కరోనావైరస్ లాక్ డౌన్: భారత్‌లో స్వచ్ఛమైన గాలి కోసం ఉద్యమానికి బాటలు వేస్తుందా?

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించటానికి భారతదేశం మొత్తాన్నీ గత నెలలో లాక్‌డౌన్ చేశారు. రవాణాను నిలిపివేశారు. అప్పట్లో కాలుష్యంతో నిండివున్న ఆకాశం వేగంగా నీలిరంగులోకి మారింది. గాలి అరుదైన రీతిలో స్వచ్ఛంగా మారింది.

వాయు కాలుష్యం స్థాయి ఎన్నడూ చూడనంత తక్కువగా పడిపోయింది. జనం స్వచ్ఛమైన ఆకాశం ఫొటోలను షేర్ చేశారు. పలు నగరాల్లో దశాబ్దాలుగా కాలుష్యం పొరలతో కనిపించకుండా పోయిన హిమాలయ శిఖరాలు మళ్లీ కనిపించాయి.

ప్రపంచంలో వాయు కాలుష్యం అత్యధికంగా నమోదయ్యే నగరాల్లో ఒకటైన దిల్లీ నివాసి ఒకరు.. ‘పర్వతాల మీద ఉండేంత స్వచ్ఛమైన వాతావరణం’ రాజధానిలో ఉందంటూ ఒక సోషల్ మెసేజ్ గ్రూప్‌లో సందడి చేశారు.

‘‘కనువిందు చేసే నీలి ఆకాశాలు, స్వచ్ఛమైన గాలిని పీల్చుకున్నపుడు వచ్చే సంతోషం మిగతా సమయాల్లో మనం మనకు ఏం చేసుకుంటున్నామో వివరిస్తున్నాయి’’ అని రాజకీయవేత్త, రచయిత శశిథరూర్ రాశారు.

ఆరు నెలల క్రితం...

దిల్లీ నగరానికి ఊపిరి పీల్చుకోవటం కష్టంగా మారింది. గాలి నాణ్యత భరించలేని స్థాయికి దిగజారిందని అధికారులు చెప్పారు. స్కూళ్లు మూసేశారు. విమానాలను దారి మళ్లించారు. జనం మాస్కులు ధరించాలని సూచించారు. ఇళ్ల తలుపులు, కిటికీలు మూసివేయాలని చెప్పారు. కాలుష్యం ఉన్న ప్రాంతాలకు వెళ్లొద్దన్నారు.

ప్రపంచంలో అత్యంత కాలుష్యమయమైన 20 నగరాల జాబితాలో దిల్లీ, మరో 14 భారతీయ నగరాలు ఉన్నాయి. వాయు కాలుష్య సంబంధిత వ్యాధుల కారణంగా ప్రతి ఏటా పది లక్షల మందికి పైగా భారతీయులు చనిపోతున్నారని అంచనా.

పారిశ్రామిక పొగలు, వాహనాల ఉద్గారాలు, చెత్త కాల్చటం, పంటకోత తర్వాత వ్యర్థాలను తగులబెట్టటం, నిర్మాణాలు, రోడ్ల ధూళి.. ఈ కాలుష్యానికి ప్రధాన కారణాలు.

ఇప్పుడు దేశంలో పట్టణ ప్రజలు ఆకాశాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నారు. తమ ఇళ్లలో స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారు. దీంతో దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం మీద ‘లాక్‌డౌన్’ ప్రభావం ఎలా ఉందనే సమాచారం తెలుసుకోవటానికి పరిశోధకులు ఉద్యుక్తులయ్యారు.

‘‘ఒక అసాధారణ పరిణామానికి వాయు కాలుష్యం స్థాయులు ఎలా మారుతున్నాయో దగ్గరగా పరిశీలించటానికి ఇది అనూహ్యమైన అవకాశం’’ అని ‘అర్బన్ ఎమిషన్స్’ అనే స్వతంత్ర పరిశోధన సంస్థ అధిపతి శరత్ గుత్తికుండ నాతో చెప్పారు.

దేశంలోని 85 నగరాల్లో గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నివేదించారు.

దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 100 గాలి నాణ్యత పరిశీలన కేంద్రాల నుంచి సేకరించిన సమాచారాన్ని డాక్టర్ గుత్తికుండ, ఆయన పరిశోధకుల బృందం అధ్యయనం చేసింది.

దిల్లీ, నేషనల్ కేపిటల్ రీజియన్ అని పిలిచే దాని శివారు ప్రాంతాల మీద దృష్టి కేంద్రీకరించాలని వారు నిర్ణయించుకున్నారు. ఇక్కడ రెండు కోట్ల మందికి పైగా జనం నివసిస్తున్నారు.

ఇక్కడ గత చలికాలంలో వాయు కాలుష్యం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన రక్షిత పరిమితి కన్నా 20 రెట్లకు పైగా పెరిగింది.

దిల్లీ వాయు కాలుష్యంలో ప్రాణాంతకమైన రేణువులు.. పీఎం 2.5 పార్టికల్స్. వీటివల్ల శ్వాస సంబంధిత వ్యాధులు, గుండె జబ్బులు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇవి ప్రధానంగా మంట పెట్టడం, వాహన ఉద్గారాలు, విద్యుత్ ప్లాంట్లలో దహన చర్యల ద్వారా వెలువడతాయి.

లాక్‌డౌన్ సమయంలో దిల్లీలో పీఎం 2.5 స్థాయులు ఘనపు అడుగుకు 20 మైక్రోగ్రాములకు పడిపోయిందని, 20 రోజుల సగటు 35 మైక్రోగ్రాములుగా ఉందని అర్బన్ ఎమిషన్స్ గుర్తించింది.

రాజధాని నగరంలో 2017–19 మధ్య పీఎం 2.5 నెలవారీ సగటు నాలుగు రెట్ల కన్నా ఎక్కువగా ఉంది. (దేశంలో ఈ రేణువుల పరిమితిని ఘనపు అడుగుకు 40 మైక్రోగ్రాములుగా నిర్ణయించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం కేవలం 10 మైక్రోగ్రాముల పరిమితినే నిర్దేశించింది.)

‘‘పీఎం 2.5 స్థాయి 35 మైక్రోగ్రాములే అయినట్లయితే ఈ కాలుష్యంలో 70 శాతం పైగా స్థానికంగానే తయారవుతోందని అర్థం’’ అని గుత్తికుండ పేర్కొన్నారు.

ప్రధానంగా రోడ్లు, భవన నిర్మాణ పనుల ధూళి వల్ల వచ్చే పీఎం 10 స్థాయి, వాహనాల ఉద్గారాల వల్ల విడుదలయ్యే నైట్రోజన్ డయాక్సైడ్‌లు కూడా గణనీయంగా పడిపోయినట్లు ఆయన అధ్యయనంలో వెల్లడైంది. లాక్‌డౌన్ కారణంగా నగరంలో దాదాపు 90 శాతం వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.

‘‘శిలాజ ఇంధన దహనాలను తగ్గించటానికి గట్టిగా కృషి చేస్తే నిర్మలమైన ఆకాశం, శ్వాసించగల స్వచ్ఛమైన గాలిని చాలా వేగంగా సాధించవచ్చునని ప్రస్తుత సంక్షోభం మనకు చూపింది’’ అని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ సంస్థకు చెందిన సునీల్ దహియా పేర్కొన్నారు. ఈ సంస్థ కూడా లాక్‌డౌన్ సమయంలో వాయు కాలుష్య స్థాయుల మీద పరిశోధన చేస్తోంది.

కానీ.. ఇది మార్పుకు ప్రేరణనిస్తుందా?

నిజానికి.. ప్రతి ఏటా చలికాలంలో పెరిగిపోయే కాలుష్యం మీద పట్టణ ప్రాంత వాసుల్లో, మీడియాలో వ్యక్తమయ్యే భయాందోళనలు వేసవి వేడిలో, ఆ తర్వాత వర్షాలు, కరవుల మీద ఆందోళనల్లో ఆవిరైపోతుంటాయి.

‘‘మరింత స్వచ్ఛమైన గాలి కోసం మన దగ్గర ప్రజాస్వామిక డిమాండ్ లేదు’’ అంటారు వాతావరణం మీద మేధో బృందంగా వ్యవహరిస్తున్న కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ సీఈఓ అరునభ ఘోష్.

గాలిని శుభ్రం చేయాలనే ఉత్తర్వులు దాదాపు ఎప్పుడూ.. ఎన్‌జీఓలు కోరినప్పుడు కోర్టుల నుంచే వస్తుంటాయి.

అయితే నిర్మలమైన ఆకాశం, పరిశుభ్రమైన గాలిని రుచిచూసిన అనుభవం దేశంలో స్వచ్ఛమైన గాలి కోసం ప్రజాస్వామిక డిమాండ్ రావటానికి ప్రేరణనిస్తుందని డాక్టర్ ఘోష్ ఆశిస్తున్నారు.

సంక్షోభాల వల్ల తరచుగా జీవితాలను మార్చివేసే సంస్కరణలు పుడుతుంటాయి. 1952లో లండన్‌ను నాలుగు రోజుల పాటు చుట్టుముట్టి వేలాది మంది ప్రాణాలను బలితీసుకున్న ‘పీ-సోపర్’ వల్ల అక్కడ పొగను పుట్టించే ఇంధనాల వాడకం తగ్గించటం కోసం ‘స్వచ్ఛ వాయువు చట్టం’ చేశారు.

చైనా 2008లో బీజింగ్ ఒలింపిక్స్, షాంఘైలో వరల్డ్ ఎక్స్‌పో, 2010లో గ్వాంగ్జూ ఏసియన్ గేమ్స్ నిర్వహించటానికి ముందు గాలిని శుభ్రం చేయటానికి ప్రయత్నించింది. ఆ తర్వాత మళ్లీ కాలుష్యం పెరిగిపోయింది.

అయితే.. 2014లో బీజింగ్‌లో జరిగిన అపెక్ సమావేశం ఒక కీలక మలుపుగా చాలా మంది భావిస్తారు. ఆ సమావేశంలో 21 ఆసియా పసిఫిక్ దేశాల అధినేతలకు చైనా ఆతిథ్యమిచ్చింది. బీజింగ్ ఆకాశంలో అప్పుడు అరుదుగా కనిపించిన నీలాకాశం.. ‘అపెక్ బ్లూ’ అనే పదాన్ని కూడా పుట్టించింది. గాలిని వేగంగా శుభ్రం చేయటం కోసం చైనా పలు తీవ్ర చర్యలు చేపట్టింది. ఫలితంగా తర్వాతి నాలుగు సంవత్సరాల్లో చైనాలోని ప్రధాన నగరాలన్నిటా సగటు కాలుష్య స్థాయి 32 శాతం తగ్గిపోయింది.

మరి, ఒక మహమ్మారి వ్యాప్తిని నిరోధించటానికి విధించిన లాక్‌డౌన్ భారతదేశంలో గాలిని శుభ్రం చేయటానికి ఆ తరహా విధాన మార్పులకు ప్రేరణిస్తుందా?

రోడ్ల మీద ట్రాఫిక్‌ను తగ్గించటానికి, ప్రజలను ఎక్కువగా ఇళ్ల నుంచే పనిచేయమని చెప్పటానికి ప్రయత్నించగలదా?

జపాన్‌లో ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రం దెబ్బతిన్నపుడు విద్యుత్ కొరత తలెత్తటంతో ఆఫీసుల్లో ఎయిర్ కండిషనింగ్‌ను, కర్బన ఉద్గారాలను తగ్గించటానికి ఆ దేశం ‘కూల్ బిజ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆఫీసుల్లో పనిచేసే వారు సూట్లు ధరించటం మానేయాలని చెప్పింది.

లేదంటే ఇప్పుడు తప్పనిసరి అయిన ఉద్దీపన ప్యాకేజీల సొమ్ములో కొంత భాగాన్ని హరిత పరిశ్రమల దిశగా ఆర్థిక వ్యవస్థ ప్రయాణాన్ని ప్రారంభించటానికి వెచ్చించగలదా?

బొగ్గు కన్నా పునర్వినియోగ ఇంధనాల వల్ల ఎక్కువ ఉద్యోగాల కల్పన జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. దేశంలో ఇప్పటికే సౌర, వాయు విద్యుత్ రంగాల్లో ఒక లక్ష కన్నా ఎక్కువ ఉద్యోగాల కల్పనే జరిగింది.

చమురు ధరలు నిలువునా పడిపోతుండటంతో వచ్చిపడిన ఆదాయాలను కాలుష్యకారక పరిశ్రమలు ఉద్గారాల నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేసుకునేందుకు సాయంగా ప్రభుత్వం అందించగలదా?

‘‘మహమ్మారి ప్రభావం నుంచి కోలుకోవటానికి, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడాటిని మనం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరముంది. వృద్ధి, ఉద్యోగాలు, సుస్థిర అభివృద్ధి మనకు అవసరం’’ అంటారు డాక్టర్ ఘోష్.

గాలిని శుభ్రం చేయటం కీలకమైన విషయం కావచ్చు. భారతదేశం, భారతీయులు తాము స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే హక్కును చాలా కాలంగా విస్మరించారు.

‘‘చైనా నాలుగున్నర సంవత్సరాల్లోనే తన వాయు కాలుష్యాన్ని 32 శాతం మేర తగ్గించగలిగితే.. 2027 నాటికి 80 నగరాల్లో గాలి కాలుష్యాన్ని 80 శాతం మేర తగ్గించాలని భారత్ ఎందుకు ప్రతిజ్ఞ చేయకూడదు?’’ అని డాక్టర్ ఘోష్ ప్రశ్నించారు.

అది కచ్చితంగా మంచి ప్రశ్న.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)