IND vs AUS రెండో టెస్ట్: భారత్ 36/1.. ఆస్ట్రేలియా 195 ఆలౌట్: BBC Newsreel

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్

ఫొటో సోర్స్, Getty Images

మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య బాక్సింగ్ డే టెస్ట్ శనివారం ప్రారంభమైంది.

తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 195 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

భారత జట్టు తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించి తొలిరోజు ఆట ముగిసే సమయానికి 11 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 36 పరుగులు చేసింది.

ఒక్క పరుగు కూడా చేయకుండానే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డకౌట్ అయ్యాడు.

మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 38 బంతుల్లో ఐదు ఫోర్ల సహాయంతో 28 పరుగులు చేయగా, పుజారా 7 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

అంతకు ముందు.. ఆస్ట్రేలియా జట్టులో లబుషేన్ అత్యధికంగా 48 పరుగులు చేయగా, ట్రావిస్ హెడ్ 38 పరుగులు, మాథ్యూ వేడ్ 30 పరుగులు చేశారు.

భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు, మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు, జడేజా ఒక వికెట్ తీశారు.

రజినీకాంత్

ఫొటో సోర్స్, Facebook/sunpictures

రజినీకాంత్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన అపోలో ఆస్పత్రి

నటుడు రజినీకాంత్ రక్తపోటు ఇంకా ఎక్కువగానే ఉందని, అయితే.. నిన్నటికంటే మెరుగ్గా ఉందని అపోలో ఆస్పత్రి వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

ఆయనకు కొన్ని పరీక్షలు నిర్వహించామని, ఆ పరీక్షల్లో ఎలాంటి ఆందోళనకరమైన అంశాలూ వెల్లడి కాలేదని తెలిపింది. కాగా, ఈ రోజు మరికొన్ని పరీక్షలు చేస్తున్నామని, ఆ రిపోర్టులు సాయంత్రానికి వస్తాయని వెల్లడించింది.

రక్తపోటు హెచ్చుతగ్గుల నేపథ్యంలో పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని రజినీకాంత్‌కు వైద్యులు సూచించారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సందర్శకులు ఎవరినీ అనుమతించడం లేదని అపోలో ఆస్పత్రి పేర్కొంది.

అమెరికాలో పేలుడు

ఫొటో సోర్స్, Reuters

క్రిస్మస్ ఉదయం అమెరికాలో పేలుడు.. ఉద్దేశపూర్వకంగా చేసిందే అంటున్న పోలీసులు

అమెరికా టెనెసీ ప్రాంతంలోని నాష్‌విల్ నగరంలో క్రిస్మస్ రోజు ఉదయం ఒక పేలుడు జరిగింది.

ఈ పేలుడు ఉద్దేశపూర్వకంగా చేశారని, ఒక వాహనానికి దీనితో సంబంధం ఉందని పోలీసులు చెబుతున్నారు.

ఈ పేలుడు స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఆరు గంటలకు జరిగింది. ఆ తర్వాత సిటీ సెంటర్ పైన పొగలు కమ్ముకోవడం కనిపించింది.

అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డ ముగ్గురిని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కానీ వారిలో ఎవరూ తీవ్రంగా గాయపడలేదని తెలుస్తోంది.

పేలుడులో గాయపడ్డవారిలో ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నారు.

అనుమానిత వాహనానికి సంబంధించి పోలీసులు ఒక ఫొటో విడుదల చేశారు. అందులో శుక్రవారం ఉదయం అది ఘటనాస్థలానికి రావడం కనిపిస్తోంది.

అమెరికాలో పేలుడు

ఫొటో సోర్స్, Reuters

ఉద్దేశపూర్వకంగానే పేలుడు జరిపారు

"ప్రస్తుతానికి, ఉద్దేశపూర్వకంగానే ఈ పేలుడు జరిపారని మాత్రమే మేం చెప్పగలం" అని పోలీసులు మీడియాకు చెప్పారు.

దర్యాప్తు అధికారులు, ఎఫ్‌బీఐ ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే ఈ పేలుడుకు అసలు కారణం ఏంటనేది ఇప్పటివరకూ తెలీలేదు.

"ఉదయం ఆరు గంటలకు కాల్పులు జరిగిన శబ్దం వినిపించిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. బాంబ్ స్క్వాడ్‌తో అక్కడికి చేరుకున్నప్పుడు, మాకు ఒక అనుమానిత వాహనం కనిపించింది. కాసేపటి తర్వాత అదే వాహనంలో పేలుడు జరిగింది" అని హడావుడిగా జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్సులో పోలీసు ప్రతినిధి చెప్పారు.

ఈ పేలుడు సమయంలో వాహనంలో ఎవరైనా ఉన్నారా అనేది ఇంకా తెలీలేదని పోలీసులు చెప్పారు.

ఘటనాస్థలంలో పోలీసులు హెచ్చరించడం, తర్వాత కాసేపటికి వాహనం పేలినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)