కరోనావైరస్‌పై అమెరికాలో పరిశోధన చేస్తున్న చైనా సంతతి ప్రొఫెసర్ బింగ్ ల్యూ హత్య వెనుక అంతర్జాతీయ కుట్ర ఉందా?

చైనా సంతతికి చెందిన కరోనావైరస్‌ పరిశోధకుడు అమెరికా గడ్డపై దారుణ హత్యకు గురికావడంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి కుట్ర సిద్ధాంతాలు ఊపందుకున్నాయి. అతడిని మరొకరు కాల్చి చంపారని, హంతకుడు తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

యూనివర్సిటీ ఆఫ్‌ పిట్స్‌బర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న 37ఏళ్ల బింగ్‌ ల్యూ మే 2న తన ఇంట్లో శవమై కనిపించారు.

కోవిడ్‌-19కు సంబంధించి అతని పరిశోధనలు కీలకమైన దశలో ఉన్నాయంటూ అతని సహచరులు చెప్పడంతో, ఈ హత్యపై సోషల్ మీడియాలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ పోలీసులు మాత్రం ఇది మర్డర్-సూసైడ్‌ అని చెబుతున్నారు.

ల్యూ ఎందుకు హత్యకు గురయ్యారు?

పిట్స్‌బర్గ్ సబర్బన్‌ ప్రాంతంలో నివసిస్తున్న బింగ్‌ల్యూ తలమీద, మెడమీద, గుండెల మీద అతి సమీపం నుంచి కాల్పులు జరిపిన ఆనవాళ్లున్నాయని పోలీసులు చెప్పారు.

కాల్పులు జరిపిన వ్యక్తి 46ఏళ్ల హౌ-గు అని గుర్తించారు. ఇతను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. కాల్పులు జరిపిన తర్వాత అతను కారు దగ్గరకు వచ్చి తనను తాను కాల్చుకున్నారని అధికారులు చెప్పారు.

బింగ్‌ ల్యూ, హౌ-గు ఒకరికొకరు బాగా తెలుసని ఈ కేసును పరిశీలిస్తున్న డిటెక్టివ్‌లు అన్నారు. ఒక సన్నిహిత వ్యక్తి కోసం వీరిద్దరి మధ్య కొన్నాళ్లుగా వివాదం కొనసాగుతోందని, ఆ క్రమంలోనే ఈ హత్య జరిగిందని దర్యాప్తు బృందాలు వెల్లడించాయి.

ఈ హత్యకు, కరోనావైరస్‌పై అతను చేస్తున్న పరిశోధనకు ఎలాంటి సంబంధం లేదని దర్యాప్తు అధికారులు తేల్చి చెప్పారు.

బింగ్‌ ల్యూ ఎవరు?

కరోనావైరస్‌పై ఆయన పరిశోధన చేస్తున్నారని, ఈ పరిశోధన కీలకదశలో ఉందని బింగ్‌ల్యూ సహచరులు చెబుతున్నారు.

కోవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌లో వైరస్‌ కణాలకు సంబంధించి ఆయన కీలకమైన విషయాలు కనుగొన్నారని వారు వెల్లడించారు. బింగ్‌ హత్యపట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సహచరులు, ఆయన పరిశోధనను తాము ముందుకు తీసుకెళతామని, అదే ఆయనకు తాము అందించే నివాళి అన్నారు. చైనాలో పుట్టి పెరిగిన బింగ్‌ ల్యూ.. రీసెర్చ్‌ కోసం అమెరికాకు రాకముందు సింగపూర్‌లో కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీతోపాటు పీహెచ్‌డీ కూడా చేశారు.

ఆన్‌లైన్‌లో ఉన్న బింగ్‌ ల్యూ ప్రొఫైల్‌ను పరిశీలించగా, మనుషుల్లో రోగ నిరోధక శక్తికి సంబంధించిన పలువురు బయాలజిస్టులు, వైద్యరంగ నిపుణులతో ఆయన కలిసి పనిచేస్తున్నట్లు తేలింది.

కుట్ర సిద్ధాంతకర్తలు ఏమంటున్నారు?

''ఆయన అసాధ్యమనుకున్నది సుసాధ్యం చేసి ఉంటారు. వైరస్‌ అమెరికా ప్రయోగశాలలోనే పుట్టిందని కనుక్కొని ఉంటారు'' అని చైనీస్‌ సోషల్‌మీడియాలో ఒక వ్యక్తి సందేహం వ్యక్తం చేశారు.

కరోనావైరస్‌ ఎక్కడ పుట్టిందన్న అంశంపై పరిశోధన చేసి ఉంటారని, అందుకే బింగ్‌ల్యూను హత్య చేసి ఉంటారంటూ అనేకమంది కామెంట్లు చేస్తున్నారు.

వూహాన్‌కు వచ్చిన అమెరికా సైనికుల వల్లే ఈ వ్యాధి చైనాలో వ్యాపించిందని ఆ దేశ అధికారులతోపాటు, మీడియా సంస్థలు కూడా గతంలో ఆధారాలులేని ఆరోపణలు చేశాయి.

వీబో అనే మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్‌లో చాలామంది యూజర్లు ''ఇది మరీ యాదృచ్ఛికంగా కనిపిస్తోంది'' అని రాశారు. ''ఇది ఒక అనూహ్యమైన కేసు. దీని వెనక చీకటి కోణాలు ఉండే అవకాశం ఉంది'' అని కొందరు కామెంట్‌ చేశారు.చైనీయుడు కావడంవల్లే బింగ్‌ ల్యూ అమెరికాలో ప్రమాదంలో పడి ఉంటారని వీబో బ్లాగర్లు అభిప్రాయపడ్డారు. కానీ జాతీయత కారణంగానే ఆయన కొందరికి లక్ష్యంగా మారారనడానికి ఎలాంటి ఆధారాలు ఇంత వరకు లభించలేదు.

బింగ్‌ల్యూ మరణానికి సంబంధించి అనేక ఊహాగానాలను పోగు చేసిన, చైనా అధికార మీడియాకు అనుబంధంగా పనిచేస్తున్న గ్లోబల్ టైమ్స్ అనే వెబ్‌సైట్.. దీనిపై ఒక కథనాన్నికూడా ప్రచురించింది.

చైనా ప్రభుత్వం చేస్తున్న ఆధారాలులేని ఆరోపణలు కూడా ఈ కేసులో కీలకపాత్ర పోషిస్తాయని కొందరు ట్విటర్లో వ్యాఖ్యానిస్తున్నారు.

కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా ఆన్‌లైన్‌లోని వివిధ వేదికల నుంచి అనేక కుట్ర సిద్ధాంతాలు పుంఖానుపుంఖాలుగా పుట్టుకొస్తున్నాయి.

ఆధారాలులేని కొన్ని ఆరోపణలను చైనా,అమెరికాలకు చెందిన మీడియా సంస్థలు, రాజకీయవర్గాలు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నాయి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)