పాలోమా సిప్రియానో: భవన నిర్మాణ పనులను నేర్పించే యూట్యూబ్ సెన్సేషన్

పాలోమా యూట్యూబ్ చానెల్ కు 625,000 సబ్ స్క్రైబర్లు ఉన్నారు

ఫొటో సోర్స్, Arquivo Pessoal

    • రచయిత, మైరా సార్టొరాటొ
    • హోదా, బీబీసీ బ్రెజిల్ ప్రతినిధి

ట్రావెల్, ఫ్యాషన్ విభాగాల్లో టిప్స్ ఇవ్వడం ద్వారా సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని నాలుగేళ్ల క్రితమే పాలోమా సిప్రియానో కలగన్నారు. కానీ దీనికో సమస్య ఉంది.. ఆమె బ్రెజిల్‌లోని సీట్ లాగోస్ పట్టణాన్ని దాటి ఎప్పుడూ బయటకు రాలేదు. ఇప్పటికీ ఆమె అక్కడే నివసిస్తున్నారు. ఆమెకు మేకప్ ఎలా వేసుకోవాలో కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఆమె నిర్వహిస్తున్న యూట్యూబ్ చానల్‌కు 6.25 లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు. బీచ్‌ల గురించో, లిప్‌ స్టిక్ గురించో కాకుండా ఆమె భవన నిర్మాణంపై సూచనలివ్వడం ప్రారంభించారు.

ఈ అంశంపై బ్రెజిల్‌లో ఓ వేదికను ఏర్పాటు చేసి మాట్లాడే ఏకైక మహిళ ఈమె ఒక్కరే. ముందు అనుకున్న ప్రణాళికను కాదని తన తల్లి ఇవోన్ సూచనతో ఈ రంగంలో ప్రవేశించారు.

"ఫ్లోర్ టైల్స్‌ను వేస్తూ ఓ వీడియో తీసి అప్‌లోడ్ చెయ్యమని మా అమ్మ సలహా ఇచ్చింది. ఈ ఆలోచన అద్భుతంగా ఉంది అని నేనేమీ అనుకోలేదు. కానీ ఆమె చెప్పినట్లే వీడియో పోస్ట్ చేశాను" అని పాలోమా బీబీసీతో చెప్పారు. గోడకు ప్లాస్టరింగ్ ఎలా చేయాలో వివరించే వీడియోలే ఇప్పటి వరకూ ఆమె రూపొందించిన వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందాయి. వీటికి దాదాపు 75 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇలాంటి అంశాలపై వీడియోలు చేసే ఇతర యూట్యూబ్ చానళ్ల కన్నా పాలోమాకు ఎక్కువమంది ఫాలోయర్లు ఉన్నారు. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా 45వేల మంది ఫాలోయర్లున్నారు.

నేలపై టైల్స్ ఎలా వెయ్యాలి, ట్యాప్ ఎలా ఫిటింగ్ చెయ్యాలి, గోడ ఎలా కట్టాలి వంటి 'డూ ఇట్ యువర్‌సెల్ఫ్' విభాగంలో రూపొందించిన వీడియోలు కూడా ఈ చానల్‌లో ఉన్నాయి. సులభమైన పద్ధతిలో సూచనలిస్తూ ఈ వీడియోలు సాగుతాయి. "నేను చెయ్యగలుగుతున్నానంటే అందరూ చెయ్యగలుగుతారు. ఇదే చూపించాలనుకుంటున్నా" అని పాలోమా చెబుతారు.

గోడకు ప్లాస్టరింగ్ ఎలా చేయాలో వివరిస్తున్న పాలోమా

ఫొటో సోర్స్, YouTube/Paloma Cipriano

ఫొటో క్యాప్షన్, గోడకు ప్లాస్టరింగ్ ఎలా చేయాలో వివరిస్తున్న పాలోమా

అవసరం అన్నీ నేర్పిస్తుంది

కేవలం అవసరంతోనే పాలోమా భవన నిర్మాణ రంగం గురించి తెలుసుకున్నారు. వాళ్లు నివసించే ఇంటిని కొద్దిగా పెద్దదిగా నిర్మించాలనుకున్న పాలోమా, ఆమె తల్లి... ఆర్థిక ఇబ్బందుల కారణంగా తామే ఆ పని చేయడానికి సిద్ధపడ్డారు. తల్లికున్న స్నేహితులు ఈ పనిలో వారికి చాలా సాయం చేశారు. అలా నిర్మాణ పనిపై ఆమెకు ఇష్టం పెరిగింది. దీంతో 2013లో ఓ యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌ కోర్సులో చేరారు. కానీ యూట్యూబ్ చానల్‌పై దృష్టిపెట్టాలనే ఉద్దేశంతో మొదటి సెమిస్టర్‌లోనే కోర్సునుంచి వైదొలిగారు.

తమ ఇంటి నిర్మాణ పనులను తామే చేసుకోవడం వల్ల దాదాపు 7వేల డాలర్లు ఆదాచేయగలిగామని పాలోమా చెబుతారు.

"డబ్బులు ఖర్చుపెట్టి ఈ పనులన్నీ చేయించుకోవాలంటే నేను వీటిని చేయించగలిగేదాన్ని కాదు" అని పాలోమా అంటారు.

పురుషాధిక్యత ఉన్న నిర్మాణ రంగంలోకి దిగడానికి తల్లి ఇవోన్‌నే పాలోమాకు స్ఫూర్తి.

బ్రెజిల్‌లో నిర్మాణ రంగంలో మహిళల భాగస్వామ్యం 4శాతం కన్నా తక్కువే.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్రెజిల్‌లో నిర్మాణ రంగంలో మహిళల భాగస్వామ్యం 4శాతం కన్నా తక్కువే.

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) లెక్కల ప్రకారం బ్రెజిల్‌లో నిర్మాణ రంగ ఉద్యోగుల్లో కేవలం 3.2శాతం మాత్రమే మహిళలున్నారు.

"మా అమ్మ నాకోసం ఎన్నో చేసింది. మేం పిల్లలుగా ఉండగా ఆమె ఉదయం 5 గంటలకే లేచి డబ్బులు సంపాదించడానికి పనుల్లోకి వెళ్లేది. ఆమె స్థైర్యమే నాకు శక్తినిచ్చింది" అని ఆమె తల్లి ఇవోన్ గురించి గర్వంగా చెబుతారు పాలోమా.

పాలోమా ఇద్దరు సోదరిలు మాత్రం పాలోమా పనికి దూరంగా ఉన్నారు. కానీ 13 ఏళ్ల సోదరుడు మాత్రం వీడియోల రూపకల్పనలో సాయం చేస్తుంటారు.

"నా తమ్ముడికి ఇంకా ఈ రంగంపై అవగాహన లేదు, నేనిప్పుడిప్పుడే నేర్పిస్తున్నా" అని పాలోమా అంటున్నారు.

యూట్యూబ్ చానల్ ఫాలోయర్లలో చాలామంది ఈ చానల్‌ను నడుపుతున్నది ఓ అమ్మాయి అని తెలిసి ఆశ్చర్యానందాలకు లోనవుతుంటారు.

పాలోమానే ఈ పనులన్నీ చేస్తున్నారంటే మొదట్లో చాలామంది ఫాలోయర్లు నమ్మలేదు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాలోమానే ఈ పనులన్నీ చేస్తున్నారంటే మొదట్లో చాలామంది ఫాలోయర్లు నమ్మలేదు.

వేధింపులు తప్పలేదు

"ఈ పని చేసేది నేను కాదు, నా వెనక ఎవరో మగవాళ్లున్నారని విమర్శించినప్పుడు నాకు చాలా బాధ కలిగేది" అని పాలోమా గుర్తుచేసుకున్నారు.

ఆ తర్వాత కొద్దిరోజులకు కామెంట్ల ద్వారా వేధింపులు, ప్రత్యేకించి అదే రంగంలో పనిచేస్తున్న పురుషుల నుంచి తీవ్ర అసభ్యకరమైన కామెంట్లు వచ్చేవి.

"ఉదాహరణకు, ఏదైనా ఓ పని ఇలా చెయ్యాలి అని నేను చెబితే, ఎవరో ఒక పురుషుడు దాన్ని ఒప్పుకోడు. అది అలా ఉండకూడదు, తప్పు అంటాడు. కానీ చివరికి, నేను చేసింది ఒప్పు అవుతుంది. ఏ తప్పూ లేకపోయినా కొందరికి ఏదో ఒకవిధంగా తప్పులు వెతకడమే పని."

పాలోమా ఇప్పుడు ఇలాంటి అసభ్యకరమైన కామెంట్లను పట్టించుకోవడం మానేశారు. కానీ ఇప్పటికీ అలాంటి కామెంట్లు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే చానల్ ఫాలోయర్లలో 60శాతం మంది మగవారే. అయితే మహిళా ఫాలోయర్లు కూడా పెరుగుతున్నారు. వారు చాలా ప్రోత్సాహకరమైన ఫీడ్‌బ్యాక్ ఇస్తుంటారు.

"మీరు చేస్తున్న పనికి అభినందనలు. బిల్డర్ అవసరం లేకుండా మీ వీడియోలు చూసి మా ఇంట్లో కొన్న నిర్మాణ పనులను మేమే పూర్తిచేసుకున్నాం" అంటూ కామెంట్లు పెడుతుంటారు.

పాలోమా శాంటోస్

ఫొటో సోర్స్, Paloma Cipriano

ఫొటో క్యాప్షన్, మహిళలు కూడా ఏమైనా చేయగలరు అని పురుషులకు మనం తెలియచెప్పాలి అంటున్నారు పాలోమా

మహిళలు ఏమైనా చేయగలరు

వ్యాపార విస్తరణకు పాలోమాకు కొన్ని వ్యూహాలున్నాయి. 'మీకు మీరుగానే చేయండి (డీఐవై)' తరహా పనులు చేసే విధంగా మరింతమంది మహిళలను ప్రోత్సహించడం దీనిలో ఒకటి.

"ఇంజనీరింగ్ డిప్లొమా లేకుండానే నేనొక కాంక్రీటు స్తంభాన్ని నిర్మించగలిగితే, వాళ్లు ఓ ఎలక్ట్రిక్ షవర్‌ను ఎందుకు ఏర్పాటుచెయ్యలేరు?" అని ఆమె ప్రశ్నిస్తారు.

"ఒకవేళ మహిళలు ఈ పనులన్నీ చెయ్యకపోయినా, నేర్చుకోవడం వల్ల నష్టం ఏమీ లేదు కదా. ఆ పరిజ్ఞానం ఉండటం వల్ల వారినెవరూ ఆ పనుల విషయంలో తప్పుదోవ పట్టించలేరు" అంటారు పాలోమా.

"అబ్బాయిలపై వాళ్లు అనుకున్నంత ఎక్కువగా మనం ఆధారపడి లేమనే విషయాన్ని వారికి తెలియచెయ్యాల్సిన అవసరం కూడా ఉంది".

తమ ఇంటి పనులను తల్లితో కలసి పాలోమానే పూర్తి చేశారు.

ఫొటో సోర్స్, Facebook/Paloma Cipriano

ఫొటో క్యాప్షన్, తమ ఇంటి పనులను తల్లితో కలసి పాలోమానే పూర్తి చేశారు.

అమ్మాయిలూ, మీరూ చేయండి..

ప్రొఫెషనల్ యూట్యూబర్‌గా పాలోమా నడుపుతున్న చానల్‌లో 150కి పైగా వీడియోలున్నాయి.

'నేను షూట్ చేస్తా, ఎడిట్ చేస్తా, ప్రొడ్యూస్ చేస్తా' అని పాలోమా అంటున్నారు. ఈ వీడియోలన్నీ ఒకే కెమెరాతో షూట్ చేస్తారు, రెండు మూడు రోజుల్లో ఎడిటింగ్ పూర్తిచేసి, యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తారు. పాలోమా తమ ఇంటిలో ఎదురయ్యే సమస్యలు, అవసరాల ఆధారంగానే వీడియోలు రూపొందిస్తుంటారు.

"మా ఇంట్లో మాకు ఏది అవసరమో, ఆ అంశం మీదే వీడియో చిత్రీకరిస్తా. గోడలకు రంగులు వేశాను, అరలను కట్టాను, ఈతకొలను నిర్మించా."

ఒకప్పుడు పర్యటక రంగంపై టిప్స్ ఇవ్వాలనుకున్న అమ్మాయి ఇప్పుడు నిర్మాణ రంగానికి సంబంధించి డీఐవై వీడియోలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)