బెంగళూరు: ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉండటానికి నిరాకరించిన రైలు ప్రయాణీకులు.. తిరిగి దిల్లీ పంపించిన కర్ణాటక ప్రభుత్వం

దిల్లీ నుంచి రైలులో ప్రయాణం చేసి బెంగళూరు వచ్చి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉండటానికి నిరాకరించిన 70 మంది ప్రయాణీకులను కర్ణాటక అధికారులు ప్రత్యేక బోగీలో తిరిగి వెనక్కి పంపించారు.

సంస్థాగత క్వారంటైన్ గురించి తమకి ముందుగా సమాచారం లేదని ప్రయాణీకులు రైల్వే అధికారులతో, వైద్యాధికారులతో వాదనకు దిగారు.

"రైలులో ప్రయాణం చేసి వచ్చిన ప్రతి ఒక్కరు 14 రోజుల పాటు క్వారంటైన్ లోకి వెళ్లాల్సి ఉంటుందని దిల్లీ రైల్వే స్టేషన్లో ప్రచారం చేయడం మాత్రమే కాకుండా ప్రయాణీకుల మొబైల్ ఫోన్లకి ఎస్ఎంఎస్ కూడా పంపించాం’’ అని కర్ణాటక మంత్రి సురేష్ కుమార్ మీడియాకి వివరించారు.

దిల్లీలో సంస్థాగత క్వారంటైన్ గురించి ప్రసారం చేసినప్పుడు చాలా మంది ప్రయాణీకులు అప్పటికప్పుడు రైలు దిగిపోయి తమ టిక్కెట్లని రద్దు చేసుకున్నారని ఆయన చెప్పారు. వీరి స్థానంలో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి టికెట్లు ఖరారు చేసినట్లు తెలిపారు.

రైలు బెంగళూరు చేరిన తరువాత క్వారంటైన్‌లో ఉండటానికి మరికొందరు నిరాకరించారని చెప్పారు.

దిల్లీ నుంచి బెంగళూరు వెళ్లిన రైలులో సుమారు 800 మంది ప్రయాణీకులు ప్రయాణం చేశారు.

ఒక రాష్ట్రంలోని రెడ్ జోన్ నుంచి మరో రాష్ట్రంలోని రెడ్ జోన్‌కు ప్రయాణించిన వారెవరైనా ఖచ్చితంగా 14 రోజుల పాటు సంస్థాగత క్వారంటైన్‌లో ఉంచాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి సూచనలు జారీ చేసింది.

ప్రయాణీకులు క్వారంటైన్‌లో ఉండేందుకు హోటళ్ల జాబితాని కూడా అన్ని రైల్వే స్టేషన్లలో, ఎయిర్ పోర్టులలో , హై వే ఎంట్రీ పాయింట్ల దగ్గర పొందు పరిచారు. అయితే, హోటల్ ఖర్చును ఎవరికివారే భరించాల్సి ఉంటుంది.

ప్రయాణీకులు పాటించాల్సిన నిబంధనల్లో ఎటువంటి సడలింపు ఉండదని చెప్పినప్పటికీ వారు వినలేదని, కొంత మంది దిల్లీ తిరిగి వెళ్లిపోతామని చెప్పడంతో ఒక ప్రత్యేక బోగిని ఏర్పాటు చేసి వారిని వెనక్కి పంపించినట్లు అధికారులు చెప్పారు.

క్వారంటైన్‌లో ఉండమని నిరాకరించిన వారందరికీ ప్రభుత్వం ప్రత్యేక భోగీలు ఏర్పాటు చేస్తుందా?

"ఇలా జరగడం ఇదే మొదటి సారి. మేము రైల్వే ప్రయాణీకుల మొబైల్ నంబర్లను సేకరించి అందరికీ వ్యక్తిగతంగా సందేశాలు పంపేలా చూస్తాం. అలాగే, అన్ని రైల్వే స్టేషన్లలో క్వారంటైన్ గురించి మరింత ప్రచారం చేస్తాం" అని సురేష్ కుమార్ చెప్పారు.

గతంలో రాష్ట్రంలోకి ప్రవేశించిన చాలా మంది ఇంటి దగ్గర క్వారంటైన్ నియమాలని ఉల్లంఘించి తాము సెలవులకి వచ్చినట్లు బయట తిరగడం మొదలు పెట్టారని ఒక వైద్యాధికారి వ్యాఖ్యానించారు. దీంతో, సంస్థాగత క్వారంటైన్ ని అమలు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది.

కర్ణాటక ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఆదేశాల్లో గర్భిణిలు, వృద్దులు, 10 ఏళ్ల లోపు పిల్లలకి మాత్రం సంస్థాగత క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చారు.

సంస్థాగత క్వారంటైన్‌లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి.

హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న తన తండ్రితో ఉండటానికి ముంబయి నుంచి ఒక స్పోర్ట్స్ జర్నలిస్ట్ రోడ్డు మార్గంలో ప్రయాణం చేసి బెంగళూరు చేరుకున్నారు. ఆమె బెంగళూరులోనే ఉండటం వలన తన తండ్రికి కాస్త ఆందోళన తగ్గుతుందని ఆమె క్వారంటైన్లో ఉండటానికి నిశ్చయించుకున్నారు.

అయితే ఆమెకి హెల్ప్ డెస్క్‌లో పదే పదే ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉండమని ఒత్తిడి చేశారని చెప్పారు. ఆమె ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో త్రీ స్టార్ హోటళ్ల జాబితా చూపించారు.

"ఆఖరికి నాకు త్రీ స్టార్ హోటళ్ల జాబితాలో లేని ఒక హోటల్ చూపించారు. బసవేశ్వర నగర్లో మా ఇంటికి దగ్గరగా ఉన్న రాజాజీ నగర్లో ఉన్నఈ హోటల్ని నేను ఎంచుకున్నాను. ఈ హోటల్లో చాలా దుమ్ము ధూళి ఉంది. దానికి తోడు ఏసీ పని చేయటం లేదు” అని పవిత్ర అనే జర్నలిస్ట్ చెప్పారు.

“గదిలో గచ్చు కూడా పూర్తి మరకలతో ఉంది. టిష్యూ తో నేనే వాటిని తుడిచాను. ఇక్కడ పెట్టిన డస్ట్ బిన్ కూడా శుభ్రం చేయలేదు”.

"నేను శాఖాహారిని. నేను పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్‌కి పనీర్ అడిగాను. కానీ, పనీర్ బదులు నాకు చికెన్ ఇచ్చారు. హోటల్ యాజమాన్యం ప్రవర్తన, తీరు నాకు చాలా కోపం తెప్పించాయి." అని ఆమె తెలిపారు.

కోవిడ్ 19 అధికారిక సమావేశం సమయంలో హోటల్ రూమ్ శుభ్రంగా లేదని, ఆహారం బాలేదని ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే, "ఇప్పుడు ఏమి చేస్తాం. అయిపొయింది కదా” అని తన మాటని కొట్టి పడేశారని చెప్పారు.

ప్రభుత్వం తరపున సురేష్ కుమార్ క్షమాపణ చెప్పారు. "ఇలా జరిగి ఉండకూడదు’’ అని ఆయనని అన్నారు.

"ఇటువంటి తప్పులని సరిదిద్దుకుంటామని" ఆయన చెప్పారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)