కరోనావైరస్: ఈ మహమ్మారి మగవారినే ఎక్కువగా టార్గెట్ చేసిందా... మహిళల పట్ల పక్షపాతం చూపిస్తోందా?

బస్సు డ్రైవర్ల నుంచి ప్రధాన మంత్రుల వరకు, అన్ని వ‌ర్గాల‌ ప్రజలు కోవిడ్ -19 బారిన పడుతున్నారు. వైరస్ ఒక జన్యు పదార్థమే కానీ దీనికి పక్షపాత ధోరణి చూపించే లక్షణం లేదు.

కానీ, వైరస్ వివిధ వర్గాల ప్రజలపై వివిధ రకాలుగా ప్రభావం చూపిస్తోంది. అందులో ముఖ్యంగా కనిపిస్తోన్న అంశం లింగ భేదం.

భిన్న ప్రభావాలు

ఇప్పటి వరకు తీవ్రంగా కనిపించిన తేడాలలో స్త్రీ పురుషుల మరణాల రేటులో వ్యత్యాసం ఒకటి.

ఉదాహరణకు అమెరికాలో ఈ వైరస్ సోకి చ‌నిపోయిన వారిలో మహిళల కంటే పురుషుల సంఖ్య‌ రెండు రెట్లు ఎక్కువ‌గా ఉంది. పశ్చిమ యూర‌ప్ లో చోటు చేసుకున్న 69 శాతం మరణాలు పురుషులవే.

చైనాతో పాటు మరి కొన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి కనిపించింది. స్త్రీ పురుషులపై ఈ వైర‌స్ చూపే ప్రభావంలో ఉన్న వ్యత్యాసాలపై యూనివర్సిటీ కాలేజీ లండన్ లో కొంత మంది పరిశోధకులు అధ్య‌య‌నం చేస్తున్నారు. ఈ వ్యత్యాసాలకు కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు.

వైరస్ తో పోరాడేందుకు కావాల్సిన‌ రోగ నిరోధక శక్తి మహిళల్లో ఎక్కువగా ఉండటమే దీనికి ఒక కారణమని ఆక్స్ ఫ‌ర్డ్ విశ్వ‌విద్యాల‌యంలో ఇమ్యూనాల‌జీ ప్రొఫెసర్ ఫిలిప్ గౌల్డర్ అన్నారు. "పురుషులతో పోల్చి చూస్తే వ్యాక్సీన్లకు, ఇన్ఫెక్షన్లకు తట్టుకునే శక్తి మహిళల్లో ఎక్కువ స్థాయిలో ఉంటుంది" అని ఆయన చెప్పారు.

స్త్రీలలో రెండు ఎక్స్ క్రోమోజోములు ఉంటే, పురుషుల్లో ఒకే ఎక్స్ క్రోమోజోమ్ ఉండటం కూడా వైరస్ ప్రభావానికి లోను కాకపోవడానికి ఒక కారణం కావచ్చని అన్నారు.

"ఎక్స్ క్రోమోజోములో ఉండే ప్రోటీన్ కరోనావైరస్ ని కనిపెడుతుంది. దీంతో మహిళల్లో రెండు ఎక్స్ క్రోమోజోములు ఉండటం వలన వైరస్ తో పోరాడే రోగ నిరోధక శక్తిని రెండింతలు పెంపొందించుకునే శక్తి మహిళల్లో ఉంటుంది" అని ఆయ‌న వివ‌రించారు.

అలాగే పురుషులు, మహిళలు పాటించే జీవన విధానం కూడా వైరస్ ప్రభావం చూపడంలో వ్యత్యాసాలు ఉండటానికి ఒక కారణం.

ముఖ్యంగా పొగ తాగే అలవాటు ఉన్నవారిలో క్యాన్సర్, గుండె జబ్బులు, తీవ్రమైన ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉండే అవకాశం ఉందని గౌల్డర్ చెప్పారు.

వైరస్ ప్రభావం చూపడంలో ఇలాంటి లక్షణాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి.

పొగ తాగే అలవాటులో కూడా స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. ఉదాహరణకు చైనాలో పొగ తాగే పురుషులు 50 శాతం మంది ఉంటే, మహిళలు 5 శాతం మాత్రమే ఉన్నారు.

అయితే, ఇప్పుడు వైరస్ ప్రబలుతున్న దశలో ఈ వ్యత్యాసాలు జీవన శైలిపై ఆధారపడి ఉన్నాయా అన్నది కచ్చితంగా చెప్పలేం.

ఆర్ధిక నష్టం

వైరస్ ప్రభావం స్త్రీ పురుషుల మీద భిన్నంగా ఉందనే విషయం అయితే అర్ధం అవుతోంది.

జెర్మనీలోని మాన్ హీమ్ యూనివర్సిటీలో ఆర్ధిక వేత్తగా ఉన్న మిషెల్ టెర్టిల్ట్ తన బృందంతో కలిసి ఈ మహమ్మారి మహిళలు, పురుషుల ఉద్యోగాల మీద ఎలా ప్రభావం చూపిస్తుందనే అంశంపై అధ్యయనం చేస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో విధించిన లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు కోల్పోగా, కొన్ని ఆర్ధిక వ్యవస్థలు ఆర్ధిక మాంద్యం వైపు పయనిస్తున్నాయి.

సాధారణ ఆర్ధిక విపత్తు కంటే ఇప్పుడు సంభవించిన విపత్తు భిన్నమైనదని టెర్టిల్ట్ అన్నారు.

ఒక్క అమెరికాలోనే 2.6 కోట్ల మందికి పైగా నిరుద్యోగులయ్యారు. 1975 తర్వాత ఇంత పెద్ద ఎత్తులో నిరుద్యోగం చోటు చేసుకోవడం ఇదే మొదటి సారి. దీనికి మహిళలు ఎక్కువగా ప్రభావితమయ్యారు. మహిళల్లో నిరుద్యోగం శాతం 0.9 శాతం ఉంటే పురుషుల్లో 0. 7 శాతం ఉంది.

సాధారణంగా ఆర్ధిక మాంద్యం పరిస్థితులు తలెత్తినప్పుడు ఎక్కువగా పురుషులు నిరుద్యోగులవుతూ ఉంటారు. ఆర్ధిక వ్యవస్థ నడవడానికి ఊతమిచ్చే నిర్మాణ రంగ, ఉత్పత్తి పరిశ్రమల్లో పురుషులు ఎక్కువగా పని చేయడం దీనికి ఒక కారణం. మహిళలు విద్య, ఆరోగ్య రంగాలలో ఎక్కువగా పని చేస్తూ ఉంటారు.

కానీ, ఈ సారి నిరుద్యోగ పరిస్థితి తలెత్తడానికి వివిధ రకాల అంశాలు కారణంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగి ఎంత ప్రాముఖ్యమైన రంగంలో పని చేస్తున్నారనేది ఒక అంశం.

టెర్టిల్ట్ బృందం ఉద్యోగులను ఆరోగ్య రంగం, రవాణా, భద్రతా సేవలు, వ్యవసాయం, మత్స్య వేట, వన్య సంరక్షణ, కొన్ని అత్యవసర సేవా రంగాలుగా విభజించింది. ఈ విభజన ప్రకారం, 24 శాతం మంది పురుషులు అన్ని రంగాలలో కలిపి పని చేస్తుంటే, 17 శాతం మంది మహిళలు అత్యవసర రంగాలలో పని చేస్తున్నారు.

ఉద్యోగులు కేవలం ఇంటి దగ్గర నుంచే తమ విధులు నిర్వర్తించగలరా లేదా అనేది రెండవ పెద్ద అంశం. ఏ యే రంగాలలో ఉద్యోగులు ఇంటి దగ్గర నుంచే తమ సేవలు నిర్వర్తించగలరో కూడా టెర్టిల్ట్ బృందం విభజించింది.

ఉదాహరణకు ఒక బిజినెస్ అనలిస్ట్ ఇంటి దగ్గర నుంచి విధులు నిర్వర్తించగలరు కానీ, బార్ లో పని చేసే వ్యక్తికి అలా కుదరదు.

మహిళల కన్నా పురుషులు చేసే ఉద్యోగాలలో ఎక్కువ ఇంటి దగ్గర నుంచే నిర్వర్తించగలిగేవి ఉన్నాయని టెర్టిల్ట్ బృందం అంచనా వేసింది. పురుషులకి ఈ అవకాశం 28 శాతం ఉంటే మహిళలకి ఇది కేవలం 22 శాతం మాత్రమే.

చాలా మంది మహిళలు రెస్టారెంట్లలో, పర్యటక రంగంలో పని చేయడం కూడా దీనికి ఒక కారణం.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు రెస్టారెంట్లు, బార్లు మూత పడ్డాయి. పర్యటక రంగం పూర్తిగా స్తంభించిపోయింది.

యుకెలో ఇన్స్టిట్యూట్ అఫ్ ఫిస్కల్ స్టడీస్ చేసిన పరిశోధన కూడా ఇదే అంశాలను స్పష్టం చేసింది.

ఆర్థికపరంగా చూస్తే, చిన్న ఉద్యోగాలలో పని చేస్తున్న వారు, చిన్న వయసు ఉన్న స్త్రీలు దీని వలన ఎక్కువగా ప్రభావితమయ్యారని ది వరల్డ్ వి వాంట్' సంస్థ సహ వ్యవస్థాపకురాలు నటాషా ముదార్ చెప్పారు.

మహిళలు నిరుద్యోగులు అవ్వడం మాత్రమే కాదు వారి సంపాదనలో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి.

"ఈ విపత్తు సమయంలో ఒక పురుషుడు తన అవసరాలపై ఒక పౌండ్ ( సుమారు 95 రూపాయలు) ఖర్చు పెట్ట‌గ‌లిగితే, ఒక మహిళ తన అవసరాలపై కేవలం 82 పెన్స్ (78 రూపాయలు) మాత్రమే ఖర్చు పెట్టగలరని" ముదార్ అన్నారు.

అమెరికాలో పురుషులు సంపాదిస్తున్న ఆదాయంతో పోలిస్తే మహిళలు 85 శాతం సంపాదిస్తుంటే, ఆస్ట్రేలియాలో 86 శాతం, భారతదేశంలో 75 శాతం సంపాదిస్తున్నారు.

అమెరికాలో శ్వేత జాతి మహిళల కన్నా నల్ల జాతి మహిళలు 21 శాతం తక్కువ సంపాదిస్తారు.

ఒంటరి మహిళలు, పురుషులు కూడా ఈ విపత్తుతో ఎక్కువగా ప్రభావితమయ్యారు. టెర్టిల్ట్ పరిశోధన ప్రకారం, ఒక్క అమెరికాలోనే 2 కోట్ల మంది సింగల్ పేరెంట్లు ఉన్నారు. అందులో మూడు వంతుల మంది మహిళలు. వీళ్ళలో ఎవరు ఉద్యోగం చేయలేకపోయినా కలిగే నష్టం ఎలా ఉంటుందో ఊహించవచ్చు.

అలాగే, వీళ్ళలో కొంత మంది ఇంటి దగ్గర నుంచి పని చేయగలిగే వృత్తుల్లో ఉన్నా, 24 గంటలు చూసుకోవల్సిన చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే కూడా విధులు నిర్వర్తించడం కష్టమే అవుతుంది. దీంతో, కొంత మంది ఉద్యోగాలు వదులుకోవాల్సి వస్తుంది.

వాళ్ళంతట వాళ్ళు ఉద్యోగాలు మానేస్తే బ్రిట‌న్, జెర్మనీ, అమెరికాలో లాంటి దేశాలలో ప్రభుత్వం ఇచ్చే నిరుద్యోగ భృతి కూడా లభించదు.

అసమానతలు

కరోనావైరస్ మహమ్మారి ఆర్ధిక అసమానతలని లైంగిక‌త‌ పరంగా కూడా ముందుకు తీసుకుని వచ్చింది. “అన్ని మహమ్మారులు లైంగిక‌త‌ పరంగా ప్రభావం చూపాయని” లండన్ స్కూల్ అఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ లో గ్లోబల్ హెల్త్ పాలసీ అసోసియేట్ ప్రొఫెసర్ క్లేర్ వెన్హాం అన్నారు.

వెన్హాం బృందం జికా, ఎబోలా ప్రబలిన సమయంలో వైరస్ వివిధ వర్గాల ప్రజలపై చూపిన ప్రభావాన్ని అంచనా వేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ చూపిస్తున్న ప్రభావంపై అధ్యయనం చేస్తున్నారు. సియర్రా లియోన్లో ఎబోలా తలెత్తినప్పుడు ప్రసూతి మరణాల సంఖ్య పెరిగిందని తెలిపారు.

గర్భిణుల సంరక్షణ ముఖ్యమని, ప్రసవ సమయంలో మహిళల, శిశువుల సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చినప్పటికీ దీనిపై ఎవరూ దృష్టి పెట్టలేదు.

ఏదైనా విపత్తు తలెత్తినప్పుడు వనరులన్నీ విపత్తు నియంత్రణ వైపు మళ్లడం సహజం. అలాంటి సమయాలలో ప్రభావితమయ్యేది మొదట గర్భిణీ మహిళలేనని వెన్హాం అన్నారు. సుమారు 95 లక్షల మంది మహిళలు 2020 సంవత్సరంలో గర్భ నిరోధక సాధనాలు అందక ఇబ్బంది పడతారని ఫ్యామిలి ప్లానింగ్ ఆర్గనైజషన్ మేరీ స్టోప్స్ అంచనా వేసింది.

ఈ మహమ్మారి సమయంలో గృహ హింస కూడా పెరిగింది. ఫ్రాన్సులో లాక్ డౌన్ తర్వాత గృహ హింస కేసుల సంఖ్య‌ మూడింత‌లు పెరిగింది. ఆస్ట్రేలియాలో 75 శాతం పెరిగితే, లెబనాన్లో రెండింతలు అయ్యాయి.

గృహ హింస పురుషులు, మహిళల పై కూడా ప్రభావితం చూపించవచ్చు కానీ, పురుషులతో పోలిస్తే మహిళలపై చూపే ప్రభావం ఎక్కువ. గృహ హింస సాధారణంగా ఇంట్లో చోటు చేసుకుంటుందని వెన్హాం అన్నారు.

మనుషుల్ని ఉద్యోగం లేనప్పుడు, చేతిలో డబ్బులు లేనప్పుడు ఇంట్లో పెట్టి బంధిస్తే కలిగే ఒత్తిడి కూడా హింస పెరగడానికి ఒక కారణమని సులభంగా అర్ధమవుతుందని అన్నారు. ఇది అర్ధం చేసుకోవడానికి రాకెట్ సైన్స్ చదవక్కరలేదని అన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు విషాదకరంగా ఉన్నాయి.

ఈ వైర‌స్ ముఖ్యంగా వృద్దులను ఎక్కువ‌గా భ‌య‌పెడుతోంది. ఒక వేళ కోవిడ్- 19 బారి నుంచి కోలుకుంటే ఆరోగ్యంపై అది చూపే దీర్ఘ కాలిక పరిణామాలపై మహిళల్లో ఆందోళ‌న‌ నెలకొని ఉంది. ఆర్ధికంగా న‌ష్ట‌పోయిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాల‌ని వెన్హాం కోరుతున్నారు.

మహిళలకు తగిన ఉపాధి కల్పించేందుకు, పిల్లల్ని చూసుకునేందుకు తగిన సహాయం అందించాల‌న్నారు. లింగ‌ సమానత్వం కోసం టెర్టిల్ట్ పరిశోధన రెండు అంశాలను సూచించింది.

మొదటిది మహిళలకు ఇంటి దగ్గర నుంచే పని చేసే అవకాశం కల్పించగలిగేలా చూడటం. ఇది మహిళలు ఉద్యోగాలు మానేయకుండా ఇంటిని, పిల్లల్ని చూసుకోగలిగేందుకు సహకరిస్తుంది. అమెరికాలో ఫిబ్రవరితో పోలిస్తే మార్చ్ నెలలో ఇంటి దగ్గర నుంచే పని చేసే వారి సంఖ్య 200 శాతం పెరిగిందని టెర్టిల్ట్ చెప్పారు.

భార్యా భర్తల్లో ఒకరు ఇంటి వద్ద నుంచి పని చేయగలిగితే ఒకరు పిల్లల్ని చూసుకోగలుగుతారు. ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోగలిగితే చాలు. పెటర్నిటీ లీవ్ ని పెంచడం ద్వారా కూడా తండ్రులను పిల్లల సంరక్షణలో బాధ్యులని చేసినట్లవుతుంది. ఇది ఇప్పటికే కొన్ని దేశాలు అమలు చేశాయి.

లాక్ డౌన్ ఒక నెల నుంచి రెండు నెలలు ఉంటే కూడా చాలా ప్రభావాలు ఉంటాయి. అంత కన్నా ఎక్కువ కొనసాగితే ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)