టీఆర్‌ఎస్‌ను వెంటాడతాం: బీజేపీ నాయకుడు మురళీధర్‌రావు - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, FB
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా, అభివృద్ధి పరంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని వెంటాడతామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారని ఆంధ్రజ్యోతి రాసింది.
ప్రతిపక్షం అంటే, పోరాటం అంటే ఏమిటో చూపిస్తామని ఆయన చెప్పారు. "టీఆర్‌ఎస్‌ను ఎక్కడా విడిచిపెట్టేది లేదు. వీధుల్లో ప్రజావేదికల్లో, న్యాయస్థానాల్లో, చట్టసభల్లో ఆ పార్టీపై పోరాటాలు చేస్తాం. ఇవాళ కర్ణాటకలో అధికారంలో ఉన్నాం. రేపు తెలంగాణలో అధికారంలోకి వస్తాం" అని కర్ణాటక రాష్ట్ర ఇన్‌చార్జి కూడా అయిన ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మంగళవారం హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేతగానితనానికి మునిసిపల్ ఎన్నికలే నిదర్శనమన్నారు. లోపభూయిష్ఠంగా రూపొందించిన మునిసిపల్ బిల్లుపై గవర్నర్‌కు బీజేపీ బృందం ఫిర్యాదు చేసిందని, అదృష్టవశాత్తు ఆయన మేలుకొని తిప్పిపంపారని వ్యాఖ్యానించారు.
కర్ణాటకలో 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అధికారంలోకి వచ్చిన మీరు, తెలంగాణాలో ఎంతమంది రాజీనామా చేస్తే అధికారంలోకి వస్తారు? అన్న మీడియా ప్రశ్నకు మురళీధర్ సమాధానమిస్తూ- "మీడియా మాకు డైరెక్షన్ ఇస్తోంది" అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ విషయం తెలిస్తే, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎవరెవరిని కలుస్తున్నారో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎప్పటికప్పుడు చూసుకుంటారని చెప్పారు.

ఫొటో సోర్స్, FB/tdp.ncbn.official
ఉన్నవాళ్లను తీసేసి కొత్తవాళ్లను తెచ్చుకోవడమే ఉద్యోగాల కల్పనా: చంద్రబాబు
'ఉద్యోగాలు చేస్తున్నవాళ్లను తీసేసి కొత్తవాళ్లను తెచ్చుకోవడం, దానికే ఉద్యోగాల కల్పన అని పేరు పెట్టుకోవడం ఏం పిచ్చిపనో నాకర్థం కావడం లేదు" అని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారని ఈనాడు తెలిపింది.
అలాంటప్పుడు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీలు ఎందుకిచ్చినట్టు అని మంగళవారం ట్విటర్‌లో ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
విశాఖపట్నం జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద ఆందోళ చేస్తున్న ఏఎన్‌ఎంలు, 104 సిబ్బందిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ ఒక టీవీ ఛానల్ ప్రసారం చేసిన కథనం వీడియోక్లిప్‌ను చంద్రబాబు తన ట్విటర్ ఖాతాలో ఉంచారు.
"మీ మాటలు నమ్మి, మిమ్మల్ని గెలిపించి ఇచ్చిన హామీలు నెరవేర్చమని ఈ రోజు అడిగితే.. మహిళలు అని కూడా చూడకుండా ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అడిగేవాళ్లు లేరనుకుంటున్నారా? ఒక్క ఉద్యోగం ఊడగొట్టకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, FB/KalvakuntlaChandrashekarRao
యాదాద్రిలో కేసీఆర్ మహా సుదర్శన యాగం
యాదాద్రిలో మహా సుదర్శన యాగం నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారని, ఈ అంశంపై మంగళవారం శంషాబాద్ సమీపంలో ముచ్చింతల్‌లోని త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమంలో ఆయనతో చర్చించారని ఈనాడు తెలిపింది.
యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇవి ముగింపు దశలో ఉన్న నేపథ్యంలో యాదాద్రిలో మహాసుదర్శన యాగం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.
1048 యజ్ఞ కుండాలతో మూడు వేల మంది రుత్విక్కులు, మరో మూడు వేల మంది సహాయకులతో మహాయాగం నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైష్ణవ పీఠాలు, బద్రీనాథ్, శ్రీరంగం, జగన్నాథ్, తిరుపతి నుంచి మఠాధిపతులను ఆహ్వానించాలని నిర్ణయించారు. అలాగే, కేంద్రం, రాష్ట్రాల పెద్దలు, గవర్నర్లను ఆహ్వానించాలని నిర్ణయించారు.

ఫొటో సోర్స్, Instagram/prithvishaw
డోపింగ్ టెస్టులో పృథ్వీ షా విఫలం; 8 నెలల నిషేధం
డోపింగ్ టెస్ట్‌లో విఫలమైనందుకు యువ క్రికెటర్, ఓపెనర్ పృథ్వీ షాపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎనిమిది నెలల నిషేధం విధించిందని నమస్తే తెలంగాణ తెలిపింది.
ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ సందర్భంగా ఫిబ్రవరి 22న ఇండోర్‌లో డోపింగ్ టెస్ట్ నిమిత్తం ఆటగాళ్ల నుంచి నమూనాలు సేకరించారు. పృథ్వీషా టెర్బుటాలిన్ అనే నిషేధిత ద్రవాన్ని తీసుకున్నట్టు ఆ పరీక్షల్లో తేలడంతో నిషేధం విధిస్తున్నట్టు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది.
"డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా పృథ్వీషాపై నిషేధం విధిస్తున్నాం. అతడు టెర్బుటాలిన్ అనే నిషేధిత పదార్థం సేవించాడు. సాధారణంగా దగ్గు తగ్గేందుకు తీసుకునే సిరప్‌లో ఇది ఉంటుంది" అని బీసీసీఐ ఓ ప్రకటనలో వివరించింది.
ఈ ఏడాది మార్చి 16న మొదలైన ఈ నిషేధ పరిమితి నవంబర్ 15తో ముగియనుంది. సొంతగడ్డపై జరిగే బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా సిరీస్‌లకు పృథ్వీ షా దూరం కానున్నాడు. గాయంతో బాధపడుతుండటంతో మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న వెస్టిండీస్ పర్యటనకు ఈ యువ ఆటగాడిని పరిగణించలేదు.
నిషేధం వార్త తెలుసుకున్న తర్వాత పృథ్వీ షా ట్విట్టర్ ద్వారా భావోద్వేగపూరిత లేఖ విడుదల చేశాడు. జలుబు, దగ్గు తగ్గాలని ప్రొటోకాల్ పాటించకుండా సిరప్ వేసుకోవడమే తప్పైందని అందులో పేర్కొన్నాడు. దీన్ని గుర్తుంచుకొని భవిష్యత్తులో ముందుకు సాగుతానని చెప్పాడు.
ఇవి కూడా చదవండి:
- కుక్క శరీరంపై కంటే మనిషి గడ్డంలోనే ఎక్కువ బ్యాక్టీరియా
- అమెరికా: జంతువుల ఎక్స్‌రేలు చూస్తారా..
- కోలివింగ్: ఉద్యోగ రీత్యా నగరాలు మారే యువత కొత్త చాయిస్
- 'మా తరం భవిష్యత్తును దోచుకున్నారు': పార్లమెంటులో పదహారేళ్ల బాలిక ప్రసంగం
- రష్యాలోని రెండున్నర కోట్ల ఏళ్ళ నాటి సరస్సును కాపాడాలని డికాప్రియోకు విజ్ఞప్తులు
- భారత్‌లో రెట్టింపైన పులులు... ఇంతకూ వీటిని ఎలా లెక్కిస్తారు
- 11 ఏళ్ల హరిప్రియ ఐక్యూ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కన్నా ఎక్కువ.. అసలు ఐక్యూను ఎలా కొలుస్తారు?
- కశ్మీర్ లోయలో అదనపు బలగాల మోహరింపు దేనికి సంకేతం
- కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








