‘భారత్‌లో హిందువులకు, ముస్లింలకు... పాకిస్తాన్‌లో ముస్లింలకు, వాళ్లకు’ : బ్లాగ్

    • రచయిత, మహమ్మద్ హనీఫ్
    • హోదా, సీనియర్ పాత్రికేయుడు, ఇస్లామాబాద్ నుంచి

గత వారం సోషల్ మీడియాలో ఓ వీడియో చూశాక నా గుండె బరువెక్కింది. భారత్‌లోని ఓ మధ్యతరగతి వాడలో కూరగాయలు అమ్ముకునే ఓ వ్యక్తిని కొందరు వ్యక్తులు పేరు అడుగుతున్నారు.

ఆ వ్యక్తి వెంట ఆయన కొడుకు కూడా ఉన్నాడు. అందుకే భయపడి, తన ప్రాణాలు కాపాడుకునేందుకు ఆయన ఓ హిందూ పేరు చెప్పాడు. కొడుకు ముందు అవమానాన్ని భరించాడు. ఎలాగొలా తన సామను తీసుకుని అక్కడి నుంచి బయటపడ్డాడు.

ఓ మనిషి తన ప్రాణాలను కాపాడుకునేందుకు, పొట్ట కూటి కోసం తన మతాన్ని దాచుకోవాల్సి రావడం నా హృదయాన్ని ద్రవింపజేసింది. భారత్-పాకిస్తాన్ విభజన జరిగినప్పటిలా... సమాజం ప్రమాదకరంగా మారిందనడానికి ఇది సంకేతం.

అప్పుడు కూడా ఏళ్లుగా ఒకే ఊరిలో కలిసి ఉన్నవాళ్లు ఒకరికొకరు శత్రువులయ్యారు. ఒకరి పిల్లల్ని ఒకరు చంపుకున్నారు. ఆవులు, ఎద్దులు కూడా మనుషుల్ని చూసి భయపడిపోయిన సమయం అది.

నా దేశమైన పాకిస్తాన్ విషయానికి తిరిగి వస్తా.

ఇది రంజాన్ మాసం. జనాలు ప్రార్థనలు చేస్తున్నారు. దానాలు చేస్తున్నారు.

కానీ, కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ‘కాదియానీ కాఫిర్ హై’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. (అహ్మదియా ముస్లింలను కాదియానీలని పాక్‌లో అంటారు)

భారత్‌లోని పంజాబ్‌లోని గురుదాస్‌పుర్ జిల్లాలోని కాదియా గ్రామంలో అహ్మదియా ముస్లింల గురువు జన్మించారు.

కాదియానీలను 45 ఏళ్ల క్రితం పాకిస్తాన్ పార్లమెంటు కాఫిర్లుగా నిర్ధారించింది, మరి ఇప్పుడేం ఏంటి?

ఆ తర్వాత కాదియానీలు కాఫిర్లు మాత్రమే కాదని, ప్రపంచంలోని కాఫిర్లలోనే అత్యంత నీచమైన వారని ఓ పోకడ మొదలైంది. 25 ఏళ్ల క్రితం ఓ చట్టాన్ని చేసి ఈ వాదనను బలపరిచారు.

దీని తర్వాత కాదియానీలు కాఫిర్లు అవుతారు కానీ, అల్పసంఖ్యాకులు కారని మరో పోకడ మొదలైంది.

తాము అహ్మదియాలమని, కాదియానీలని తమను పిలవొద్దని చెప్పే పరిస్థితిలో కూడా పాకిస్తాన్‌లోని కాదియానీలు లేరు. అల్పసంఖ్యాకులం కాకపోతే, తామెవరమని కూడా వారు ప్రశ్నించడం లేదు.

దీని తర్వాత, కాదియానీలు దేశద్రోహులంటూ మరో ట్రెండ్ మొదలైంది. ఇమ్రాన్ ఖాన్‌కు ప్రియ మిత్రుడైన ఓ మంత్రి ‘తల, మొండెం వేరవ్వాలి’ అని నినాదం ఇచ్చారు.

భారత్‌లో మొదట్లో ముస్లింలను కాస్త అనుమానంగా చూసేవారు. ఇప్పుడు వాళ్లు ‘దేశ ద్రోహులు’ అయ్యారు. పాకిస్తాన్‌లో అహ్మదియాలు కాఫిర్లుగా, అక్కడి నుంచి అత్యంత నీచ కాఫిర్లుగా, ఇప్పుడు దేశద్రోహులుగా మారారు.

భారత్‌లో చాలా మంది ముస్లింలకు ఇల్లు అద్దెకు ఇవ్వరు. ఇక్కడ పాకిస్తాన్‌లో బజార్ల ముందు ‘కుక్కలకు, కాదియానియాలకు ప్రవేశం లేదు’ అని బోర్డులు పెట్టుకున్నాం.

హిందూయిజం ఛాందస మతం కావడం, కుల వ్యవస్థ ఉండటం వల్ల భారత్‌లో ఇస్లాం విస్తరించిందని పాకిస్తాన్‌లో చిన్నారులకు పాఠాలు చెప్పేవారు.

ముస్లింలది విశాల దృక్పథమని భావించేవాళ్లం. ‘‘అందరం సమానమే. ఒక్క మనిషిని చంపితే, మొత్తం మానవత్వాన్నే చంపినట్లు. ఒక్క కుక్క ఆకలితో చనిపోయినా, ఖలీఫాదే బాధ్యత’’... ఇలా చాలా అనుకునేవాళ్లం.

ముస్లింలయ్యుండి హిందువుల్లా ప్రవర్తిస్తున్నావంటూ పాకిస్తాన్‌లో తిడతారు. భారత్‌లో హిందువులు కూడా కచ్చితంగా ఇలాగే మనం ఈ ముస్లింలలాగా చెడ్డవాళ్లం కాదని అనుకుంటుంటారు.

ఇక్కడ ‘తల, మొండెం వేరవ్వాలి’ అని నినాదాలు చేసేవాళ్లు, అక్కడ కూరగాయలు అమ్ముకునేవాళ్లను చంపేస్తామని బెదిరించేవాళ్లకు తేడా లేదు.

ఇలా ప్రవర్తిస్తూ ఇస్లాం తమ మతమని ఎలా చెప్పుకుంటారని వీళ్లను ఎవరైనా ప్రశ్నించండి. ఛాందసవాద ముస్లింల్లానే ప్రవర్తిస్తూ హిందువులని చెప్పుకోవడమేంటని ఛాందసవాద హిందువులను అడగండి.

రామ్, రహీం ఒక్కరే అని చెప్పిన పెద్దలందరికీ చేతులెత్తి చెప్పేదొక్కటే – మేం రాముడంటే భయపడం. రహీంను అర్థం చేసుకోలేం.

రామ్, రహీం పేర్లు చెప్పేవారంతా... ఆ దేవుడికి భయపడకపోయినా, కొన్ని రోజులు కరోనావైరస్‌కైనా భయపడండి.

(వ్యాసంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)