కరోనావైరస్ ఫుట్‌బాల్: జర్మనీలో ప్రీమియ‌ర్ లీగ్ ఎలా మొదలైంది? మ్యాచ్‌లు ఎలా ఆడుతున్నారు?

    • రచయిత, ఎమ్లిన్ బెగ్‌లే
    • హోదా, బీబీసీ స్పోర్ట్ ప్రతినిధి

జ‌ర్మ‌నీ ఫుట్‌బాల్ ప్రీమియ‌ర్ లీగ్ బుండెస్‌లీగా శ‌నివారం ప్రారంభ‌మైంది. క‌రోనావైర‌స్ వ్యాప్తి ఆందోళ‌న‌ల న‌డుమ దీన్ని మొద‌లుపెట్టారు. ఇక‌పై జ‌ర‌గ‌బోయే ప్రీమియ‌ర్ లీగ్‌లు ఎలా ఉండ‌బోతున్నాయో దీన్ని చూస్తే అర్థమ‌వుతోంది.

ద‌క్షిణ కొరియా కేలీగ్ కూడా గ‌త‌వారం మొద‌లైంది. బెలార‌స్‌, నిక‌రాగ్వాలోని కొన్ని చిన్న లీగ్‌లూ ఎప్ప‌టిలానే జ‌రుగుతున్నాయి. అయితే క‌రోనావైర‌స్ మ‌హ‌మ్మారి భ‌యం మొద‌లైన రెండు నెల‌ల్లో మొద‌లైన ప్ర‌ఖ్యాత‌ ఫుల్‌బాల్ లీగ్ మాత్రం బుండెస్‌లీగానే.

ఇంత‌కీ ఫుట్‌బాల్ ఎలా ఆడుతున్నారు? క్రీడాకారులు ఎలా సామాజిక దూరం పాటిస్తున్నారు?

శ‌రీర ఉష్ణోగ్ర‌త ఎప్ప‌టిక‌ప్పుడు కొల‌వ‌డం, డిస్ఇన్ఫెక్టెంట్ బాల్స్‌

మైదానానికి వ‌చ్చేట‌ప్పుడు క్రీడాకారులు సామాజిక దూరం పాటించేందుకు వేర్వేరు బ‌స్సుల‌ను ఉప‌యోగిస్తున్నారు.

క్రీడాకారులు, క్రీడా సిబ్బంది.. ఇలా అంద‌రూ త‌మ‌కు కేటాయించిన హోట‌ళ్ల‌లో క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు క‌రోనావైర‌స్ ప‌రీక్ష‌లు చేయించుకుంటున్నారు.

బ‌స్సు దిగిన వెంట‌నే ఫేస్ మాస్క్‌లు వేసుకొని మైదానంలోకి అడుగుపెడుతున్నారు.

మీడియా ప్ర‌తినిధుల‌తోపాటు ఇత‌రుల‌ కోసం శరీర ఉష్ణోగ్ర‌త‌ల‌ను కొలిచే కేంద్రాలు ఏర్పాటుచేశారు.

ప్రేక్ష‌కులను ఎవ‌రినీ రానివ్వ‌డం లేదు. గ్రౌండ్ ప‌రిస‌రాల్లో ఎవ‌రూ గుమిగూడే అవ‌కాశం లేకుండా పోలీసులు గ‌స్తీ కాస్తున్నారు. మైదానంలోకి కేవ‌లం 213 మందినే అనుమ‌తిస్తున్నారు. వీరిలో క్రీడాకారులు, కోచ్‌లు, బాల్ బాయ్స్‌ల సంఖ్య 98కి మించ‌కుండా చూస్తున్నారు. మ‌రో 115 మంది.. భ‌ద్ర‌తా సిబ్బంది, వైద్యులు, మీడియా ప్ర‌తినిధులు.

స్టేడియం బ‌య‌ట భ‌ద్ర‌తా సిబ్బంది, సాంకేతిక సాయం అందించేవారి సంఖ్య మ‌రో 109 మంది వ‌ర‌కు ఉంటోంది.

గేమ్ మొద‌ల‌య్యే ముందు, మ‌ధ్య‌లో ఒక‌సారి డిస్ఇన్ఫెక్టెంట్ల‌తో ఫుట్‌బాల్స్‌ను శుభ్రం చేయిస్తున్నారు.

సామాజిక దూరం ఇలా..

అద‌న‌పు క్రీడాకారులు, కోచ్‌లు మాస్క్‌లు వేసుకొని సామాజిక దూరం పాటిస్తూ బెంచీల్లో కూర్చుంటున్నారు. కొన్నిసార్లు మ‌ధ్య‌లో ఒక వ‌రుస‌ను ఖాళీగా వ‌దిలేస్తున్నారు.

హెడ్ కోచ్‌ల‌ను మాత్రం మాస్క్‌లు లేక‌పోయినా అనుమ‌తిస్తున్నారు. వారు ఇచ్చే సూచ‌న‌లు క్రీడాకారుల‌కు విన‌ప‌డాలి కాబట్టి వారికి మాస్క్‌లు త‌ప్ప‌నిస‌రి కాదు.

క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు అద‌న‌పు క్రీడాకారులు మాస్క్‌లు తీసేసి గట్టిగా అరుస్తున్నారు. మ‌రోవైపు ప్లేయ‌ర్‌ల‌ను మార్చేట‌ప్పుడు కూర్చోడానికి వ‌చ్చే క్రీడాకారుడు మాస్క్ తెచ్చుకుంటున్నారు.

హ‌త్తు కోవ‌డానికి బ‌దులు.. మోచేత్తో సంబరాలు

శ‌నివారం ఆడిన ఆరు గేమ్‌ల‌లోనూ ఆట మాత్రం మునుప‌టిలానే ఉంది. మొద‌ట ఎవ‌రు 16 గోల్స్ వేస్తే వారే గేమ్ సొంతం చేసుకున్న‌ట్లు. కానీ గోల్ కొట్టిన ప్ర‌తిసారీ హ‌త్తుకొని వేడుక‌లు చేసుకొనే బ‌దులు.. మోచేయి, మోచేయి కొట్టుకుంటున్నారు.

అయితే, హోఫెన్‌హీమ్‌పై హెర్తా బెర్లిన్ క్రీడాకారులు గెలిచిన‌ప్పుడు సంబరాలు మునుప‌టిలానే క‌నిపించాయి. కానీ హెర్తా క్రీడాకారుల‌కు ఎలాంటి జ‌రిమానా విధించ‌లేదు. ఎందుకంటే హ‌త్తుకోకుండా ఉండ‌టం అనేది ఇక్క‌డ కేవ‌లం మార్గ ద‌ర్శ‌కం మాత్ర‌మే. నిబంధ‌న కాదు.

బెంచీల్లో ఉత్సాహం నింపేందుకు కేవ‌లం ప‌దుల సంఖ్య‌లో మాత్ర‌మే ప్ర‌జ‌లు క‌నిపించ‌డంతో.. ప్లేయ‌ర్లు, మేనేజ‌ర్లు మాట్లాడుకునేవి, బాల్ తన్నేట‌ప్పుడు వ‌చ్చే సౌండ్లు కూడా టీవీ చూసేవారికి వినిపిస్తున్నాయి.

క్రీడాకారులు, మేనేజ‌ర్ల‌ను ఇంట‌ర్వ్యూలు చేసేట‌ప్పుడు సామాజిక దూరం పాటించేలా చూసేందుకు రిపోర్ట‌ర్లు.. మైక్‌ల‌కు అద‌నంగా క‌ర్ర‌లు, రాడ్డుల‌ను క‌డుతున్నారు. మ్యాచ్‌ల అనంత‌రం ఇంట‌ర్వ్యూల‌ను వీడియో కాన్ఫెరెన్స్‌ల్లో చేస్తున్నారు.

ప్రేక్ష‌కులు రావ‌డం లేదా?

స్టేడియంల బ‌య‌ట జ‌నాలు లేకుండా చూసేందుకు జ‌నాలు త‌క్కువ‌గా ఉండే ప్రాంతాల‌ను గేమ్‌లు ఆడేందుకు ఎంచుకుంటున్నారు.

"చాలా ఆశ్చ‌ర్యంగా అనిపించింది. మా అంచనాల ప్ర‌కారం... అభిమానులు బాగానే వ‌స్తార‌ని అనుకున్నాం. కానీ సిటీ మ‌ధ్య‌లో జ‌రిగిన మ్యాచ్‌కు స్టేడియం బ‌య‌ట చాలా కొంచెం మంది మాత్రమే కనిపించారు"అని డార్ట్‌మండ్ పోలీసుల అధికార ప్ర‌తినిధి ఓలివ‌ర్ పీలెర్ తెలిపారు.

"పోలీసులు, న‌గ‌ర ప‌రిపాల‌నా విభాగం ప‌దేప‌దే చేసిన అభ్య‌ర్థ‌న‌లకు మంచి ఫ‌లితం వ‌చ్చిన‌ట్టు అనిపించింది. జ‌నాలు ఎక్కువ‌గా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. మాకు చాలా సంతోషంగా అనిపించింది".

అయితే ఈ ఫుట్‌బాల్ నిర్వ‌హ‌ణ విష‌యంలో అంద‌రూ సంతోషంగా లేరు.

"గోల్ కొట్టిన‌ప్పుడు సంబ‌రాలు చేసుకోక‌పోతే.. ఏదోలా అనిపిస్తుంది"

"ఈ రోజు చాలా వింత‌గా అనిపించింది. నాకు భావోద్వేగాలు కొంచెం ఎక్కువ‌గా ఉంటాయి. గోల్ కొట్టిన వెంట‌నే క్రీడాకారుణ్ని హ‌త్తుకొని అభినందించాల‌ని అనుకుంటాను. ఈ రోజు నేన‌ది చేయ‌లేక‌పోయా"అని ఫార్చునా డ‌సెల్‌డార్ఫ్ మేనేజ‌ర్ యూవ్ రోస్ల‌ర్ వివ‌రించారు.

"అసలు ఎలాంటి శ‌బ్దాలూ లేవు. గోల్ కొట్టిన‌ప్పుడు, బాల్ పాస్ చేసిన‌ప్పుడు, మంచి స్కోర్ వ‌చ్చినప్పుడు.. అంతా నిశ్శ‌బ్ద‌మే. ఇది చాలా వింత‌గా అనిపించింది"అని డార్ట్‌మండ్ కోచ్ లూసీన్ ఫార్వే అన్నారు.

"ప్రేక్ష‌కులు మ్యాచ్‌లు చూడ‌టానికి రాక‌పోవ‌డం బాధాక‌రం. మేం వారిని చూడ‌లేక‌పోతున్నాం. క‌ల‌వ‌లేక‌పోతున్నాం’’ అని ఫ్రీబ‌ర్గ్ కోచ్ క్రీస్టియ‌న్ స్ట్రీచ్ వ్యాఖ్యానించారు.

"ఈ ప‌రిస్థితి ఎప్పుడూ ఇలాగే ఉండ‌దు. అయితే ప్రేక్ష‌కులు రావ‌డం లేద‌నో లేక వారిని చూడ‌లేక‌పోతున్నామ‌నో నాణ్య‌త‌లో రాజీప‌డం".

మ‌రోవైపు సోష‌ల్ డిస్టెన్సింగ్ నిబంధన‌లు పాటించ‌కుండా సంబరాలు చేసుకోవ‌డాన్ని హెర్తా బెర్లిన్ అధినేత బ్రూనో ల‌బ్బాడియా స‌మ‌ర్థించారు.

"ఇది ఫుట్‌బాల్ ఆట‌లో భాగ‌మైపోయింది. అయినా మేం చాలాసార్లు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకుంటున్నాం. సంబ‌రాలు జ‌రుపుకోక‌పోతే ఏదో పోయిన‌ట్లు అనిపిస్తుంది".

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)