కరోనావైరస్: లాక్‌డౌన్‌కు ముందు 55 రోజుల్లో 500 కేసులు - లాక్‌డౌన్‌లో 55 రోజుల్లో లక్ష కేసులు... ఎలా పెరిగాయి?

    • రచయిత, అబినాష్ కంది
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్‌లో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష మార్కును దాటింది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటల వరకూ దేశంలో 1,01,139 కేసులు నమోదయ్యాయి.

వీటిలో యాక్టివ్ కేసులు 58,802 ఉన్నాయి. 39,174 మంది కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. 3,163 మంది మరణించారు.

మంగళవారం ఉదయం 9 గంటల వరకూ దేశవ్యాప్తంగా 24,04,267 కోవిడ్-19 పరీక్షలు జరిగాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.

గడిచిన 24 గంటల్లోనే లక్షకు పైచిలుకు పరీక్షలు నిర్వహించినట్లు వివరించింది.

దీన్నిబట్టి లెక్కగడితే పరీక్షించిన ప్రతి 24 మందిలో ఒకరు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అవుతున్నట్లు తెలుస్తోంది.

అంతకంతకూ పెరిగిన కేసులు

భారత్‌లో తొలి కరోనావైరస్ పాజిటివ్ కేసు జనవరి 30న నమోదైంది. ఆ సంఖ్య వందకు చేరడానికి 44 రోజుల సమయం పట్టింది. మరో పది రోజుల్లో కేసులు 500కు చేరాయి.

జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ సమాచారం ప్రకారం మార్చి 24 నాటికి దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు 536.

అంటే, మొదటి కేసు నమోదైనప్పటి నుంచి 500 కేసులు దాటడానికి పట్టిన సమయం 55 రోజులు.

ఆ మరుసటి రోజు మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఇప్పటికి మూడు విడతల లాక్‌డౌన్ పూర్తయి.. సోమవారం నుంచి నాలుగో విడత కొనసాగుతోంది.

మంగళవారం నాటికి మొత్తం 55 రోజుల లాక్‌డౌన్‌లో లక్ష కేసులు నమోదయ్యాయి.

లాక్‌డౌన్ తొలి విడత ఏప్రిల్ 14 వరకు, అంటే 21 రోజుల పాటు కొనసాగింది. ఈ వ్యవధిలో కేసులు పది వేల మార్కును దాటేశాయి.

రెండో విడత లాక్‌డౌన్ ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకూ (19 రోజులు) కొనసాగింది. ఇది ముగిసేనాటికి దేశంలో కరోనాపాజిటివ్ కేసుల సంఖ్య 42 వేలు. ఏప్రిల్ 15న దేశంలో 12,322 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ఉండగా... అవి 21నాటికి 20 వేలకు, 28నాటికి 30 వేలకు చేరుకున్నాయి.

మూడో విడత లాక్‌డౌన్ మే 4 నుంచి మే 17 (14 రోజులు) పాటు సాగింది. మే 6న కేసుల సంఖ్య 50 వేలు దాటింది. ఆ తర్వాత 12 రోజుల్లో రెండింతలై లక్షకు చేరింది.

లాక్‌డౌన్ నాలుగో విడత మే 18న మొదలైంది. 31న ముగియాల్సి ఉంది.

మిగతా దేశాలతో పోల్చితే మేలే...

భారత్ కాకుండా, లక్ష కేసులు దాటిన దేశాలు మరో పది ఉన్నాయి.

అవి.. అమెరికా, రష్యా, బ్రెజిల్, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ, ఇరాన్.

కేసులు వంద నుంచి లక్షకు చేరుకోవడానికి పట్టిన సమయం విషయంలో భారత్‌ మిగతా దేశాల కన్నా మెరుగ్గానే కనిపిస్తోంది. భారత్‌లో కేసులు వంద నుంచి లక్షకు చేరుకోవడానికి 64 రోజులు పట్టింది.

ప్రపచంలోనే అత్యధిక కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు ఉన్న అమెరికాలో కేసుల సంఖ్య వంద నుంచి లక్షకు చేరుకోవడానికి 25 రోజులు పట్టింది. ప్రస్తుతం ఆ దేశంలో 15 లక్షలకుపైగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు ఉన్నాయి.

ఇక యూరప్‌ దేశాల్లోకెల్లా కరోనావైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ఇటలీలో కేసులు వంద నుంచి లక్షకు పెరగడానికి 36 రోజులు పట్టింది. ఆ దేశంలో ఇప్పుడు 2.2 లక్షల కేసులు ఉన్నాయి.

వంద నుంచి లక్ష కేసులకు చేరడానికి స్పెయిన్‌కు 30 రోజులు, బ్రిటన్‌కు 42 రోజులు, ఫ్రాన్స్‌కు 39 రోజులు, జర్మనీకి 35 రోజులు పట్టాయి.

లక్షలో ఏడుగిరికి....

కరోనావైరస్ వ్యాప్తి మిగతా దేశాలతో పోల్చితే భారత్‌లో తక్కువగా ఉందని, ప్రతి లక్ష మందిలో 7.1 మంది మాత్రమే దీని బారినపడుతున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్త సగటు చూస్తే, ప్రతి లక్ష మందిలో 60 మందికి కరోనావైరస్ సోకుతోందని పేర్కొంది.

స్పెయిన్‌లో ఈ రేటు 494గా, అమెరికాలో 431గా ఉందని తెలిపింది. బ్రిటన్‌లో 361, ఇటలీలో 372, జర్మనీలో 210, ఫ్రాన్స్‌లో 209, రష్యాలో 195గా ఉన్నట్లు వివరించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 17 వరకూ వెల్లడించిన సమాచారం ఆధారంగా ఈ గణనలు చేసినట్లు తెలిపింది.

మహారాష్ట్రలో అత్యధికం

భారత్‌లో అత్యధికంగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. దేశంలోని మొత్తం కేసుల్లో దాదాపు 35 శాతం వాటా ఆ రాష్ట్రానిదే. మరణాల్లోనూ 39 శాతం ఆ రాష్ట్రంలోనే సంభవించాయి.

మంగళవారం ఉదయం వరకూ మహారాష్ట్రలో 39,058 కేసులు నమోదయ్యాయి. 1,249 మంది మరణించారు.

కేసుల సంఖ్య పరంగా మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో తమిళనాడు, గుజరాత్ ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పటివరకూ 11వేలకు పైగా పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అయితే మృతుల సంఖ్య విషయంలో మాత్రం తమిళనాడుకు, గుజరాత్‌కు వ్యత్యాసం ఎక్కువగానే ఉంది. తమిళనాడులో 81 మంది మరణించగా, గుజరాత్‌లో 694 మంది ప్రాణాలు కోల్పోయారు.‌

దిల్లీలో పది వేలకు పైగా కేసులు నమోదవ్వగా, 168 మంది మరణించారు.

రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల్లో ఐదు వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో 138 మంది, మధ్యప్రదేశ్‌లో 252 మంది మరణించారు.

పశ్చిమ బెంగాల్‌లో మరణాల తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ రాష్ట్రంలో 2,825 కేసులే నమోదైనప్పటికీ, 244 మంది ప్రాణాలు కోల్పోయారు.

''విజయం సాధించామనుకోలేం''

కరోనావైరస్ విషయంలో ప్రభుత్వం వెల్లడిస్తున్న గణాంకాలను చూసి భారత్ ఈ సంక్షోభంపై విజయం సాధించింది అనుకునే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి అన్నారు.

ఈ గణాంకాలు కేవలం సంకేతాలు మాత్రమేనని, పరీక్షలు విస్తృత స్థాయిలో చేసుంటే కేసుల సంఖ్య మరిన్ని రెట్లు ఎక్కువగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

''లాక్‌డౌన్ విధించడంతో కరోనావైరస్ కట్టడి అయిపోందన్నది నిజం కాదు. వాస్తవ పరిస్థితి వేరు. ప్రభుత్వ గణాంకాల్లో పారదర్శకత లేదు. ఓసారి డబ్లింగ్ రేటు అంటున్నారు. అది ప్రతికూలంగా మారితే, మరో గణాంకం చెబుతున్నారు. లాక్‌డౌన్‌తో కరోనావైరస్ వ్యాప్తి ఆగిపోతుందన్నారు. ఇప్పుడు లక్ష కేసులయ్యాయి'' అని తెలకపల్లి వ్యాఖ్యానించారు.

భారత్‌లోని బలహీనమైన వైద్య వ్యవస్థకు లాక్‌డౌన్‌తో కాస్త సమయం ఇచ్చినట్లైందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజల కోసం కాకుండా.. పరిశ్రమలు, వ్యాపారుల పక్షం వహించి ప్రభుత్వం ఇప్పుడు లాక్‌డౌన్‌కు సడలింపులు ఇచ్చిందని విమర్శించారు.

''లాక్‌డౌన్‌లో ఇబ్బందుల పడ్డ సామాన్యులే ఇప్పుడు సడలింపుల సమయంలోనూ బాధితులు అవుతారు. జీతాల మాటెత్తకుండా, వాళ్లు ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది వాళ్లే'' అని చెప్పారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)