రూ.13 వేల కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తామని చెప్పారు.

విమానాల నిర్వహణ, మరమ్మత్తులకు భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రాంతంగా మారుస్తామని వెల్లడించారు.

అలాగే, విద్యుత్ పంపిణీ సంస్థల్లో కూడా సంస్కరణలు అమలు చేస్తామని, కేంద్ర పాలిత ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీని ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తామన్నారు.

అంతరిక్ష రంగంలో కూడా ప్రైవేటు సంస్థను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రైవేటు సంస్థలకు కూడా ఉపగ్రహాలను తయారు చేయడం, ప్రయోగించడం, అంతరిక్ష ఆధారిత సేవలు అందించడానికి అవసరమైన కార్యాచరణ చేపడతామన్నారు.

అలాగే, అణు విద్యుత్ రంగంలో కూడా ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాన్ని పెంచుతామని వెల్లడించారు.

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చైనాను మించిపోయింది. శనివారం నాటికి దేశంలో కోవిడ్-19 రోగుల సంఖ్య దాదాపు 86 వేలకు చేరుకుంది.

భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 85, 940కి చేరుకుంది. చైనాలో ఈ కేసుల సంఖ్య 84,038.

భారత్‌లో ప్రస్తుతం 53,035 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 30,152 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

భారత్‌లో ఇప్పటివరకూ 2,752 మంది చనిపోగా, చైనాలో మాత్రం 4600 మంది మృతిచెందారు.

అయితే, కరోనావైరస్ విషయంలో ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే కనిపిస్తోంది.

అమెరికా, యూరప్‌ దేశాల్లో మృతుల సంఖ్య భారీగా ఉంది.

భారత్‌లో లాక్‌డౌన్‌ను రెండు సార్లు పొడిగించారు. ప్రస్తుత లాక్‌డౌన్ గడువు మే 17న ముగుస్తుంది.

మే 12న జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ను మళ్లీ పొడిగిస్తామన్నారు, కానీ ఈసారీ అది ఎప్పటివరకూ ఉంటుందో చెప్పలేదు.

ఈసారీ లాక్‌డౌన్ ఇంతకు ముందు కంటే భిన్నంగా ఉంటుందని, కొత్త నిబంధనలు ఉంటాయని ప్రధాని చెప్పారు.

వైరస్ వ్యాపించే రేటులో కూడా భారత ప్రభుత్వం చాలా సంతృప్తి వ్యక్తం చేసింది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం భారత్‌లో ప్రస్తుతం కేసులు రెట్టింపు అవడానికి 11 రోజులు పడుతోంది. లాక్‌డౌన్ ప్రారంభంలో అది 3.5 రోజులుగా ఉండేది.

భారత్‌లోని మొత్తం కరోనా కేసుల్లో మూడో వంతు మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, దిల్లీలోనే ఉన్నాయి.

కరోనా మహమ్మారి గత ఏడాది చైనాలో మొదలైంది. కానీ చైనా కఠిన లాక్‌డౌన్ వల్ల పరిస్థితి నియంత్రణలోకి వచ్చిందని భావిస్తున్నారు.

అయితే చైనాలో మహమ్మారికి కేంద్రంగా మారిన వుహాన్ నగరంలో ఇటీవల కొన్ని కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ మళ్లీ వ్యాపిస్తోందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో చైనా మొత్తం వుహాన్ అంతటా ప్రజలకు పరీక్షలు చేస్తామని ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 48 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2205కు చేరింది. వీరిలో 1353 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 803 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో కొత్త కర్నూలు జిల్లాలో ఒకరు కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 49కి పెరిగింది.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా గుంటూరు జిల్లాలో 9, కర్నూలులో 9, నెల్లూరులో 9, చిత్తూరులో 8, కృష్ణలో 8, విశాఖలో 4, కడప, పశ్చిమ గోదావరిలో ఒక్కో కేసు నమోదయ్యాయి.

తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చిన మొత్తం కేసుల సంఖ్య 31కి చేరింది.

అత్యధికంగా కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 608కి పెరిగింది.

ఫ్రాన్సులో తగ్గుతున్న మరణాలు

ఫ్రాన్సులో శుక్రవారం కరోనా వ్యాప్తి వల్ల సంభవించిన మరణాల సంఖ్య గత 24 గంటల్లో మూడు రెట్లు తగ్గాయి.

దేశంలో కొత్త కేసులు కూడా 0.4 శాతం రేటుతో నమోదవుతున్నాయి.

గురువారం దేశంలో 351 మంది చనిపోగా, శుక్రవారం ఆ సంఖ్య 104కు తగ్గిందని ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ చెప్పింది.

కరోనా వల్ల అమెరికా, బ్రిటన్, ఇటలీ తర్వాత ఫ్రాన్సులో అత్యధికంగా 27,523 మంది చనిపోయారు.

దేశంలో కొత్త కేసుల సంఖ్య 1,41,919కు చేరింది.

ఫ్రాన్సులో రెండు నెలల నుంచీ ఉన్న లాక్‌డౌన్‌ను ఈ వారమే సడలించారు.

షాపులు తెరుచుకోగా, పిల్లలు స్కూళ్లకు కూడా వెళ్తున్నారు. దేశంలో తిరగడానికి ఇప్పుడు పాస్‌ల అవసరం లేకుండా పోయింది.

కానీ రాజధాని ప్యారిస్‌, మరికొన్ని ప్రాంతాలు ఇప్పటికీ రెడ్ జోన్లోనే ఉన్నాయి. అక్కడ కఠినంగా వ్యవహరిస్తున్నారు.

సింగపూర్‌లో పెరుగుతున్న కేసులు

సింగపూర్‌లో కొత్తగా 465 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దేశ ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం వీటితో కలిపి సింగపూర్‌లో మొత్తం కేసుల సంఖ్య 27,635కు చేరింది.

కొత్త కేసుల్లో ఎక్కువగా వలస కార్మికులే ఉన్నారని అధికారులు చెప్పారు. సింగపూర్‌లో ఇప్పటివరకూ 21 మంది చనిపోయారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)