కరోనావైరస్‌: రెండు వ్యాక్సీన్లపై పరీక్షలు మొదలుపెట్టిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు

    • రచయిత, ఫ్రాన్సెస్ మావో
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనావైరస్‌కు వ్యాక్సిన్‌ను రుపొందించే విషయంలో ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. వైరస్‌ను అడ్డుకోవచ్చని భావిస్తున్న రెండు టీకాలను ప్రస్తుతం ప్రయోగశాలల్లో పరీక్షిస్తున్నారు.

ఇప్పటికే ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయం, అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఇనోవియోతో కలిసి సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సీన్‌ను జంతువులపై పరీక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించింది.

ప్రస్తుతం తమ దేశంలో తయారైన వ్యాక్సీన్ సత్ఫలితాన్నిస్తే మానవులకు వరంగా మారనుందని ఆస్ట్రేలియా నేషనల్ సైన్స్ ఏజెన్సీ భావిస్తోంది.

అమెరికాలో తొలిసారిగా గత నెలలోనే జంతువులపై ప్రయోగించకుండానే మానవులపై పరీక్షలు నిర్వహించారు.

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రస్తుతం కోరనావైరస్‌ విరుగుడుకు వ్యాక్సీన్ కనుగొనేందుకు ప్రయత్నాలు శరవేగంగా సాగుతున్నాయి.

అయితే తాము నిర్వహిస్తున్న పరీక్షలు మరింత సమగ్రమైనవని ఆస్ట్రేలియా కామన్‌ వెల్త్‌ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(సీఎస్ఐఆర్‌ఓ) తెలిపింది.

ఈ విషయంలో ఈ స్థాయిలో ప్రపంచ దేశాల సహకారం, పరిశోధనల్లో ఇంత వేగం ఏమాత్రం ఊహించలేదని, ఇదో అసాధారణమైన ప్రక్రియ అని పరిశోధకులు చెబుతున్నారు.

“సాధారణంగా ప్రయోగాలు ఈ స్థాయికి చేరుకునేందుకు కనీసం ఒకటి నుంచి రెండేళ్లు పడుతుంది. కానీ కొద్ది నెలల్లోనే ఇప్పుడు ఇది సాధ్యమయ్యింది” అని సీఎస్ఐఆర్‌ఓకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ రోబ్ గ్రీన్‌ఫెల్ మీడియాతో అన్నారు.

ఇది ఎలా పని చేస్తుంది ?

గడిచిన కొద్ది రోజులుగా సీఎస్ఐర్‌ఓ బృందం ముంగిసను పోలిన జంతువులపై ఈ వ్యాక్సీన్‌ను పరీక్షిస్తూ వస్తోంది. మానవులకు సోకినట్టే వాటికి కూడా కరోనావైరస్ సంక్రమిస్తుందని ఇప్పటికే నిరూపితమయ్యింది.

కోవిడ్ -19వ్యాధికి ప్రధాన కారణం Sars-CoV-2 వైరస్. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20 వ్యాక్సీన్లు ప్రయోగ దశలో ఉన్నాయి.

ఈ మొత్తం పరిశోధనను పర్యవేక్షిస్తున్న కొయిలేషన్ ఫర్ ఎపిడమిక్ ప్రీపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్ ఎంపిక చేసిన రెండు టీకాలను సీఎస్ఐఆర్ఓ ప్రస్తుతం పరీక్షిస్తోంది.

అందులో యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ ఫర్డ్ రూపొందించిన వెక్టార్ వ్యాక్సిన్ ఒకటి.

“అంటే దీని ద్వారా కరోనావైరస్ ప్రోటీన్ వ్యవస్థలోకి అచేతనావస్థలో ఉన్న వైరస్‌ను చొప్పిస్తారు. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అయితే అచేతనంగా ఉంటుంది కనుక ఆ వైరస్‌కి పునరుత్పత్తి శక్తి ఉండదు. అందువల్ల ఈ వ్యాక్సీన్ ద్వారా మళ్లీ అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉండదు” అని ప్రస్తుతం ఈ ప్రయోగాలను నిర్వహిస్తున్న విక్టోరియాలోని ఆస్ట్రేలియన్ యానిమల్ హెల్త్ లేబొరేటరీ డైరక్టర్ ప్రొఫెసర్ ట్రెవొర్ డ్రూ చెప్పారు.

ఇనోవియో సంస్థ సిద్ధం చేసిన రెండో టీకా గురించి కూడా ఆయన వివరించారు. మొదటి టీకాకు ఇది కాస్త భిన్నమైనదే అయినప్పటికీ దాంతో పోల్చితే ఉత్తేజకరమైనదని చెప్పవచ్చు.

కరోనావైరస్‌కు సంబంధించిన ప్రోటీన్లను వ్యాధి నిరోధక వ్యవస్థతో ఎన్‌కోడ్ చేసే విధంగా దీన్నిరూపొందించారు. తద్వారా వ్యాధి నిరోధక వ్యవస్థ వాటికి స్పందించడానికి ముందే శరీరంలోని కణాలకు ఆ ప్రోటీన్లను ఉత్పత్తి చేయమని ప్రేరేపిస్తాయి.

“ఈ విషయంలో భిన్న పరిష్కార మార్గాలను ప్రయత్నించడం చాలా అవసరం. అప్పుడే అత్యుత్తమ విజయాన్ని సాధించగలం” అని ప్రొఫెసర్ డ్రూ అభిప్రాయపడ్డారు.

ఎన్నాళ్లలో ఫలితాలు?

జంతువులపై ప్రయోగాల ఫలితాలు జూన్ నాటికి వెలువడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అవి విజయవంతమైతే ప్రయోగశాలల్లో ఆ వ్యాక్సీన్‌పై క్లినికల్ ట్రైల్స్ నిర్వహిస్తారు.

ఆ తర్వాత ఔషధం విపణిలోకి విడుదల చేసేందుకు ప్రయత్నాలు మరింత వేగవంతమవుతాయి. అయితే ఎంత వేగంగా ప్రయత్నించినప్పటికీ నియంత్రణ పరీక్షలు, ప్రమాణాలను చేరుకునేందుకు కనీసం 18 నెలల సమయం అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అమెరికన్ నియంత్రణలకు లోబడి మరో పరిశోధనశాలలో మరో ప్రత్యేక జంతువుపై కూడా ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ వ్యాక్సీన్‌ను పరీక్షిస్తున్నారు.

“ప్రస్తుతం ఈ టీకా విషయంలో అన్నికంపెనీలు, సంస్థలు కలిసి పని చేస్తున్నాయి. ఎందుకంటే ఏ ఒక్కరో టీకాను ఉత్పత్తి చెయ్యడం సాధ్యం కాదు” అని డాక్టర్ గ్రెన్‌ఫెల్ వ్యాఖ్యానించారు.

అయితే ప్రస్తుతం ప్రపంచ దేశాలు పరస్పర సహకారంతో చేస్తున్న ఈ ప్రయత్నాల పట్ల తాను చాలా ఆశావహంగా ఉన్నట్లు గ్రెన్ ఫెల్ చెప్పుకొచ్చారు.

‘‘వివిధ పరిశోధన సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య కలిసికట్టుగా నిజాయితీగా చేస్తున్న ప్రయత్నం ఇది. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాల్సి ఉంది’’ అని ఆయన అన్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)