Black Death: లక్షల మందిని బలితీసుకున్న భయానక రోగం ఎక్కడ పుట్టింది - ఎముకల గుట్టల్లోని దంతాలు చెప్పిన నిజం

ప్లేగు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మాలు కుర్సినో
    • హోదా, బీబీసీ న్యూస్

దాదాపు 600 ఏళ్ల కిందట ఐరోపా, ఆసియా, ఆఫ్రికాలలో లక్షల మందిని బలి తీసుకున్న ప్లేగు వ్యాధి మూలాలను కనిపెట్టినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

14వ శతాబ్దంలో భయానక విధ్వంసం సృష్టించిన ఈ ప్లేగు వ్యాధిని బ్లాక్ డెత్‌ అని కూడా పిలుస్తారు. మానవ చరిత్రలో భారీ విధ్వంసాలకు కారణమైన వ్యాధుల్లో ఇదీ ఒకటి.

ఏళ్లపాటు దృష్టి సారించినప్పటికీ అసలు ఈ వ్యాధి ఎక్కడ మొదలైందో శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు.

అయితే, తాజా పరిశోధనలో మధ్య ఆసియాలోని కిర్గిజిస్తాన్‌లో 1330ల్లో ఈ వ్యాధి మొదలైనట్లు వెలుగులోకి వచ్చింది.

జర్మనీకి చెందిన మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్, టూబింజెన్ యూనివర్సిటీ, స్టిర్లింగ్ యూనివర్సిటీ నిపుణులు సంయుక్తంగా ఈ పరిశోధన చేపట్టారు. కిర్గిజిస్తాన్‌లోని ఇసిక్ కుల్ సరస్సుకు సమీపంలోని ఎముకల గుట్టల్లోని దంతాల నుంచి సేకరించిన డీఎన్ఏ నమూనాలను వీరు విశ్లేషించారు.

1338 నుంచి 1339 మధ్య ఒక్కసారిగా భారీ స్థాయిలో మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు గుర్తించడంతో ఆ పరిసరాల్లో తవ్వకాలు చేపట్టారు.

ప్లేగు

ఫొటో సోర్స్, Getty Images

ఏడు అస్థిపంజరాల నుంచి సేకరించిన డీఎన్ఏలను తాము విశ్లేషించినట్లు టూబింజెన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ మారియా స్పరోయు అన్నారు.

‘‘దంతాలనే ఎందుకు ఎంచుకున్నామంటే.. వీటిలో చాలా రక్త నాళాలు ఉంటాయి. వీటిలో చాలా సమాచారం దాగి ఉంటుంది. రక్తంలో జీవించే సూక్ష్మజీవుల జాడలతో అసలు వీరు ఎలా చనిపోయారో గుర్తించొచ్చు’’అని ఆమె చెప్పారు.

మూడు అస్థిపంజరాల్లో ప్లేగు బ్యాక్టీరియా యెర్సినియా పెస్టిస్‌ను తాము గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు.

‘‘మానవ చరిత్రలో భయానక విధ్వంసానికి పాల్పడిన ఈ వ్యాధికి సంబంధించిన కీలక అంశాలు మా పరిశోధనలో వెల్లడయ్యాయి’’అని స్టిర్లింగ్ యూనివర్సిటీకి చెందిన చరిత్రకారుడు డాక్టర్ ఫిలిప్ స్లావిన్ చెప్పారు.

అయితే, ఈ పరిశోధనలో విశ్లేషించిన నమూనాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ ఈ పరిశోధనలో వెల్లడైన అంశాలు చాలా విలువైనవని న్యూజీలాండ్‌లోని ఒటాగో యూనివర్సిటీకి చెందిన డాక్టర్ మైఖేల్ నాప్ చెప్పారు. ‘‘అయితే, లోతైన అధ్యయనంతో ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది’’అని ఆయన అన్నారు.

ఈ పరిశోధన ఫలితాలు జర్నల్ నేచర్‌లో ‘‘ద సోర్స్ ఆఫ్ ద బ్లాక్ డెత్ ఇన్ ఫోర్టీన్త్ సెంచరీ సెంట్రల్ యురేసియా’’ పేరుతో ప్రచురితమయ్యాయి.

వీడియో క్యాప్షన్, భయపెడుతున్న బ్యుబోనిక్ ప్లేగు

ఏమిటీ బ్యుబోనిక్ ప్లేగు?

ఇది ఒక ప్రాణాంతక ఇన్ఫెక్షన్. యెర్సినియా పెస్టిస్‌గా పిలిచే బ్యాక్టీరియా వల్ల ఇది చుట్టుముడుతుంది. ముఖ్యంగా ఎలుకల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

దీనివల్ల చంకలు, కాళ్ల మధ్య ప్రాంతంలోని శోషరస గ్రంథులు (లింఫ్ నోడ్స్ లేదా బ్యుబోస్) వాచిపోతాయి. వీటి నుంచి విపరీతమైన నొప్పి వస్తుంటుంది.

2010 నుంచి 2015 మధ్య కూడా ప్రపంచ వ్యాప్తంగా 3,248 కేసులు నమోదయ్యాయి. వీటిలో 584 మంది మరణించారు.

ఈ వ్యాధి సోకినవారి చేతి, కాళ్ల వేళ్లు నల్లగా అయిపోతాయి. అందుకే దీన్ని బ్లాక్ డెత్ అని కూడా పిలుస్తుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)