‘బైడెన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా హింసాత్మక నిరసనలు జరగొచ్చు.. జాగ్రత్తగా ఉండండి’ - 50 రాష్ట్రాలకు ఎఫ్‌బీఐ హెచ్చరిక

యూఎస్ కేపిటల్ భవనం వద్ద భద్రత

ఫొటో సోర్స్, Reuters

యూఎస్ క్యాపిటల్ భవనాన్ని భద్రతా కారణాలతో లాక్‌డౌన్ చేశారు. అక్కడికి సమీపంలో మంటలు కనిపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడానికి రెండు రోజుల ముందు ఈ భవనాన్ని లాక్‌డౌన్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

యూఎస్ కాంగ్రెస్‌కు కేంద్రమైన క్యాపిటల్ భవనంపై ఈ ఏడాది జనవరి 6న ట్రంప్ అనుకూల మూకలు దాడి చేశాయి. ఈ దాడుల్లో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం కేపిటల్ భవనం వద్ద జాతీయ భద్రతాదళ సభ్యులను పెద్ద ఎత్తున మోహరించడంతో కట్టుదిట్టమైన భద్రత కనిపిస్తోంది.

అయితే, కేపిటల్ భవనం వద్ద పొగ కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు కొందరు చెప్పారు.

తాము వెంటనే స్పందించామని.. ప్రస్తుతం అక్కడ మంటలు ఆరిపోయాయని వాషింగ్టన్ డీసీ ఫైర్ సర్వీస్ అధికారులు వెల్లడించారు.

భవనాన్ని మూసివేశారని.. లోపలున్నవారు బయటకు, బయటివారు లోపలికి వచ్చేందుకు ఎవరికీ అనుమతి లేదంటూ సర్క్యులర్ ఒకటి అక్కడి సిబ్బందికి జారీ చేశారు.

బుధవారం బైడెన్ బాధ్యతల స్వీకరణ సందర్భంగా హింసాత్మక నిరసనలు చోటుచేసుకునే అవకాశాలున్నాయంటూ 50 రాష్ట్రాలు, కొలంబియా డిస్ట్రిక్ట్‌‌ను ఇప్పటికే అప్రమత్తం చేశారు.

రాష్ట్రాల రాజధానుల్లో ట్రంప్ మద్దతుదారులు సాయుధ కవాతు నిర్వహించే అవకాశాలున్నాయంటూ ఎఫ్‌బీఐ అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది.

కరోనా కారణంగా చనిపోయిన 4 లక్షల మంది అమెరికన్ల స్మృత్యర్థం ఏర్పాటు చేసిన జాతీయ జెండాలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కరోనా కారణంగా చనిపోయిన 4 లక్షల మంది అమెరికన్ల స్మృత్యర్థం ఏర్పాటు చేసిన జాతీయ జెండాలు

బైడెన్ ప్రమాణ స్వీకార సన్నద్ధ కార్యక్రమాలకు అంతరాయం

ఈ మంటల వల్ల జో బైడెన్ ప్రమాణ స్వీకార సన్నద్ధ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. ఈ పనులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

ఇటీవల అమెరికా క్యాపిటల్ భవనంపై నిరసనకారుల దాడి అనంతరం భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.

క్యాపిటల్ భవనం చుట్టూ ఉండే ''ద నేషనల్ మాల్''ను తాత్కాలికంగా మూసివేశారు. వైట్‌హౌస్ చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటుచేశారు.

అయితే సోమవారం నిర్వహించాల్సి ఉన్న బైడెన్ ప్రమాణ స్వీకార రిహాసల్స్ కార్యక్రమాలు భద్రతా కారణాల దృష్ట్యా ఇదివరకు కూడా ఒకసారి వాయిదా పడ్డాయి.

బైడెన్ ప్రమాణ స్వీకార సమయంలో ట్రంప్ మద్దతుదారులు దాడులుచేసే అవకాశం ఉండటంతో అమెరికాలోని 50 రాష్ట్రాలు చాలా అప్రమత్తంగా ఉన్నాయి. రాష్ట్రాల క్యాపిటల్ భవనాల వైపుగా ట్రంప్ మద్దతుదారులు ర్యాలీలు చేసే అవకాశముందని ఎఫ్‌బీఐ హెచ్చరికలు కూడా జారీచేసింది.

బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ట్రంప్ విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తారు. పారిస్ వాతావరణ ఒప్పందంలోనూ చేరతారు.

జనవరి 20న ఏం జరుగుతుంది?

జనవరి 20న క్యాపిటల్ బిల్డింగ్ ఎదుట అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ బాధ్యతలు తీసుకుంటారు.

సాధారణంగా అయితే, అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి లక్షల మంది హాజరు అవుతారు. ప్రస్తుతం కరోనావైరస్ వ్యాప్తి ఆందోళనలు, భద్రతా ప్రమాణాల దృష్ట్యా సందర్శకులను చాలా తక్కువగా అనుమతించబోతున్నారు.

బాధ్యతలు తీసుకున్న వెంటనే జాతిని ఉద్దేశించి బైడెన్ ప్రసంగిస్తారు. తన పదవీ కాలంలో తీసుకోబోయే కార్యక్రమాల అజెండాను రూపొందిస్తారు.

బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో లేడీ గాగా జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. జెన్నిఫర్ లోపేజ్ ప్రత్యేక ప్రదర్శన కూడా ఇస్తారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరుకాబోనని ట్రంప్ ఇప్పటికే స్పష్టంచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)