కోవిడ్-19: ‘నేను వెంటిలేటర్ తొలగించి రోగి మరణించడానికి సహాయపడతాను’

    • రచయిత, స్వామినాథన్ నటరాజన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కోవిడ్-19 రోగులకు పెట్టిన వెంటిలేటర్లే ప్రాణం నిలవడానికి, పోవడానికి మధ్య వారధిగా నిలుస్తాయి.

రోగి సొంతంగా శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ పంపించి, కార్బన్ డయాక్సైడ్‌ని బయటకి తెచ్చే పనిని ఈ వెంటిలేటర్లు చేస్తాయి.

అలా అని కేవలం వెంటిలేటర్లు రోగి ప్రాణాన్ని కాపాడలేవు. కరోనావైరస్ కోసం చికిత్స తీసుకుంటూ ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల కనిపించని రోగుల నుంచి వెంటిలేటర్లను తొలగించడానికి డాక్టర్లు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.

"వెంటిలేటర్లని తొలగించడం మానసికంగా చాలా బాధాకరంగా ఉంటుంది. ఒక్కొక్కసారి రోగి మరణానికి నేనే కారణమేమో అనిపిస్తూ ఉంటుందని" జౌనిత నిట్ల చెప్పారు. ఆమె లండన్ రాయల్ ఫ్రీ హాస్పిటల్‌లో ప్రధాన నర్స్ గా పని చేస్తున్నారు.

దక్షిణ భారత దేశంలో పుట్టిన ఆమె గత 16 సంవత్సరాలుగా లండన్ నేషనల్ హెల్త్ సర్వీస్‌లో ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ నర్సుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

‘‘వెంటిలేటర్లను తొలగించడం నా వృత్తిలో భాగం’’ అని 42 సంవత్సరాల జౌనిత నిట్ల బీబీసీకి చెప్పారు.

ఆఖరి కోరిక

ఏప్రిల్ రెండవ వారంలో నిట్ల పొద్దునే డ్యూటీకి వెళ్ళేటప్పటికి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఒక కోవిడ్-19 రోగికి వెంటిలేటర్ తొలగించమని ఆదేశాలు అందాయి.

ఆ రోగి కూడా కమ్యూనిటీ వైద్యంలో నర్సుగా పని చేసేవారు. వెంటనే నిట్ల ఆ రోగి కూతురితో మాట్లాడారు.

"రోగి నొప్పితో లేరని ఆమె కుమార్తెతో చెప్పాను. ఆమె ఆఖరి కోరికలు కానీ, మతపరంగా పాటించాల్సిన అంశాలు ఏమన్నా ఉన్నాయేమోనని అడిగి తెలుసుకున్నాను."

ఐసీయూలో రోగుల మంచాలు ఒక దాని పక్కనే ఒకటి ఉంటాయి. ఈ రోగి చుట్టూ ఉన్న ఇతర రోగులు ఎవరూ స్పృహలో లేరు.

“ఆమె ఒక 8 పడకలు ఉన్న ఐసీయూలో ఉన్నారు. రోగులంతా అస్వస్థతతోనే ఉన్నారు. నేను కర్టెన్‌లు అన్నీ వేసేసి అలారంలు ఆపేసాను.”

“వైద్య బృందం అంతా ఒక్క క్షణం మౌనంగా ఉంటారు. మా రోగుల సౌకర్యం కూడా మాకు ముఖ్యమే” అని నిట్ల చెప్పారు.

“నేను నెమ్మదిగా ఫోన్ రిసీవర్‌ను రోగి చెవి దగ్గర పెట్టి వాళ్ళ అమ్మాయిని మాట్లాడమన్నాను”.

“నాకు అదొక ఫోన్ కాల్ మాత్రమే , కానీ అది ఆ రోగి కుటుంబానికి చాలా ముఖ్యమైన క్షణం. వాళ్ళు ఒక వీడియో కాల్ చేయమని అడిగారు. కానీ, ఐసీయూలోకి మొబైల్ ఫోన్‌లు అనుమతించరు”.

స్విచ్ ఆఫ్

“రోగి కుటుంబం కంప్యూటర్‌లో ఒక మ్యూజిక్ వీడియోని ప్లే చేయమని అభ్యర్ధించారు. ఆమె ప్రాణాలు వదిలే వరకు ఆమె చేతిని పట్టుకుని నేను పక్కనే ఉన్నాను”.

వైద్య బృందాలు రోగి వయస్సు, ఆరోగ్య పరిస్థితి, కోలుకునే అవకాశాలు అన్నీ పరిశీలించాకే, చికిత్సని కొనసాగించాలా? లేదా? అనే నిర్ణయం తీసుకుంటారు.

“వెంటిలేటర్ తొలగించిన ఐదు నిమిషాల్లోనే ఆ రోగి మరణించారు”.

“నేను ఐసీయూలో మానిటర్ మీద ఫ్లాష్ లైట్లని చూసాను. గుండె కొట్టుకునే వేగం సున్నాకి పడిపోయింది. స్క్రీన్ మీద ఫ్లాట్ లైన్ కనిపించింది”.

ఒంటరిగా మరణించడం

ఆమె నెమ్మదిగా రోగికి మత్తు మందులు ఇచ్చే ట్యూబ్‌లను తొలగించారు.

ఇవన్నీ తెలియని ఆమె కూతురు ఆమెతో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంది. ఫోన్‌లో ప్రార్ధనలు చేస్తూ ఉంది. ఫోన్ తీసుకుని వాళ్ళ అమ్మ ఇక బ్రతికి లేరని బరువెక్కిన హృదయంతో చెప్పాల్సి వచ్చింది నిట్లకి.

“ఒక నర్స్‌గా ఒక రోగి చనిపోవడంతో నా బాధ్యత తీరిపోదు”.

“ఒక కొలీగ్ సాయంతో ఆమెకి మంచం మీదే స్నానం చేయించి తెల్లని వస్త్రంలో చుట్టాం. ఆమె నుదుటి మీద సిలువ గుర్తు పెట్టి ఆమె శరీరాన్ని బ్యాగ్‌లో పెట్టాం” అని నిట్ల బీబీసీకి వివరించారు.

కరోనావైరస్ లేని రోజుల్లో రోగులకు చికిత్స ఆపే ముందు రోగి బంధువులు డాక్టర్లతో మాట్లాడేవారు.

లైఫ్ సపోర్ట్ తొలగించడానికి ముందు రోగి దగ్గర బంధువులని ఐసీయూలోకి రావడానికి అనుమతి ఇచ్చేవాళ్ళం. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

"అలా ఎవరూ లేకుండా ఒంటరిగా ఎవరైనా మరణించడం చూస్తే చాలా విచారకరంగా ఉంటుంది. నా సంరక్షణలో రోగి మరణించారనే భావన నేను కోలుకోవడానికి సహకరిస్తుంది”.

“నేను కొంత మంది రోగులు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటం చూసాను. అది కళ్ళతో చూడటం చాలా ఒత్తిడికి గురి చేస్తుంది”.

పడకల కొరత

కరోనావైరస్ బారిన పడి హాస్పిటల్లో చేరేవారి సంఖ్య పెరగడంతో హాస్పిటల్ అత్యవసర చికిత్స విభాగంలో బెడ్లని 34 నుంచి 60కి పెంచారు.

ఐసీయూలో 175 మంది నర్సులు ఉన్నారు.

సాధారణంగా అత్యవసర చికిత్స అందిస్తున్నప్పుడు ప్రతి పేషెంట్‌ని చూసుకోవడానికి ఒక నర్స్ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రతి ముగ్గురికి ఒక నర్స్ ఉన్నారు. క్రిటికల్ కేర్‌లో పని చేయడానికి హాస్పిటల్‌లోని ఇతర విభాగాల్లో పని చేస్తున్న నర్సులకు కూడా హాస్పిటల్ వాళ్ళు శిక్షణ ఇస్తున్నారు.

నిట్ల బృందంలో కొంత మంది నర్సులు కోవిడ్ 19 లక్షణాలు కనిపించడంతో స్వీయ నిర్బంధంలో ఉన్నారు.

‘‘షిఫ్ట్ మొదలయ్యే ముందు మేము ఒకరి చేతులు ఒకరు పట్టుకుని , జాగ్రత్తగా ఉండమని ఒకరికొకరు చెప్పుకుంటాం. ఒకరి మీద ఒకరం దృష్టి పెడతాం. అందరూ గ్లోవ్స్, రక్షణ పరికరాలు సరిగ్గా వేసుకున్నారో లేదో చూస్తాం’’ అని నిట్ల చెప్పారు.

వెంటిలేటర్లు, ఇన్ఫ్యూజన్ పుంపులు. ఆక్సిజన్ సిలిండర్లు, కొన్ని రకాల మందుల కొరత ఉంది. అయితే, హాస్పిటల్‌లో వైద్యం అందిస్తున్న వారందిరికి సరిపోయేంత రక్షణ పరికరాలు అందుబాటులో ఉన్నాయని ఆమె చెప్పారు.

ప్రతి రోజు ఐసీయూలో ఒక మరణం చోటు చేసుకుంటుందని చెప్పారు.

ఇది చూడటానికి చాలా కష్టంగా ఉంటుందని నిట్ల చెప్పారు.

“ఒక హెడ్ నర్స్‌గా నా భయాలను నాలోనే అణిచివేసుకుంటూ ఉంటాను”.

"రాత్రి పూట భయం వేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి నిద్ర పట్టదు. మాలో మేము మాట్లాడుకున్నపుడు అందరూ భయపడుతున్నారని అర్ధం అవుతుంది."

గత సంవత్సరం ఆమెకి టీబీ సోకడంతో కొన్ని నెలల పాటు సెలవులో ఉన్నారు. “కానీ ఇది మహమ్మారి. నేను నా సొంత విషయాలన్నీ పక్కన పెట్టి ఉద్యోగం చేస్తున్నాను”.

"నా షిఫ్ట్ పూర్తి అయ్యేటప్పుడు నా సంరక్షణలో మరణించిన రోగుల గురించి ఆలోచిస్తాను. కానీ, హాస్పిటల్ బయట అడుగు పెట్టగానే ఆ విషయాలన్నీ మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను".

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)