లాక్‌డౌన్ 4.0 మార్గదర్శకాలు: స్టేడియంల‌ను తెరవొచ్చు, ప్రేక్షకులు వెళ్ల కూడదు.. విమానాలు, మెట్రో రైళ్ల సేవలు రద్దు.. మే 31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఈనెలాఖరు వరకు పొడిగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి కూడా ఆదేశాలు ఇచ్చారు.

అలాగే, తాజా మార్గదర్శకాలను కూడా కేంద్ర హోం శాఖ జారీ చేసింది.

ఆ మార్గద్శకాల ప్రకారం..

31వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా నిషేధం కొన‌సాగేవి..

  • అంత‌ర్జాతీయ‌, దేశీయ విమాన సేవ‌లు. అయితే దేశీయ‌ ఎయిర్ అంబులెన్స్‌ల‌తో వైద్య సేవ‌ల కోసం, భ‌ద్ర‌తా అవ‌స‌రాల కోసం విమానాలు న‌డుస్తాయి.
  • మెట్రో రైలు సేవ‌లు
  • స్కూళ్లు, కాలేజీలు, ఇత‌ర విద్యా సంస్థ‌లు, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల‌నూ మూసే ఉంచాలి. అయితే ఆన్‌లైన్‌, డిస్టెన్స్ లెర్నింగ్ (దూర‌విద్య‌) కేంద్రాలు పనిచేస్తాయి.
  • హోట‌ళ్లు, రెస్టారెంట్లు, ఇత‌ర ఆతిథ్య సేవలందించే ప్రైవేటు ప్రాంగ‌ణాలు మూసే ఉంచాలి. అయితే ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, ప్ర‌భుత్వ అధికారులు, ఆశ్ర‌యం అందిస్తున్న సంస్థ‌లు, క్వారంటైన్ కేంద్రాలుగా ప‌నిచేస్తున్న‌వి కొన‌సాగుతాయి. రెస్టారెంట్లు హోమ్ డెలివ‌రీలు చేసుకోవ‌చ్చు.
  • సినిమా హాల్స్‌, షాపింగ్ మాల్స్‌, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్‌లు, ఎంట‌ర్‌టైన్‌మెంట్ పార్క్‌లు, థియేట‌ర్లు, బార్లు, ఆడిటోరియాలు, అసెంబ్లీ హాళ్లు కూడా మూసే ఉంచాలి. క్రీడా ప్రాంగ‌ణాలు, స్టేడియంల‌ను తెరిచేందుకు అనుమ‌తి ఉంది. అయితే అక్క‌డికి వీక్ష‌కులు వెళ్ల‌కూడ‌దు.
  • సామాజిక‌, రాజ‌కీయ‌, క్రీడా, వినోద‌, విద్యా, సాంస్కృతిక, మ‌త‌ప‌రైమ‌న కార్య‌క్ర‌మాలేవీ నిర్వ‌హించ‌డానికి, పెద్ద యెత్తున ప్ర‌జ‌లు ఒక‌చోట చేర‌డానికి అనుమ‌తి లేదు.
  • ప్రార్థనా మందిరాలు, ఆలయాల్లోకి భ‌క్తుల‌ను అనుమ‌తించ‌కూడ‌దు. మ‌త‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మాల కోసం భారీగా గుమిగూడంపై కఠిన ఆంక్ష‌లున్నాయి.

కంటైన్‌మెంట్ జోన్లు మిన‌హా మిగ‌తా ప్రాంతాల్లో అనుమ‌తించేవి..

  • రాష్ట్రాల‌ మ‌ధ్య ప్ర‌యాణికుల వాహ‌నాలు, బ‌స్సుల ర‌వాణా. అయితే దీనికి సంబంధిత రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల అనుమ‌తులు త‌ప్ప‌నిస‌రి.
  • రాష్ట్రాల మ‌ధ్య ప్ర‌యాణికుల వాహ‌నాలు, బ‌స్సుల ర‌వాణా. (కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించేవి)
  • ఏదైనా ప్రాంతంలో చిక్కుకున్న వారిని సుర‌క్షితంగా తర‌లించేందుకు చేప‌ట్టే సేవ‌లు

కరోనావైరస్‌ను నియంత్రించే చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మార్చి 25వ తేదీ నుంచి అమలవుతున్న లాక్ డౌన్‌ నేటితో ముగియాల్సి ఉంది. నాలుగో విడత పొడిగింపుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొద్ది రోజుల కిందటే సూచన ప్రాయంగా సంకేతాలు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరోమారు పొడిగిస్తూ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) సభ్య కార్యదర్శి ఆదివారం మధ్యాహ్నం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

తాజా ఉత్తర్వుల ప్రకారం దేశంలో లాక్‌డౌన్ మే 31వ తేదీ వరకు అమలులో ఉంటుంది.

అయితే, మొదటి దఫా లాక్‌డౌన్ నుంచి మూడో దఫా లాక్ డౌన్ వరకు నియమ నిబంధనలు, మార్గదర్శకాలు మారుతూ వచ్చాయి.

ఇదిలా ఉండగా, ఈ రోజు రాత్రి అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

కాగా, లాక్ డౌన్ పొడిగింపుపై ఆదివారం సాయంత్రం వరకూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలూ రాకపోవడంతో కొన్ని రాష్ట్రాలు తమంతట తాముగా లాక్ డౌన్‌ను పొడిగించాయి.

తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం తమతమ రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను ఈనెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఆదివారం మధ్యాహ్నం ప్రకటించాయి.

రాష్ట్రంలో కోవిడ్-19 ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ మెహతా పేర్కొన్నారు. ఈ ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించాలని రాష్ట్రంలోని అన్ని శాఖలు, విభాగాలకు సూచించారు.

కాగా, తమిళనాడు ప్రభుత్వం కూడా లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకూ పొడిగించింది.

మే 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు అన్నింటినీ మూసేయాలని ఆదేశించింది.

దేశం మొత్తంమీద కోవిడ్-19 కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, తమిళనాడు మూడో స్థానంలో ఉంది.

మహారాష్ట్రలో 30 వేలకు పైగా, తమిళనాడులో 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

కర్ణాటక ప్రభుత్వం సైతం రెండు రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)