ఫేస్ మాస్కులు ధరించిన దేవుళ్లు: కరోనావైరస్ మీద జానపద చిత్రకారుల పోరు

కరోనావైరస్ వ్యాప్తిని నివారించటం కోసం సామాజిక దూరం, పరిశుభ్రత ఆవశ్యతలను చాటిచెప్పటానికి భారతదేశపు ప్రముఖ చిత్రకారులు పలు వర్ణచిత్రాలు గీసి విడుదల చేశారని సుధా జి తిలక్ రాస్తున్నారు.

నెల రోజులకు పైగా కొనసాగుతున్న లాక్‌డౌన్ సమయంలో.. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద చిత్రకళాకారుల బృందం ఒకటి ఈ రేఖాచిత్రాలు, వర్ణచిత్రాలను సంప్రదాయ పద్ధతుల్లో రూపొందించింది.

‘‘ఈ కోవిడ్-19 హస్తకళాకారులకు చరమగీతం పాడుతుందని చాలా మంది భయపడుతున్నప్పటికీ.. వారి సృజనాత్మకత, పోరాట పటిమలు వారిని కాపాడుతున్నాయి’’ అని ‘దస్తకర్’ చైర్‌పర్సన్ లైలా త్యాబ్జీ బీబీసీతో పేర్కొన్నారు.

దేశంలో హస్తకళలు, హస్తకళాకారులతో కూడిన ప్రముఖ సంఘం ‘దస్తకర్’.

దస్తకర్‌తో పనిచేసే జానపద చిత్రకళాకారులు.. భౌతిక దూరం పాటించటం, ఫేస్ మాస్కులు ధరించటం, చేతులను సోపుతో శుభ్రంగా కడుక్కోవటం, గుంపులుగా ప్రయాణించకుండా ఉండటం ఎంత ముఖ్యమో చెప్తూ మార్చి నెల నుంచి కళాఖండాలను తయారుచేశారు.

కోవిడ్-19 పేషెంట్లకు చికిత్స చేస్తున్న ఆస్పత్రుల దృశ్యాలు కూడా ఈ చిత్రాల్లో ఉన్నాయి. సామాజిక సందేశాల కోసం భారత జానపద చిత్రకళాకారులు సంప్రదాయ చిత్రకళను ఎంతో కాలంగా ఉపయోగిస్తున్నారు.

‘‘సంప్రదాయంగా చూస్తే.. దేశంలో చాలా జానపద చిత్రకళా రూపాలు.. స్థానిక సమాజానికి సమాచారం చేరవేయటానికి పెద్ద పెద్ద పట్టీల మీద, కుడ్యాల మీద చిత్రించే కళారూపాలుగా ఉండేవి.

చిత్రకారులు ఊరి కూడలిలో చిత్రాలను ప్రదర్శిస్తూ వారిలో అవగాహన పెంచేవారు’’ అని దస్తకర్ అధికార ప్రతినిధి రియా గుప్తా చెప్పారు.

బిహార్‌లోని రషీద్‌పూర్ గ్రామానికి చెందిన అంబికా దేవి.. మధుబని చిత్రకారిణి. ఈ రాష్ట్రంలోని ఒక జిల్లా పేరుతో ఈ కళను పిలుస్తారు.

ఈ చిత్రకళలో ఇళ్ల గోడల మీద కళాకృతులు చిత్రించటానికి సహజ రంగులను ఉపయోగిస్తారు. ఆధునిక కాలంలో చేతితో తయారు చేసిన కాగితం మీద చిత్రిస్తున్నారు.

మధుబని చిత్రకళకు భౌగోళిక సూచీ హోదా ఉంది. ఎందుకంటే ఇది చిరకాలంగా ఒక చిన్న భౌగోళిక ప్రాంతానికి పరిమితమై ఉంది. ఈ కళానైపుణ్యం శతాబ్దాలుగా తరతరాల వారసత్వంగా వస్తోంది. కళా రూపం, శైలి దాదాపుగా అలాగే కొనసాగుతోంది.

గ్రామాల్లోని మార్కెట్లలో జనం ఫేస్ మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించటాన్ని అంబికా దేవి చిత్రాలు చూపుతున్నాయి.

ఇక ఫాడ్ చిత్రకళ స్వస్థలం రాజస్థాన్. మధ్యయుగాల నుంచీ ఇది కొనసాగుతోంది.

సంప్రదాయంగా వస్త్రంతో చేసిన పెద్ద తెరల మీద.. రాజుల పండుగలు, ప్రదర్శనలు, యుద్ధాలను వర్ణిస్తూ చిత్రించేవారు.

రాజస్థాన్‌లోని భిల్వారాకు చెందిన కల్యాణ్ జోషి ఫాడ్ చిత్రకారుడు. ఈ ప్రాంతం మొదటి కోవిడ్-19 హాట్‌స్పాట్‌లలో ఒకటి.

సామాజిక దూరం పాటించటం, ఫేస్ మాస్కులు ధరించటానికి సంబంధించిన సందేశం ఆయన చిత్రాల్లో కనిపిస్తుంది.

ఒడిషాలోని రఘురాజ్‌పూర్‌కు చెందిన అపీంద్ర స్వాయిన్ పట్టచిత్ర కళాకారిణి.

ఈ కళారూపం ఐదో శతాబ్దం నాటిది. సహజమైన రంగులతో చిత్రించే కాంతులీనే వర్ణాలకు ఈ చిత్రకళ ప్రసిద్ధి గాంచింది.

ఆమె గీసిన చిత్రాలు.. పురాణాల్లోని పాత్రలు ఫేస్ మాస్కులు ధరించినట్లు చూపుతున్నాయి.

అలాగే రాజస్థాన్ ఉత్తర ప్రాంతానికి చెందిన కావడ్ చిత్రకళకు.. 400 ఏళ్ల చరిత్ర ఉంది. కథ చెప్పటానికి చెక్క ఫలకాల మీద దృశ్యాలను చిత్రిస్తారు. ఈ కళలో వర్ణచిత్రాలు సందేశం అందించే ‘స్టోరీ బోర్డ్’ లాగా కనిపిస్తాయి.

చిత్తోడ్‌గఢ్ జిల్లాకు చెందిన ద్వారికా ప్రసాద్.. ఆస్పత్రిలో కోవిడ్-19 రోగులకు చికిత్స చేసే దృశ్యాలను వర్ణిస్తూ కావడ్ ఫలకాలను చిత్రించారు.

తులసీదాస్ నింబార్క్.. 17వ శతాబ్దానికి చెందిన రాజస్థానీ సూక్ష్మచిత్రకళా సంప్రదాయంలో చిత్రించారు.

హిందూ దేవుడైన కృష్ణుడు ఒక తోటలో.. ఫేస్‌మాస్క్ ధరించి తనను ఆరాధిస్తున్న ఒక యోగి ముందు నాట్యం చేస్తున్నట్లు, ఆ యోగి ఎదుట ఒక హ్యాండ్ వాష్ లిక్విడ్ సీసా ఉన్నట్లు ఆయన చిత్రించారు.

ఫొటోల కాపీ రైట్: దస్తకర్

తెలంగాణలోని చేర్యాల నకాశి చిత్రకళాకారులు సాయి కిరణ్ ధనలకోట, శ్రావణ్‌లు సైతం కరోనావైరస్ ఇతివృత్తంతో చిత్రాలు, మాస్కులు తయారు చేస్తున్నారు.

ఈ చిత్రకళకు దాదాపు 500 ఏళ్ల చరిత్ర ఉందని చెబుతుంటారు. తెలంగాణలోని ప్రాచీన, ప్రముఖ చిత్రకళల్లో ఇదొకటి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)