వెనుజువెలా: పోలీస్ స్టేషన్‌లో అల్లర్లు.. 68 మంది మృతి

ఫొటో సోర్స్, Reuters
వెనుజువెలాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో అల్లర్లు చెలరేగటంతో మంటల్లో 68 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
స్టేషన్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన జైలులో ఖైదీలు పరుపులకు నిప్పు పెట్టడంతో మంటలు భారీగా ఎగిసిపడినట్టు చెప్తున్నారు.
ఈ ఘటన కరబోబో రాష్ట్రంలోని వాలెన్సియా పట్టణంలో చోటుచేసుకుంది. దీనిపై అత్యవసర విచారణకు ఆదేశించినట్టు రాష్ట్ర ప్రధాన ప్రాసిక్యూటర్ టారెక్ సాబ్ తెలిపారు.
ఈ ఘటన గురించి వార్తలు వచ్చిన వెంటనే ఖైదీల బంధువులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టి రాళ్లు రువ్వారు. దాంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని రాష్ట్ర ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
పొగ కమ్ముకోవడంతో చాలామంది ఖైదీలు ఊపిరాడక చనిపోయారని వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల్లో ఖైదీలను చూసేందుకు లోపలికి వెళ్లిన పలువురు మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
కిక్కిరిసే జైళ్లు..

ఫొటో సోర్స్, Reuters
హింసాత్మక ఘటనలు, అల్లర్ల కారణంగా వెనుజువెలా లోని జైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. దాంతో జైళ్లలోనూ అనేక సార్లు ప్రమాదాలు, అల్లర్లు జరిగాయి.
తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ఈ దేశంలో ఖైదీలను పోషించలేక ప్రభుత్వం నానా తిప్పలుపడాల్సి వస్తోంది.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








