అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: ‘చైనా వస్తువులపై సుంకాలు పెంచుతాం’.. ‘పెంచితే ప్రతిచర్యలతో తిప్పికొడతాం’

ఫొటో సోర్స్, Reuters
అమెరికా - చైనాల మధ్య వాణిజ్య యుద్ధానికి సంబంధించిన చర్చలు మొదలయ్యే ముందు ఇరు దేశాల మధ్య అపనమ్మకాలు పెరిగిపోయాయి.
వాణిజ్య చర్చల్లో ''ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించింద''ని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
చైనా ఉత్పత్తుల మీద సుంకాలను అమెరికా పెంచినట్లయితే ''అవసరమైన ప్రతిచర్యల''తో తిప్పికొడతామని చైనా వ్యాఖ్యానించిన అనంతరం ట్రంప్ పై వ్యాఖ్యలు చేశారు.
దాదాపు 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తుల మీద సుంకాలను శుక్రవారం రెట్టింపుకన్నా ఎక్కువ పెంచుతామని ట్రంప్ స్పష్టంచేశారు.
అయినప్పటికీ ఇరుపక్షాలూ అమెరికాలో గురువారం నాడు వాణిజ్య చర్చలు జరపాల్సి ఉంది.
ఈ చర్చలు ప్రారంభం కావటానికి ముందు.. వాణిజ్యం మీద చైనాతో తాము చర్చిస్తున్న ఒప్పందాన్ని ఆ దేశ నాయకులు ఉల్లంఘించారని ట్రంప్ ఆరోపించారు.
''వాళ్లు ఒప్పందాన్ని ఉల్లంఘించారు... అలా చేయజాలరు. కాబట్టి వాళ్లు మూల్యం చెల్లిస్తారు'' అని ఆయన ఫ్లోరిడాలో తన ప్రచార సభలో తన మద్దతుదారులతో పేర్కొన్నారు.
ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరకపోతే.. ''సంవత్సరానికి 100 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ తీసుకోవటంలో ఏమాత్రం తప్పు లేదు'' అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
కొంత కాలంగా సాగుతున్న వాణిజ్య యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఇరు దేశాలూ ఒక ఒప్పందం చేసుకోవటానికి చేరువవుతున్నట్లుగా ఇటీవల కనిపించింది.
కానీ.. 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తుల మీద ఈ వారంలో సుంకాలను పెంచుతామని, కొత్త సుంకాలను విధించే అవకాశం కూడా ఉందని ట్రంప్ గత ఆదివారం నాడు ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
వాణిజ్య చర్చల్లో ఇచ్చిన హామీలపై చైనా మడమతిప్పిందని అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైతీజర్ ఆ తర్వాత ఆరోపించారు. అయితే చైనాతో ఒప్పందం కుదర్చుకునేందుకు ఇంకా అవకాశం ఉందని ఉద్ఘాటించారు.
విదేశీ ఉత్పత్తులపై దిగుమతిదారులు చెల్లించే పన్నులనే సుంకాలు (టారిఫ్)గా వ్యవహరిస్తారు. చైనా ఉత్పత్తుల మీద అమెరికా విధించే 25 శాతం సుంకాలను అమెరికా కంపెనీలు చెల్లిస్తాయి.
వాణిజ్య యుద్ధం ముదరటంతో అది ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మార్కెట్లను కుదిపేస్తోంది.
హాంగ్ సెంగ్ ఇండెక్స్ 1.2 శాతం పడిపోయింది. షాంఘై కంపోజిట్ గురువారం ఆరంభ ట్రేడింగ్‌లో 0.8 శాతం కోల్పోయింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
శుక్రవారం ఏం జరుగుతుంది?
చైనా తయారీ ఎలక్ట్రికల్ పరికరాలు, మెషీన్లు, కార్ల విడిభాగాలు, ఫర్నిచర్ తదితర చాలా రకాల వస్తువుల మీద సుంకాలు శుక్రవారం నుంచి 25 శాతం పెరుగుతాయంటూ రాబర్ట్ లైతీజర్ బుధవారం ఒక అధికారిక నోటీస్ విడుదల చేశారు.
మొత్తం 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా సరుకుల మీద 10 శాతంగా ఉన్న సుంకాలు ఈ ఏడాది ఆరంభంలోనే 25 శాతానికి పెరగాల్సి ఉంది. అయితే ఇరు దేశాల మధ్య చర్చలు ముందుకు సాగటంతో ఆ పెంపును అమెరికా వాయిదా వేసింది.
సుంకాల పెంపు నిర్ణయాన్ని అమెరికా అమలు చేస్తే తాము అదే విధంగా తిప్పికొడతామని చైనా పేర్కొంది.
''వాణిజ్య ఘర్షణ ముదరటం ఇరు దేశాల ప్రజలు, ప్రపంచ ప్రజల ప్రయోజనాలకు మంచిది కాదు'' అని చైనా వాణిజ్య మంత్రి ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.
''ఒకవేళ అమెరికా సుంకాల పెంపు అమలు చేసినట్లయితే.. చైనా వైపు నుంచి అందుకు అవసరమైన ప్రతి చర్యలు చేపట్టాల్సి ఉంటుందని చైనా తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది'' అని చెప్పారు.
మరోవైపు.. మరో 325 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తుల మీద కూడా అమెరికా 25 శాతం సుంకాలను ''త్వరలో'' విధించవచ్చునని ట్రంప్ పేర్కొన్నారు.
ఇరు దేశాలూ ఇప్పటికే ఎదుటి దేశానికి చెందిన వేల కోట్ల డాలర్ల విలువైన వస్తువుల మీద సుంకాలను విధించాయి. అది వాణిజ్యరంగంలో అనిశ్చితిని సృష్టించటంతో పాటు ప్రపంచ ఆర్థికవ్యవస్థ మీద కూడా భారం మోపుతోంది.
అమెరికా - చైనా వాణిజ్య ఉద్రిక్తతలు ముదురుతుండటం.. గత ఏడాది చివర్లో ప్రపంచ విస్తరణ గణనీయంగా బలహీనపడటానికి ఒక కారణమని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. 2019 ప్రపంచ వృద్ధి అంచనా గణాంకాలను ఐఎంఎఫ్ తగ్గించింది.
- భారత్ సుంకాలపై ట్రంప్ కఠిన నిర్ణయం.. ఫ్రీ ఆఫర్ బంద్
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం: ‘సుంకాలు తగ్గించేందుకు చైనా అంగీకరించింది’
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతో మరింత పేదరికంలోకి ప్రపంచం: ఐఎంఎఫ్
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదును చొప్పిస్తున్న చైనా
- వాణిజ్య యుద్ధాలు మంచివేనన్న డొనాల్డ్ ట్రంప్.. మండిపడుతున్న చైనా, ఇతర దేశాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









