మియన్మార్ సైనిక కుట్ర: ఆంగ్ సాన్ సూచీ అక్రమంగా లక్షల డాలర్లు, బంగారం తీసుకున్నారని ఆరోపణలు - Newsreel

అంగ్ సాన్ సూచీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అంగ్ సాన్ సూచీ
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

ఆంగ్ సాన్ సూచీ అక్రమంగా 6,00,000 డాలర్లతో పాటు బంగారాన్ని తీసుకున్నారని మియన్మార్ సైనిక పాలకులు ఆరోపించారు.

సూచీని పదవి నుంచి ఫిబ్రవరి 1న సైనిక కుట్రతో పడగొట్టిన తరువాత సైనిక పాలకులు ఆమె మీద చేసిన తీవ్రమైన ఆరోపణ ఇదే. అధ్యక్షుడు విన్ మియింట్, మరికొందరు మంత్రులు కూడా అవినీతికి పాల్పడ్డారని బ్రిగేడియర్ జనరల్ జా మిన్ టున్ ఆరోపించారు.

గత ఏడాది జరిగిన ఎన్నికల్లో సూచీ నాయకత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ (ఎన్ఎల్‌డీ) తిరుగులేని విజయం సాధించింది. అయితే, ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఇప్పుడు సైన్యం ఆరోపిస్తోంది. అంతర్జాతీయ స్వతంత్ర పరిశీలకులు మాత్రం సైనికుల మాటతో విభేదిస్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి రాలేదని వారన్నారు.

సూచీ గత అయిదు వారాలుగా గుర్తు తెలియని ప్రదేశంలో బందీగా ఉన్నారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడం, అక్రమంగా రేడియా సాధనాలను కలిగి ఉండడం, కోవిడ్-19 నియమాలను ఉల్లంఘించడం వంటి ఆరోపణలు ఆమె ఎదుర్కొంటున్నారు.

అయితే, ఆమె అక్రమంగా లక్షల డాలర్లు, బంగారం తీసుకున్నారనే ఆరోపణలు వీటన్నింటికన్నా తీవ్రమైనవి. ఆమె తీసుకున్న బంగారం విలువ 4.5 కోట్ల రూపాయల దాకా ఉంటుందని సైన్యం చెబుతోంది.

సైనిక కుట్రకు వ్యతిరేకంగా మియాన్మర్‌లో ప్రజా నిరసనలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గురువారం నాడు మరో ఆరుగురు ప్రదర్శనకారులు చనిపోయారు. దాంతో, మృతుల సంఖ్య 60 దాటింది. నిరసనకారులు కొందరిని నేరుగా తలలోకి షూట్ చేసి చంపారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పౌరులను హతమార్చడాన్ని ఐక్యరాజ్యసమితితో పాటు అమెరికా తదితర దేశాలు ఖండించాయి. సైన్యం మాత్రం ఆ విమర్శలు నిరాధారమని అంటోంది. హింసకు సూచీని నిందించాల్సిందిపోయి మమ్మల్ని తప్పుపడతారా అని ప్రశ్నిస్తోంది.

line

బ్రెజిల్‌లో మళ్లీ కరోనా కల్లోలం.. 2,000 దాటిన రోజు వారీ మృతుల సంఖ్య

బ్రెజిల్‌లో కరోనావైరస్ మరణాలు

ఫొటో సోర్స్, Reuters

బ్రెజిల్‌లో కోవిడ్-19 కారణంగా ప్రతి రోజూ చనిపోతున్న మృతుల సంఖ్య మొట్టమొదటి సారిగా 2,000 దాటింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

కరోనా మృతుల సంఖ్యలో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉంది బ్రెజిల్. ఇప్పటివరకూ ఈ దేశంలో 2,68,370 మంది చనిపోయారు. బుధవారం ఒక్క రోజే 2,286 మంది కన్నుమూశారు.

మరింత బలంగా వ్యాపించే కరోనావైరస్ రకాల వల్ల.. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకటం మరింతగా విషమించిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్నపుడు దేశాధ్యక్షుడు జేయిర్ బొల్సొనారో 'తెలితక్కువ' నిర్ణయాలు తీసుకున్నారని మాజీ అధ్యక్షుడు లూయీజ్ ఇనాసియో లులా డి సిల్వా బుధవారం ధ్వజమెత్తారు.

నెల రోజుల కాలంలో బుధవారం తొలిసారి ఫేస్ మాస్క్ ధరించి కనిపించిన బొల్సొనారో.. ఈ వైరస్ వల్ల వాటిల్లే ముప్పును తేలికగా కొట్టివేయటానికి నిరంతరం ప్రయత్నిస్తూ వచ్చారు. ఈ విషయంలో 'నసగటం మానండ'ని ఆయన ఈ వారం ఆరంభంలో ప్రజలకు సూచించారు.

బ్రెజిల్‌లో కరోనావైరస్ మరణాలు

కోవిడ్ కేసులు విపరీతంగా పెరగటంతో బ్రెజిల్‌లోని పెద్ద నగరాల్లో ఆరోగ్య వ్యవస్థలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. చాలా ఆస్పత్రులు కుప్పకూలే పరిస్థితికి చేరుకున్నాయని దేశంలో ప్రధాన ప్రజారోగ్య కేంద్రం ఫియోక్రజ్ హెచ్చరించింది.

బుధవారం నాడు దేశ వ్యాప్తంగా మొత్తం 79,876 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచీ బ్రెజిల్‌లో ఒక రోజులో నమోదైన అత్యధిక కేసుల సంఖ్యలో ఇది మూడో స్థానంలో నిలిచింది.

పీ1 అని పేరు పెట్టిన కొత్త కరోనావైరస్ రకం వ్యాప్తి వల్ల దేశంలో కేసుల సంఖ్య మళ్లీ విపరీతంగా పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. ఈ కరోనావైరస్ రకం.. మానాస్ అనే అమెజాన్ నగరంలో పుట్టినట్లు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)