కరోనావైరస్: ‘ఈ సంక్షోభంలో ఖండాలు దాటుతూ చేసిన ప్రయాణాలు నాకు ఏం నేర్పాయంటే...’ - బ్లాగ్

    • రచయిత, ప్రతీక్ష ఘిల్దియాల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి, అమెరికాలోని ఒహాయో నుంచి

దిల్లీలో గత మార్చిలో ఓ రోజు మధ్యాహ్నం పూట ఇంట్లో వార్తలు చూస్తూ ఉన్నా. భారత్‌లో కరోనావైరస్ సంక్షోభానికి అప్పుడే తెర లేస్తోంది. జనాలు దాని గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ, దేశం మొత్తానికీ అది ఇంకా ప్రధానాంశం కాలేదు. ఒకవేళ వైరస్ భారత్‌లో తీవ్రంగా విజృంభిస్తే, మేం వార్తలు రాయగలమా? అన్న సందేహం కలిగింది. వేల మంది చనిపోవచ్చు. ఇంతలో నా ఫోన్ మోగింది. ‘నువ్వు స్పెయిన్‌కు వెళ్తావా?’ అని నా బాస్ అడిగారు.

స్పెయిన్‌లో అప్పటికే వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో లాక్‌డౌన్ విధించారు. అప్పటికి ఆరు వేలకుపైగా మందికి ఇన్ఫెక్షన్ సోకింది. సుమారు 200 మంది చనిపోయారు. ఆ మహమ్మారి గుప్పిట్లోకి స్పెయిన్ వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆ దేశంలో కోవిడ్-19 మృతుల సంఖ్య 27వేలకుపైనే ఉంది.

దిల్లీ విమానాశ్రయం చేరుకున్నా. మాస్క్, హాండ్ శానిటైజర్లు కూడా తీసుకువెళ్లా. అప్పటికి మార్చి మధ్యలో ఉన్నాం కాబట్టి, భారత్‌లో ప్రయాణాలు ఎప్పటిలాగే సాగుతున్నాయి. విమానాశ్రయంలో సగం మందే మాస్క్‌లతో కనిపించారు. భౌతిక దూరం పెద్దగా పాటించడం లేదు. విమానం ప్రయాణికులతో పూర్తిగా నిండిపోయింది. ప్లాస్టిక్ ప్యాకేజీలో ఆహారం వడ్డించారు. ఇలా సామూహికంగా వండే ఆహారం తీసుకోవడం మంచిదేనా అని నాకు సందేహం వచ్చింది. నా పక్కన కూర్చున్న మహిళ ఇంట్లో వండిన ఆహారాన్ని తన వెంట తెచ్చుకున్నారు. విమానంలో ఇచ్చిన ఆహారాన్ని ఆమె తీసుకోలేదు. నేను కూడా అలా చేసి ఉండాల్సింది అనుకున్నా. కానీ, నా సందేహాలపై ఆకలి పైచేయి సాధించింది. విమానంలో వడ్డించిన ఆహారాన్ని తిన్నా.

మాడ్రిడ్‌లో బాగా రద్దీ ఉండే సమయానికి ఓ గంట ముందు దిగా. నగర కేంద్రం నుంచి కారులో వెళ్తూ ఉండగా, రోడ్ల మీద తక్కువ జనం కనిపించారు. బస్సులు కూడా ఒకరిద్దరు ప్రయాణికులతోనే తిరుగుతున్నాయి. అప్పటికి భారత్‌లో పరిస్థితులు సాధారణంగానే ఉండటం నాకు వింతగా అనిపించింది. నా బృందాన్ని హోటల్‌లో కలిశా. అక్కడి నుంచి ఖాళీగా ఉన్న నగరాన్ని చిత్రీకరించేందుకని మేం బయటకు వచ్చాం. షాపులు, రెస్టారెంట్లు మూసేసి ఉన్నాయి. సందర్శకులతో కిటకిటలాడే పర్యాటక ప్రదేశాలను మౌనం ఆవహించింది. నా తొలి స్పెయిన్ పర్యటన ఇలా ఉంటుందని నేను ఎప్పుడూ ఊహించలేదు.

ఇక్కడ గోలగోలగా ఉండే కెఫేలు, టపాస్ బార్ల గురించి నేను చాలా విన్నా. కానీ, మేం ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అనిపించింది. చిత్రీకరణలో విరామ సమయంలో ఒక కప్ కాఫీ కూడా మాకు మాడ్రిడ్‌లో దొరకలేదు.

ఆ తర్వాత కొద్ది రోజుల్లో ఈ కొత్త జీవితానికి నేను అలవాటుపడ్డా. హోటల్‌లో ఆర్డర్ చేసుకుంటేనే భోజనం వచ్చేది. హోటళ్లు మూతపడుతుండేవి. మేం కథనాల కోసం మాడ్రిడ్ నుంచి వేరే చోటుకు వెళ్లాల్సి వచ్చేది. దాదాపు రోజూ హోటల్స్ మారాల్సి వచ్చేది. ఈ గందరగోళంలో నేను ప్రతి హోటల్లో ఏదో ఒకటి మరిచిపోయి వస్తుండేదాన్ని.

క్షేమంగా ఉండేందుకు మా బృందం వీలైనంతగా జాగ్రత్తలు తీసుకుంది. స్పెయిన్‌లో అప్పుడు ఇన్ఫెక్షన్ల రేటు విపరీతంగా పెరుగుతూ పోతోంది. చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. మా ఉద్యోగాల్లో భాగంగా మేం రోజూ వైరస్‌కు దగ్గరగా వెళ్లాల్సి వచ్చేది.

మా బృందంలో నలుగురు సభ్యులం ఉన్నాం. భౌతిక దూరం పాటించేందుకు రెండు కార్లు అద్దెకు తీసుకున్నాం. మా కార్లు మేమే నడిపాం. వేరే వాళ్లెవరినీ ఆ కార్లలోకి రానివ్వలేదు.

ఇంటర్వ్యూ చేసేటప్పుడు ‘బూమ్ మైక్స్’ను వాడాం. వాటితో దూరంగా ఉంటూనే, ఎవరైనా మాట్లాడుతుంటే రికార్డు చేయవచ్చు. మైక్‌కు ఉండే గొట్టాన్ని అలా సాగదీయొచ్చు.

ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలకు వెళ్లినప్పుడు మాస్క్‌లు ధరించాం. వీలైనంత ఎక్కువగా చేతులు కడుక్కున్నాం. హాండ్ శానిటైజర్లను వాడాం. డోర్ హ్యాండిల్స్‌ను పట్టుకోవాలన్నా, హోటల్ గదిలో కుళాయిని ముట్టుకోవాలన్నా భయం వేసేది. డిసిన్ఫెక్ట్ వైప్‌లతో వాటిని బాగా తుడిచేదాన్ని. మా గదుల్లోకి ఎవర్నీ రానివ్వకూడదని నిర్ణయం తీసుకున్నాం. గదులను మాకు మేమే శుభ్రం చేసుకున్నాం. ఓ క్లీనింగ్ లేడీ మమ్మల్ని ఆశ్చర్యంగా, కొంత అనుమానంగానూ చూశారు. ఇది అందరి క్షేమం కోసమని ఆమెకు మేం చెప్పాం.

స్పెయిన్‌లో ఉన్న 18 రోజులూ స్పెయిన్ నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోవడం చూశా. రోగుల సంఖ్య విపరీతంగా ఉండటంతో ఐసీయూలపై ఒత్తిడి బాగా పెరిగింది. కరోనావైరస్ కారణంగా తమవారిని కోల్పోయినవాళ్ల కథలు వింటుంటే బాధగా అనిపించేది. ఎక్కువ మంది ఒక్క చోట చేరకుండా విధించిన నిషేధం కారణంగా చనిపోయివారికి కాస్త గౌరవంగా అంతిమ వీడ్కోలు పలికే అవకాశం కూడా అక్కడివాళ్లకు లేకపోయింది.

వైద్య సిబ్బందిలో ఇన్ఫెక్షన్ల రేటు పెరగడం కూడా ఆందోళనకర విషయంగా మారింది. అప్పటికి 12 వేల మంది ఆ వ్యాధి బారినపడ్డారు. అక్కడ అంబులెన్స్ నడిపే హిగినియో డెల్గాడో అల్వారెజ్ తన ఆందోళనను మాతో పంచుకున్నారు. తాను ధరించిన రక్షణ సూట్ ఎక్కడైనా చిరిగి, అనుకోకుండా రోగి ఉమ్మి పడితే ఏమవుతోందనని తాను భయపడుతున్నానని ఆయన చెప్పారు. మంచి వైద్య వ్యవస్థ ఉన్న ఓ దేశంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.

ఈ సంక్షోభంలో రోజూ మాకు కొందరు హీరోలు కూడా కనిపించేవారు. వైద్య సిబ్బంది కోసం మాస్క్‌లు, రక్షణ కవచాలు తయారుచేసేవాళ్లను చూశాం. ఓ హోటల్ మేనేజర్ తమ హోటల్‌లోని బెడ్‌లను ఆసుపత్రులకు దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాకు చెప్పారు. ఇక వైద్య సిబ్బంది సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూ రోజూ సాయంత్రం జనాలు తమ బాల్కనీల్లోకి వచ్చి చప్పట్లు కొడుతూ కనిపించేవారు.

స్పెయిన్‌ నెమ్మదిగా కోలుకోవడం మొదలుపెడుతున్న సమయంలోనే ఇక నా పర్యటన కూడా చివరికి వచ్చింది. అయితే, దిల్లీకి నేను తిరిగి రాలేకపోయాను. అంతర్జాతీయ విమానాలు రద్దు చేయడం సహా కరోనావైరస్ వ్యాప్తి కట్టడికి భారత ప్రభుత్వం కొన్ని తీవ్రమైన చర్యలు తీసుకుంది. సరైన వైద్య వ్యవస్థ లేకపోవడం, అధిక జనా సాంద్రత కారణంగా ఆ చర్యలు తప్పనిసరయ్యాయి.

దీంతో నేను స్పెయిన్ నుంచి బ్రిటన్‌కు వెళ్లా. నేను ఉద్యోగం చేస్తున్న బీబీసీ ప్రధాన కార్యాలయం ఉంది అక్కడే. ఇంటికి తిరిగి వెళ్లే అవకాశం దొరికే వరకు అక్కడ వేచిచూడవచ్చని. అప్పుడు విమాన ప్రయాణమంటే భయం అనిపించింది. మాడ్రిడ్ విమానాశ్రయంలో భౌతిక దూరం నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. విమానం దాదాపు ఖాళీగా ఉంది. నిత్యం చాలా రద్దీగా ఉండే హీత్రో విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ లైన్‌లో నేను ఒక్కదాన్నే ఉన్నట్లు మొదటిసారి నాకు అనిపించింది.

స్పెయిన్‌లో సంక్షోభంలో ముందు వరుసలో ఉన్న నేను.. లండన్‌లో ఐసోలేషన్‌కు వెళ్లా. నెమ్మదిగా స్పెయిన్‌లో జరిగిందే బ్రిటన్‌లోనూ నాకు కనిపించింది. వైద్య సిబ్బందికి తగినంతగా సామగ్రి లేదని, లాక్‌డౌన్ ఆలస్యమైందని, పరీక్ష కిట్‌ల కొరత ఉందని, రాజకీయ నాయకులు సరిగ్గా స్పందించలేదని ఇలా రకరకాల ఆరోపణలు, విమర్శలు. యూరప్ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఇదే సరళి కనిపించింది.

మరోవైపు భారత్ లాక్‌డౌన్ ఇంకా పొడగించింది. ఇంటికి ఇప్పుడప్పుడే ఎలా వెళ్తానో నాకు అర్థం కాలేదు. నెల రోజులుగా ఇంటికి దూరంగా ఉన్నా. నా భర్తను మిస్ అవుతున్నా. దిల్లీలో ఆయన కూడా కఠిన లాక్‌డౌన్‌లో చిక్కుకుని ఉన్నారు.

చివరికి మేం కలుసుకున్నాం. కొండలను, పర్వతాలను కదిలించాల్సి రాలేదు కానీ, ప్రత్యేక విమానాల ద్వారా వాటిని దాటాల్సి వచ్చింది.

చివరికి మేం ఒకటయ్యాం. ఈ సంక్షోభంలో ఖండాలు, సముద్రాలు దాటుతూ చేసిన ప్రయాణం ఒక పాఠం నేర్పింది.. కలిసి ఉండటం ఎంత విలువైందో మేం ఎప్పటికీ మర్చిపోం.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)