కరోనావైరస్: స్కూల్స్‌లో సామాజిక దూరం పాటించడం సాధ్యమేనా?

    • రచయిత, సీన్ కొగ్లాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చాలా దేశాల్లో లాక్ డౌన్ సడలింపులో భాగంగా స్కూళ్ళని కూడా తెరిచారు. ఇది ఎంత వరకు సురక్షితం అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

డెన్మార్క్, జర్మనీ లాంటి దేశాల్లో స్కూళ్ళని ఇప్పటికే తెరిచారు.

స్కూళ్ళు తెరవడం పట్ల సమాజంలో ఆందోళన నెలకొని ఉందని డెన్మార్క్‌లోని జీలాండ్‌లో సెయింట్ జోసెఫ్ స్కూల్ అంతర్జాతీయ విభాగానికి ప్రధాన అధికారిగా ఉన్న డోమ్ మహెర్ అన్నారు.

‘‘తల్లి తండ్రులు పిల్లల్ని స్కూల్‌కి పంపాలా వద్దా అనే విషయంలో రెండు ఆలోచనలతో ఉన్నారు. ఇంకా కొన్ని రోజులు వేచి చూద్దామని కొంత మంది చూస్తున్నారు’’ అని ఆయన అన్నారు

ఇప్పటికే స్కూళ్ళు తెరిచి నాలుగు వారాలు దాటింది. స్కూల్‌కి వచ్చే పిల్లల సంఖ్య కూడా రోజు రోజుకీ పెరుగుతోంది.

డెన్మార్క్‌లో ముందు ప్రైమరీ స్కూళ్ళు తెరిచారు. పిల్లలు ఒకరిని ఒకరు తాకకుండా దూరంగా ఉండే ఏర్పాట్లు చేశారు.

చిన్న చిన్న సమూహాలలో ఉండే ఈ పిల్లలు వేర్వేరు సమయాల్లో స్కూల్‌కి వచ్చి, ఒకరితో ఒకరు దూరంగా ఉంటూ భోజనం చేస్తారు. ప్లే గ్రౌండ్‌లో ఆడుకునేటప్పుడు వారి వారి స్థలాల్లో ఉంటూ ఆడుకుంటారు. వీరందరికీ ఒకే టీచర్ ఉంటారు.

ఈ సమూహాల్లో సుమారు 12 మంది పిల్లలు ఉంటారు. సామాజిక దూరం పాటించడానికి వీలుగా తక్కువ మంది పిల్లలని క్లాసులో ఉంచటం, తరగతులని విభజించడం లాంటివి చేస్తున్నారు.

నెరవేరగలిగే లక్ష్యాలు

డెన్మార్క్‌లో చాలా స్కూళ్లలో ప్రాధమిక, లోయర్ సెకండరీ తరగతులు ఒకే స్కూల్‌లో ఉంటాయని మహెర్ చెప్పారు. అంటే, సాధారణ స్థాయి కన్నా సగం మందికి మాత్రమే సరిపోయే స్థలం ఉంటుంది.

‘‘సగం మందికి సరిపోయేలా మా దగ్గర తగినన్ని తరగతి గదులు ఉన్నాయి. స్కూల్‌కి పిల్లలందరూ తిరిగి వస్తే మాత్రం సామాజిక దూరం పాటించడం కష్టం అవుతుంది. అప్పుడు, పొద్దున్న పూట సగం మందిని, మధ్యాహ్నం తరగతులకు మిగిలిన సగం మందిని రమ్మని చెప్పాలి’’ అని మహెర్ అన్నారు.

అలాగే డెన్మార్క్ స్కూళ్లలో చేతులు కడుక్కోవడం, శుభ్రత పాటించడం పట్ల ఎక్కువ దృష్టి పెడుతున్నారు.

ప్రతి గంటకీ పిల్లలు చేతులు కడుక్కుంటున్నట్లు మహెర్ చెప్పారు.

అయితే, చిన్న పిల్లలతో సామాజిక దూరం పాటించేలా చేయడం అంత సులభమైన పనేమీ కాదని ఆయన అన్నారు.

చాలా మంది దూరం పాటిస్తున్నప్పటికీ అప్పుడప్పుడూ మర్చిపోతూ ఉంటారు. పిల్లలకి గాని, టీచర్లకు గాని ఫేస్ మాస్కులు లేవు.

పిల్లలు దూరం పాటిస్తూ, శుభ్రతగా ఉంటే రక్షణ పరికరాల గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదని డేనిష్ టీచర్ల సంఘం ఉపాధ్యక్షురాలు డోర్ట్ లాంగే అన్నారు.

ఎవరైనా టీచర్లకు గాని, వారి కుటుంబ సభ్యులకి గాని ఆరోగ్య సమస్యలు ఉంటే వారు ఇంటి దగ్గర నుంచి పాఠాలు చెప్పవచ్చని చెప్పారు.

ప్రస్తుతం చాలా మంది స్కూల్‌కి రావడానికి ఇష్టపడుతున్నారని, కొంచెం పెద్ద పిల్లలు ఇంటి దగ్గర ఉండటానికి సుముఖంగా లేరని ఆమె అన్నారు.

స్కూళ్ళని తెరవడం వలన వైరస్ వ్యాప్తి జరుగుతుందనే భయం ఉంటే , మరోలా అలోచించి ఉండేవాళ్లమని అన్నారు.

కానీ, స్కూళ్ళని తెరవడం సురక్షితం అని ప్రభుత్వం చెబితే తాము, పెద్ద తరగతుల వాళ్లకి కూడా స్కూళ్ళని తెరుస్తామని చెప్పారు.

తల్లి తండ్రుల భయాలు

అయితే, పిల్లలని స్కూల్‌కి పంపించడం పట్ల తల్లి తండ్రులకి భయాలు ఉన్నాయి. దీని కోసం ఒక ఫేస్ బుక్ పేజీ కూడా తెరిచారు.

స్కూల్స్ తెచినప్పటికీ తన నాలుగేళ్ల కూతురిని ఇంటి దగ్గరే ఉంచానని సిరీన్ చెప్పారు.

“తాను స్కూల్‌కి ఎప్పుడు వెళతానని రోజూ నన్ను అడుగుతూ ఉంటుంది. ఇంకొక రెండు వారాల్లో నేను తనని స్కూల్‌కి పంపిద్దామని అనుకుంటున్నాను. ఈ వైరస్ ఇప్పట్లో పోయేలా కనిపించటం లేదు. ఏదో మార్గం మనమే వెతుక్కోవాలని అనిపిస్తోంది” అని సిరీన్ అన్నారు.

కోపెన్‌హేగెన్‌లో ఇంకొక స్కూల్‌లో ప్రతి తరగతికి పది మంది విద్యార్థులని మాత్రమే అనుమతిస్తున్నారు.

ప్రత్యేకంగా నిర్దేశించిన స్థలాల్లో పిల్లల్ని కూర్చోబెడుతున్నారు.

పిల్లలని సామాజిక దూరం పాటించమని చెప్పడం కంటే వారిని చిన్న చిన్న సమూహాల్లో ప్రత్యేకంగా ఉంచడం మంచిదని కోపెన్‌హేగెన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో అడ్మినిస్ట్రేటర్‌గా పని చేస్తున్న ఇడా జాన్సెన్ సూచించారు.

కానీ, నిజానికి పిల్లలు వారు ఆడుకుంటున్నప్పుడు సామాజిక దూరం పాటించాలనే విషయాన్ని మర్చిపోతారని చెప్పారు.

పిల్లలంతా స్కూల్‌కి తిరిగి రావడం పట్ల ఆనందంగా ఉన్నారని ఆమె అన్నారు.

పనులు ఎప్పట్లా జరగటం లేదు

జర్మనీలో గత నెలలో స్కూళ్ళు తెరిచారు. పిల్లల్ని విడివిడిగా నిర్దిష్ట స్థలాల్లో కూర్చోబెట్టడానికి ప్రణాళికలు చేసారు. అలా చేయడం వలన ఎవరికైనా వైరస్ సోకితే, వారి దగ్గర్లో ఉన్నది ఎవరో తెలుసుకోవడం సులభం అవుతుందని కొలోన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ షాన్ రాబర్ట్స్ అన్నారు.

జర్మనీ పెద్ద తరగతుల పిల్లలు ముందు స్కూళ్ళకి వెళ్లారు.

కారిడార్లో ఒకే వరసలో నడవడం, విడి విడిగా బ్రేక్ ఇవ్వడం, అందరూ తిరిగే చోట ఫేస్ మాస్క్ ధరించడం లాంటివి చేస్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నప్పటికీ పరిస్థితులు పూర్తిగా చక్కబడ్డాయని మాత్రం చెప్పలేమని రాబర్ట్స్ అన్నారు.

స్కూల్‌లో గడిపే సమయం కుదించి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడం లాంటివి చేస్తున్నారు. కొంత మంది టీచర్లు, స్కూల్ సిబ్బంది ఇంటి దగ్గర నుంచే పాఠాలు చెబుతున్నారు.

ఫ్రాన్స్, నెదర్లాండ్స్ కూడా పాఠశాలల్ని తెరిచేందుకు ప్రణాళికలు రచించాయి. బ్రిటన్‌లో స్కూళ్ళు తెరవడం పట్ల ఇంకా స్పష్టత లేదు.

సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఇదొక ప్రారంభం మాత్రమే, కానీ, ఆ ప్రారంభం ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి కదా అని రాబర్ట్స్ అన్నారు.

భారతదేశంలో కూడా పాఠశాలల్ని ఎప్పుడు తెరుస్తారనేదానిపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. అయితే, ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచించారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)