'తిరుగుబాటు' యత్నాన్ని తిప్పికొట్టామని ప్రకటించిన వెనెజ్వేలా అధ్యక్షుడు మడూరో

ఫొటో సోర్స్, AFP
ప్రతిపక్ష నాయకుడు జువాన్ గ్వాయిడో చేసిన మిలిటరీ తిరుగుబాటు కుట్రను తిప్పికొట్టామని వెనెజ్వేలా అధ్యక్షుడు నికోలస్ మడూరో ప్రకటించారు.
దేశ ప్రజలనుద్దేశించి మడూరో టీవీలో మాట్లాడుతూ... తనపై సైనిక తిరుగుబాటు చేయడంలో గ్వాయిడో విఫలమయ్యారని వ్యాఖ్యానించారు.
సాయుధ బలగాలపై మడూరో పట్టు కోల్పోయారని, దాంతో అధికార బదిలీ శాంతియుతంగా సాగుతుందని గ్వాయిడో అన్నారు.
మంగళవారం సాయుధ బలగాలకు, ప్రతిపక్ష నేత మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణలో 100 మందికి పైగా గాయపడ్డారు. బుధవారం కూడా వీధుల్లోకి రావాలని గ్వాయిడో తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.
ఆందోళనకారుల చర్యలు "తీవ్రమైన నేరాలు" అని, వారికి శిక్షలు తప్పవని మడూరో వ్యాఖ్యానించారు. తనకు వ్యతిరేకంగా అమెరికా కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.
తాను వెనుజ్వేలాను వదిలి క్యూబాకు పారిపోయేందుకు సిద్ధమయ్యానంటూ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపెయో చేసిన వ్యాఖ్యలను మడరూ ఖండించారు.
మంగళవారం ఏం జరిగింది?
అంతకుముందు అధ్యక్షుడు మడూరో 'పదవి నుంచి వైదొలగాల్సిందే' నని ఆయన ప్రభుత్వంలోని ముగ్గురు అత్యున్నత స్థాయి సభ్యులు తొలుత అంగీకరించారని మంగళవారం అమెరికా తెలిపింది.
మడూరోను గద్దె దించేందుకు సైన్యం తమకు సహకరించాలంటూ ప్రతిపక్ష నాయకుడు జువాన్ గ్వాయిడో కోరారు. ప్రతిపక్ష నాయకుడికి మద్దతుగా అనేకమంది దేశ రాజధాని కారకస్ నగర వీధుల్లో పెద్దఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు.
చుట్టూ సైనిక దుస్తుల్లో ఉన్నవారి మధ్య గ్వాయిడో నిలబడి మాట్లాడుతున్న ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మడూరో పాలనకు ముగింపు పలకడంలో 'తుది దశ'కు చేరుకున్నామని అన్నారు. అందుకు ధైర్యవంతులైన సైనికులు తమవెంట ఉన్నారని గ్వాయిడో ఆ వీడియోలో చెప్పారు.
"'దేశ సాయుధ బలగాలు సరైన నిర్ణయం తీసుకున్నాయి. వాళ్లు తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది" అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, మిలిటరీ పూర్తిగా గ్వాయిడో వెంటే ఉన్నట్లుగా కనిపించలేదు.
అయితే, మిలిటరీ అధిపతి మాత్రం విపక్ష నాయకుడి విన్నపాన్ని తోసిపుచ్చారు. తిరుగుబాటు కుట్రకు గ్వాయిడో ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
వెనెజ్వేలా అధ్యక్షుడు మడూరో దేశాన్ని వదిలి, క్యూబాకు పారిపోయేందుకు సిద్ధమయ్యారు కానీ, రష్యా ఆయన్ను ఆపిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపెయో ఆరోపించారు. అయితే, అందుకు సంబంధించి ఆయన ఎలాంటి ఆధారాలనూ బయటపెట్టలేదు.
"విమానం సిద్ధంగా ఉంది. మంగళవారం ఉదయం దేశాన్ని విడిచి వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారని మాకు తెలిసింది. కానీ, దేశం వదిలి వెళ్లొదంటూ రష్యా ఆయనకు సూచించింది" అని సీఎన్‌ఎన్ టీవీతో పాంపెయో చెప్పారు.
ఆ తర్వాత మంగళవారం సాయంత్రం అధ్యక్షుడు మడూరో టీవీలో ప్రసంగించారు. మిలిటరీ కమాండర్లతో కలిసి కూర్చుని, అమెరికా సామ్రాజ్యవాదం అండతో జరుగుతున్న కుట్రలను తాము ధీటుగా తిప్పికొడతామని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ కీలక వ్యక్తులు ఎవరు?
వెనెజ్వేలా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాడ్రినో గత మూడు నెలలుగా ప్రతిపక్ష పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ అన్నారు.
అయితే, మంగళవారం సైనికుల మధ్య కూర్చుని అధ్యక్షుడు మడూరో టీవీలో మాట్లాడారు. దాని ద్వారా, సైన్యం తనవెంటే ఉందన్న సందేశాన్ని ఇచ్చారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మైకేల్ మొరెనో, అధ్యక్షుడి భద్రత చూసే కమాండర్ ఇవాన్ రాఫెల్ హెర్మాండేజ్ డాలా కూడా విపక్షానికి అనుకూలంగా ఉన్నారంటూ బోల్టన్ చెప్పారు.
"మడూరో నుంచి గ్వాయిడోకు అధికార బదిలీ శాంతియుతంగా జరగాలని ఆ ముగ్గురు ఉన్నతస్థాయి సభ్యులు కోరుకుంటున్నారు. మడూరో పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని వారు అంగీకరించారు. వెనెజ్వేలాకు గ్వాయిడోనే సరైన నాయకుడని అమెరికా, యూకేలతో పాటు అనేక దేశాలు భావిస్తున్నాయి" అని బోల్టన్ వాషింగ్టన్‌లో అన్నారు.
అయితే, మడూరోను ఏకాకిని చేసేందుకు ఆయన విశ్వాసపాత్రులు సిద్ధమవుతున్నారని చెప్పేందుకు బోల్టన్ ఎలాంటి ఆధారాలనూ బయటపెట్టలేదు. బోల్టన్ చెప్పిన విషయాన్నే వెనెజ్వేలాలోని అమెరికా రాయబారి ఎల్లియట్ అబ్రామ్స్ కూడా నొక్కి చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
వెనెజ్వేలాలో ఏం జరుగుతోంది?
ఈ ఏడాది జనవరి నుంచి అధ్యక్షుడు మడూరో, ప్రతిపక్ష నేత గ్వాయిడోల మధ్య అధికార పోరు నడుస్తోంది.
దేశ అధ్యక్షుడిని తానేనంటూ గ్వాయిడో జనవరి 23న ప్రకటించుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా గ్వాయిడోను వెనెజ్వేలా అధ్యక్షుడిగా గుర్తించారు. ఆ తరువాత 20కి పైగా దేశాలు గ్వాయిడోకు మద్దతు ప్రకటించాయి.
రష్యా, చైనా, మెక్సికో, టర్కీ వంటి ఇతర శక్తిమంతమైన దేశాలు బాహాటంగా మడూరోను సమర్థిస్తున్నట్లు ప్రకటించాయి.

ఫొటో సోర్స్, Getty Images
69 మందికి గాయాలు
ఇప్పటివరకు వెనెజ్వేలా రాజకీయ సంక్షోభంలో తాజా పరిణామాలు అత్యంత తీవ్రమైనవని కారకస్‌లోని బీబీసీ ప్రతినిధి గ్విల్లెర్మో ఓల్మో అభిప్రాయపడ్డారు. హింసాత్మక ఘటనలు కూడా జరుగుతున్నాయి. కొన్నిచోట్ల గ్వాయిడో మద్దతుదారులకు, సాయుధ బలగాలకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
నిరసనకారులు రాళ్లు రువ్వగా, టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో భద్రతా బలగాలు వారిని చెదరగొట్టాయి.
దేశవ్యాప్తంగా 69 మంది గాయపడ్డారని ఆరోగ్య శాఖ తెలిపింది.
గ్వాయిడో తిరుగుబాటు కుట్రకు పాల్పడుతున్నారని మడూరో ప్రభుత్వం ఆరోపించింది. అమెరికా ప్రభుత్వ ఉన్నతాధికారులు మాత్రం గ్వాయిడోకు తమ మద్దతు కొనసాగుతుందని పునరుద్ఘాటించారు.
మరోవైపు, మడూరో ప్రభుత్వానికి క్యూబా మిలిటరీ మద్దతు ఉపసంహరించుకోకపోతే, క్యూబాపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
వెనెజ్వేలాలో నెలకొన్న తాజా పరిస్థితులపై పలు దేశాలు స్పందించాయి.
- శాంతిని నెలకొల్పేందుకు ఇరువర్గాలు సంయనం పాటించాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ విజ్ఞప్తి చేశారు.
- రక్తపాతాన్ని ఆపాలని స్పెయిన్ కోరింది. మిలిటరీ తిరుగుబాటుకు తాము మద్దతివ్వబోమని చెప్పింది.
- వెనెజ్వేలా ప్రతిపక్ష నాయకుడు గ్వాయిడోను వెనకేసుకొస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో తమ దేశ రక్షణ, విదేశాంగ మంత్రులు, ఉపాధ్యక్షుడితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
- గ్వాయిడోకు మద్దతుగా నిలవాలంటూ వెనెజ్వేలా ఆర్మీకి కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డూక్యూ పిలుపునిచ్చారు.
- మడూరోకు అండగా ఉంటామంటూ బొలీవియా అధ్యక్షుడు ఎవో మోరలెస్, క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో సంయుక్త సందేశం ఇచ్చారు. వెనెజ్వేలాలో తిరుగుబాటుకు కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- వెనెజ్వేలా : కేజీ బియ్యం కొనాలంటే ఎన్ని కట్టల డబ్బు కావాలో తెలుసా?
- BBC FACT CHECK: అడ్వాణీని అమిత్ షా అవమానించారా?
- తల్లితండ్రుల వలసలు... దాడులకు బలవుతున్న పిల్లలు
- కిమ్ జోంగ్ ఉన్: ప్రపంచ రాజకీయాల్లో ఈ పేరంటే ఎందుకంత సంచలనం?
- తొమ్మిది మంది హత్యకు ఇద్దరు బాలికల కుట్ర
- అబూదాబిలో 13.5 ఎకరాల్లో హిందూ మందిర నిర్మాణం... విశేషాలివే
- శ్రీలంక పేలుళ్లు: బురఖా ధరించిన ఈ వ్యక్తి బౌద్ధ మతస్థుడా? ఈ వీడియోలో వాస్తవమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









