బహ్రెయిన్‌లో గణేశ్ విగ్రహాల ధ్వంసం... మహిళ మీద సర్కారు చర్యలు

బహ్రెయిన్ గణేశ్

ఫొటో సోర్స్, Getty Images

బహ్రెయిన్‌లో ఒక దుకాణంలో హిందూ విగ్రహాలను ధ్వంసం చేసిన మహిళ మీద చట్టపరంగా చర్యలు చేపడతామని ఆ దేశ పోలీసులు చెప్పారు.

జుఫెయిర్ ప్రాంతంలో రికార్డు చేసిన ఒక వీడియో.. ఓ మహిళ ఒక దుకాణంలోకి చొరబడి వినాయకుడి విగ్రహాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలను చూపిస్తోంది.

ఆ వీడియోలోని 54 ఏళ్ల మహిళ.. బహ్రెయిన్ ముస్లింల దేశమని వ్యాఖ్యానించింది.

సదరు మహిళ మీద చర్యలు చేపట్టామని.. ఆమెను కోర్టు విచారణకు పంపించామని పోలీసులు ట్విటర్‌లో విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

జఫెయిర్‌లో దుకాణంలోకి చొరబడటం, ఒక వర్గం వారిని అవమానించటం అభియోగాలు నమోదు చేసినట్లు చెప్పారు.

ఇది విద్వేష పూరిత చర్య అని బహ్రెయిన్ ఉన్నతాధికారి ఒకరు విమర్శించారు.

మత చిహ్నాలను ధ్వంసం చేయటం బహ్రెయిన్ ప్రజల స్వభావం కాదని రాజ కుటుంబ సలహాదారు ఖాలిద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా ట్వీట్ చేశారు.

''మనం తిరస్కరించిన విద్వేషానికి ప్రతీకగా నిలిచే నేరమిది'' అని ఆయన అభివర్ణించారు.

ఇది బయటి వారి నేరమని పేర్కొన్నారు. బహ్రెయిన్‌లో దాదాపు 17 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. వారిలో సగం కన్నా ఎక్కువ మంది విదేశాల నుంచి వచ్చిన వారు. దీనికి సంబంధించి బహ్రెయిన్ హోం మంత్రిత్వశాఖ కూడా ట్వీట్ చేసింది.

''పోలీసులు సదరు మహిళ మీద చట్టపరమైన చర్య చేపట్టారు. ఒక దుకాణాన్ని ధ్వంసం చేయటం, ఒక వర్గం వారి మనోభావాలను గాయపరచటం అభియోగాలను ఆమె మీద నమోదు చేశారు. ఆ మహిళను విచారణకు పంపించారు'' అని పేర్కొంది.

ఈ సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో చాలా మంది విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలను సమర్థించరాదని మాజీ విదేశాంగ మంత్రి, బహ్రెయిన్ రాజు సలహాదారు షేక్ ఖలీద్ అల్ ఖలీఫా ఖండించారు.

బహ్రెయిన్‌లో లక్షలాది మంది వలస కార్మికులు నివసిస్తున్నారు. వారిలో అత్యధికులు ఆసియా సంతతి వారే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)