You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: మసీదుల్లో రంజాన్ ప్రార్థనలు.. నిబంధనలతో అనుమతిస్తున్న పాకిస్తాన్
కరోనావైరస్ భయంతో వివిధ దేశాల్లో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌లు అమలు చేస్తుంటే, పాకిస్తాన్ మాత్రం ఇదివరకు విధించిన ఆంక్షలను రంజాన్ కోసం సడలిస్తోంది.
దేశంలోని ఇస్లాం మతపెద్దలతో శనివారం పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ సమావేశం అయ్యారు.
అనంతరం ఈ రంజాన్ మాసంలో మసీదుల్లో గుంపుగా ప్రార్థనలు చేసుకునేందుకు కొన్ని షరతుల మీద ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తున్నట్లు ఆయన ట్విటర్ ద్వారా ప్రకటించారు.
తమ రాజకీయ నాయకులను, మత పెద్దలను పాకిస్తాన్ ప్రజలు ఒకే తాటిపై చూడాలని అనుకుంటున్నారని, ఇరు వర్గాల మధ్య ఎలాంటి ఘర్షణ ఏర్పడినా ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయని ఆరిఫ్ అల్వీ వ్యాఖ్యానించినట్లు పాకిస్తాన్‌కు చెందిన జియో టీవీ పేర్కొంది.
మత నాయకులందరి సమ్మతితో రంజాన్ ప్రార్థనల విషయంలో ముఖ్యమైన అంగీకారానికి వచ్చామని ఆరిఫ్ అల్వీ అన్నారు. మసీదుల్లో ప్రార్థనల సమయంలో ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటించేందుకు మత పెద్దలు అంగీకరించారని చెప్పారు.
ఇప్పటివరకూ పాకిస్తాన్‌లో 7,700కుపైగా మంది కరోనావైరస్ బారినపడ్డారు. వీరిలో సుమారు 150 మంది ప్రాణాలు కోల్పోయారు.
ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఈ నెల 25న మొదలవుతోంది. సాధారణంగా రంజాన్ మాసంలో మసీదుల్లో ప్రార్థనలకు ఎక్కువ సంఖ్యలో ముస్లింలు వస్తుంటారు.
పోయిన నెలలో విధించిన ఆంక్షల ప్రకారం ఒకేసారి గరిష్ఠంగా ఒక చోట ఐదుగురు మాత్రమే కలిసి ప్రార్థన చేసే వీలుండేదని ‘పాకిస్తాన్ టుడే’ న్యూస్ వెబ్‌సైట్ పేర్కొంది.
ఇప్పుడు ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం... రంజాన్ మాసంలో జనాలు మసీదులకు గుంపులుగా వచ్చి ప్రార్థనలు చేయొచ్చు. కానీ మాస్కులు ధరించాలి. సామాజిక దూరం పాటించాలి. ఒకరికొకరు కనీసం ఆరు అడుగుల దూరంలో ఉండాలి.
మసీదుల్లో కార్పెట్లు వేయరు. ఇఫ్తార్ కూడా ఉండదు. వయసులో 50 ఏళ్లకు పైబడినవాళ్లు, చిన్నారులు, జలుబు, దగ్గు లాంటి లక్షణాలున్నవాళ్లు మసీదులకు వెళ్లకూడదు.
ప్రభుత్వ మార్గదర్శకాలను జనం ఎంతవరకూ పాటిస్తారన్నది చాలా పెద్ద ప్రశ్న.
శుక్రవారం ప్రార్థనల సమయంలో చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘనలు జరుగుతున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.
ఇస్లామాబాద్‌లోని లాల్ మసీదులో ఇటీవల ప్రార్థనల సమయంలో అక్కడి జనాలు ప్రభుత్వాదేశాలను పూర్తిగా తుంగలో తొక్కారని ‘జంగ్’ న్యూస్ వెబ్‌సైట్ పేర్కొంది.
ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటిస్తామని పాకిస్తాన్ ఉలేమా కౌన్సిల్ (పీయూసీ) తెలిపినట్లు ‘ఇండియా టుడే’ న్యూస్ వెబ్‌సైట్ పేర్కొంది.
చిన్న పొరపాటు జరిగినా, మసీదుల మూసివేతకు దారి తీయొచ్చని, ప్రార్థలనకు వచ్చేవారు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని పీయూసీ ఛైర్మన్ హఫీజ్ తాహిర్ అష్రాఫీ అభ్యర్థించినట్లు ‘అరబ్ న్యూస్’ వెబ్‌సైట్ తెలిపింది.
మరోవైపు అరబ్ దేశాలు ప్రజలను ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని కోరుతున్నాయి.
సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాన్, అల్జీరియా, టునీషియా, జోర్డాన్, కువైట్, టర్కీ, సిరియా, లెబనాన్, ఈజిప్ట్ తదితర దేశాలు మసీదుల్లో ప్రార్థనలను నిలిపివేసినట్లు ఇండియా టుడే పేర్కొంది.
చాలా అరబ్ దేశాల్లో ప్రార్థనల కోసం జనాలను పిలిచే ప్రకటనను కూడా, ఇళ్లలోనే ప్రార్థన చేసుకోవాలని చెప్పేలా మార్చారని తెలిపింది.
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో సౌదీ ప్రజలు ఇళ్లలోనే ప్రార్థన చేసుకోవాలని ఆ దేశ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రి అబ్దుల్ లతీఫ్ అల్ షేక్ కోరినట్లు ఇండియా టుడే పేర్కొంది.
ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేసే అవకాశాన్ని ప్రపంచం ఎలా చేజార్చుకుంది?
- ‘కరోనావైరస్తో ఐసొలేషన్ వార్డులో నేను ఎలా పోరాడానంటే...’ - తెలంగాణలో పేషెంట్ 16 స్వీయ అనుభవం
- కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్ తయారు చేసిన భారతీయ శాస్త్రవేత్త
- కరోనావైరస్కు భయపడని ఏకైక యూరప్ దేశం ఇదే
- బ్రిటన్‌లో ఎన్హెచ్ఎస్ కోసం రూ.180 కోట్ల విరాళాలను సేకరించిన 99 ఏళ్ల మాజీ సైనికుడు
- కరోనావైరస్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది?
- కరోనావైరస్ లాక్ డౌన్‌తో రోడ్లపైకి వచ్చిన సింహాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)