ఎల్‌ సాల్వడార్: బిట్‌కాయిన్‌ను చట్టబద్ధం చేయడంపై నిరసనలు

షాపు యజమాని హెర్నాండెజ్

ఫొటో సోర్స్, Ed Hernandez

ఫొటో క్యాప్షన్, షాపు యజమాని హెర్నాండెజ్
    • రచయిత, కేటీ సిల్వర్
    • హోదా, బిజినెస్ రిపోర్టర్

క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌కు ఎల్ సాల్వడార్‌ ఇటీవల చట్టబద్ధత కల్పించింది. ఆర్థిక లావాదేవీల్లో దాన్ని వాడొచ్చని చట్టం తెచ్చింది.

అయితే, బిట్‌కాయిన్ వ్యతిరేక నిరసనలు, సాంకేతిక లోపాల నడుమ అమల్లోకి వచ్చిన మొదటి రోజే ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. చట్టం అమల్లోకి వచ్చిన తొలిరోజే బిట్‌కాయిన్ భారీగా పతనమైంది.

మంగళవారం బిట్‌‌కాయిన్ విలువ దాదాపు ఒక నెల కనిష్టాన్ని తాకింది. ఒకానొక సమయంలో బిట్‌కాయిన్ విలువ 52వేల డాలర్ల (దాదాపు38 లక్షల రూపాయలు) నుంచి 43వేల డాలర్ల (దాదాపు 31 లక్షల రూపాయలు)కు పడిపోయింది.

దీని వల్ల లాటిన్ అమెరికాలోని పేద దేశాల్లో ఒకటైన ఎల్ సాల్వడార్ మూడు మిలియన్ డాలర్లు నష్టపోయిందని ప్రతిపక్ష నాయకులు అన్నారు.

బిట్‌కాయిన్‌ను చట్టబద్ధం చేయడం ద్వారా సాధించాలనుకున్న లక్ష్యాలకు ఎల్‌ సాల్వడార్‌ అధ్యక్షుడు నయీబ్ బుకేలే చాలా దూరంలో ఉన్నారు.

యాపిల్, హువావే వంటివి ప్రభుత్వ-ఆధారిత డిజిటల్ వాలెట్‌ చివోను అనుమతించలేదు. ఇతర సమస్యలతో సర్వర్‌లను ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కానీ రోజు గడిచే కొద్దీ చివో మరిన్ని ప్లాట్‌ఫారమ్‌లలో కనిపించడం ప్రారంభమైంది. స్టార్‌బక్స్, మెక్‌డొనాల్డ్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు చివోని అనుమతించాయి.

బిట్ కాయిన్‌కు వ్యతిరేకంగా నిరసనలు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, బిట్ కాయిన్‌కు వ్యతిరేకంగా నిరసనలు

బిట్‌కాయిన్ స్వీకరించడానికి ప్రోత్సాహకాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఎల్‌ సాల్వడార్ ప్రజలకు ప్రతి బిట్‌కాయిన్‌కు 30 డాలర్ల (దాదాపు 2వేల 2వందల రూపాయలు)ను ప్రోత్సాహకంగా అందజేశారు.

విదేశాల నుంచి పంపిన డబ్బుపై లావాదేవీ ఫీజులకు అవుతున్న 400 మిలియన్ డాలర్ల (2వేల 900కోట్ల రూపాయలు) ఖర్చు బిట్‌కాయిన్‌తో ఆదా అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

అయితే ప్రపంచ బ్యాంక్, ప్రభుత్వ గణాంకాలను బట్టి ఇది 170 మిలియన్ డాలర్ల (1250 కోట్ల రూపాయలు)కు దగ్గరలో ఉంటుందని తేలింది.

ఎడ్ హెర్నాండెజ్ సాల్వడార్‌లో ఒక దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ నిత్యావసరమైన వస్తువులను ప్రజలు కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ నిర్ణయం ఆయనకు బాగా నచ్చింది. తన పని కూడా సాఫీగా సాగుతోందని ఆయన భావిస్తున్నారు.

''మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో నగదును ఉపయోగించకపోవడం చాలా మంచిది'' అని ఆయన బీబీసీకి చెప్పారు. నకిలీ నోట్లతో చెల్లింపులు చేసే కస్టమర్ల నుంచి కూడా ఈ నిర్ణయం తనను కాపాడుతుందని చెప్పారు.

ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నయీబ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నయీబ్

అయితే బిట్‌కాయిన్‌ని చట్టబద్ధం చేసి అమలు చేసిన తొలి రోజే, ఒకానొక సమయంలో దాని విలువ 20శాతం మేర పడిపోయింది.

''అధ్యక్షుడు నయీబ్ బుకేలే, ఆయన ప్రభుత్వం చేపట్టిన బిట్‌కాయిన్ ప్రయోగానికి ఇది చాలా చెడ్డ రోజు'' అని ప్రతిపక్ష నాయకులు జానీ రైట్ సోల్ బీబీసీకి చెప్పారు.

''ప్రజల్లో చాలా మందికి క్రిప్టోకరెన్సీల గురించి పెద్దగా అవగాహన లేదు. మనకు తెలిసిందల్లా ఇది స్థిరంగా లేని మార్కెట్ అని మాత్రమే. ఈ రోజు అది నిరూపితమైంది'' అని అన్నారు.

''బిట్‌కాయిన్ చట్టాన్ని పార్లమెంటులో ఎలాంటి చర్చా లేకుండా కేవలం ఐదు గంటల్లోనే ఆమోదించారు'' అని అన్నారు.

''మేము క్రిప్టోకరెన్సీ లేదా బిట్‌కాయిన్‌ను ద్వేషించే వాళ్లం కాదు. కానీ చెల్లింపుల్లో బిట్‌కాయిన్‌ను తప్పనిసరిగా అంగీకరించాలన్న నిర్ణయాన్ని సమర్ధించం'' అని నొక్కి చెప్పారు.

ప్రజల నిరసనలు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ప్రజల నిరసనలు

ఈ నిర్ణయాన్ని రైట్ సోల్ మాత్రమే తప్పుపట్టడం లేదు. వెయ్యి మందికి పైగా నిరసనకారులు దేశ అత్యున్నత న్యాయస్థానం వెలుపల తమ నిరసన వ్యక్తం చేశారు. టైర్లు తగలబెట్టారు.

బిట్‌కాయిన్ స్వీకరణతో అక్రమ లావాదేవీలు జరిగే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.

దుకాణదారుడు హెర్నాండెజ్ మాత్రం ఈ నిర్ణయానికి మద్దతు తెలిపారు.

''నేను దీనిని రిస్క్‌గా చూస్తాను. అవును. మన రోజువారి జీవితంలోని అన్నింటిలోనూ రిస్క్ ఉంది. మనకు ఒక దుకాణం ఉన్నప్పుడు, కొన్నిసార్లు కొనుగోలు చేసిన వస్తువులు, అమ్ముడు పోవు. ఇతరులు దీనిని సంక్షోభంగా చూస్తే, దీనిని నేను ఒక అవకాశంగా భావిస్తాను'' అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)