కోవిడ్: ఆక్సిజన్ కొరతతో ఒక్కరు కూడా చనిపోకుండా చూడండి.. కేంద్రానికి దిల్లీ హైకోర్టు ఆదేశాలు

భారత్‌లో ఆక్సిజన్ కొరత

ఫొటో సోర్స్, Getty Images

"ఆక్సిజన్ కొరత వల్ల దేశంలో కరోనా రోగులు ఎవరూ చనిపోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం" అని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

స్టీల్, పెట్రోలియం పరిశ్రమలకు ఆక్సిజన్‌ సరఫరా ఆపేసి, దానిని కోవిడ్-19 రోగులకు ఎందుకు సరఫరా చేయకూడదు అని కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది.

సీరియస్‌గా ఉన్న కోవిడ్-19 రోగులకు అందించడానికి తమ దగ్గర సరిపడినంత ఆక్సిజన్ లేదని, వెంటనే ఆక్సిజన్ ఏర్పాటు చేయాలంటూ మాక్స్ ఆస్పత్రి కోర్టులో పిటిషన్ వేసింది.

దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. పెట్రోల్, స్టీల్ పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరా ఆపివేసి దానిని కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది.

"టాటా తమ ఆక్సిజన్‌ను డైవర్ట్ చేయగలిగినప్పుడు, మిగతా వారు ఎందుకు చేయకూడదు. అలా చేయకపోవడం దురాశే అవుతుంది. అవసరమైతే స్టీల్, పెట్రోలియం పరిశ్రమలు ఆక్సిజన్‌ వాడకంపై నిషేధం విధించండి" అని కోర్టు చెప్పింది.

"చుట్టూ జరుగుతున్న నిజాలను ఈ ప్రభుత్వం ఎలా విస్మరిస్తుంది. మెడికల్ ఆక్సిజన్ ఎంత ముఖ్యమైన అవసరమో ప్రభుత్వానికి స్పృహ లేకపోవడం మమ్మల్ని దిగ్భ్రాంతికి, నిరాశకు గురిచేసింది" అని కోర్టు వ్యాఖ్యానించింది.

దిల్లీకి అందే ఆక్సిజన్ స్థాయిని 350 మెట్రిక్ టన్నుల నుంచి 480 మెట్రిక్ టన్నులకు పెంచుతామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హామీ ఇచ్చారు.

రోజంతా మాక్స్ ఆస్పత్రులకు అవసరమైన ఆక్సిజన్‌ను సరఫరా చేశామని ఆ తర్వాత కోర్టుకు సమాచారం ఇచ్చారు.

జస్టిస్ విపిన్ సంఘీ, రేఖా పాలీ ధర్మాసనం ఈ కేసును విచారించింది.

బుధవారం రాత్రి 8 గంటలకు బెంచ్ ఈ పిటిషన్‌పై ప్రత్యేక విచారణ జరిపింది.

కరోనా

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో కోవిడ్ కల్లోలం.. 24 గంటల్లో 3 లక్షలకు పైగా కొత్త కేసులు..

భారత్‌లో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.

గడిచిన 24 గంటల్లో 3 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.

మొత్తం దేశవ్యాప్తంగా 3,14,835 కొత్త కేసులు వచ్చాయని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

గత 24 గంటల్లో 2,104 మంది కరోనాతో చనిపోయారు.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 22,91,428 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మొత్తం 13,23,30,644 మందికి వ్యాక్సీన్ వేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

కోవిషీల్డ్ టీకా ధరలు నిర్ణయించిన సీరం ఇన్‌స్టిట్యూట్.. కొత్త ధరలు ఎంతంటే...

కోవిషీల్డ్ వాక్సీన్

ఫొటో సోర్స్, Reuters

వచ్చే రెండు నెలల్లో వ్యాక్సీన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుతామని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చెప్పింది.

తాము ఉత్పత్తి చేసే టీకాలలో 50శాతం కేంద్ర ప్రభుత్వానికి, మిగతా 50 శాతం రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆస్పత్రులకు అందిస్తామని పేర్కొంది.

కేంద్రం ఆదేశాల ప్రకారం టీకాకు ధరలు కూడా నిర్ణయించినట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ చెప్పింది.

దీనిపై సంస్థ ఒక ప్రకటన జారీ చేసింది.

అందులో సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసే కోవిషీల్డ్ టీకాను రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక డోసు ధర రూ.400 చొప్పున, ప్రైవేటు ఆస్పత్రులకు రూ.600 చొప్పున అందించనున్నట్టు తెలిపింది.

సీరం ఇన్‌స్టిట్యూట్ ధర పెంపు

ఫొటో సోర్స్, SII

ఫొటో క్యాప్షన్, సీరం ఇన్‌స్టిట్యూట్ ప్రకటన

మార్కెట్లో అందుబాటులో ఉన్న అంతర్జాతీయ కోవిడ్ టీకాలతో పోలిస్తే తమ టీకాను అందుబాటు ధరలోనే అందిస్తున్నామని సీరం చెప్పింది.

ప్రస్తుతం మార్కెట్లో అమెరికా టీకా ధర రూ.1500, రష్యా టీకా రూ.750, చైనా వ్యాక్సీన్ రూ.750 పైనే ఉందని సీరం ఇన్‌స్టిట్యూట్ తమ ప్రకటనలో పేర్కొంది.

ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్‌ను సీఐఐ కోవిషీల్డ్ పేరుతో భారత్‌లో తయారుచేస్తోంది.

సీరం ఇన్‌స్టిట్యూట్.. కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం ఒక టీకా డోసును రూ.150కే అందిస్తోంది. ఇక మీదట కూడా కేంద్రానికి వ్యాక్సీన్ అదే ధరకు ఇస్తుంది.

18 ఏళ్లు పైబడిన వారందరూ మే 1 నుంచి కోవిడ్-19 టీకా వేసుకోవడానికి కేంద్రం అనుమతించింది.

రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులు టీకా తయారీదారుల నుంచి నేరుగా వ్యాక్సీన్ కొనుగోలు చేయడానికి కూడా కేంద్రం ఆమోదించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)