డ్రాగన్ కాప్స్యూల్: అంతరిక్ష కేంద్రానికి ప్రయోగాత్మక ప్రయాణం షురూ

ఫొటో సోర్స్, BBC Sport
- రచయిత, జొనాథన్ ఆమోస్
- హోదా, బీబీసీ సైన్స్ ప్రతినిధి
అమెరికా సరికొత్త వ్యోమగామి కాప్స్యూల్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్-ఐఎస్ఎస్) పయనమైంది.
కాలిఫోర్నియాలోని స్పేస్-ఎక్స్ కంపెనీ ఈ డ్రాగన్ వాహనాన్ని శనివారం ప్రయోగించింది. స్వీయ నియంత్రణతో స్పేస్ సెంటర్‌తో అనుసంధానం అయ్యేలా దీనిని రూపొందించారు.
అంతరిక్షంలోకి సామాన్య ప్రజలను ఈ వాహనంలో తీసుకువెళ్ళాలని స్పేస్ ఎక్స్ భావిస్తోంది. దీనికి నాసా అనుమతి పొందడం కోసం క్యాప్సూల్‌ను ఎన్నో రకాలుగా పరీక్షించాల్సి ఉంది. ఆ పరంపరలో ఇది తాజా పరీక్ష.
ఈ ప్రయోగాత్మక ప్రయాణం కోసం డ్రాగన్ క్యూప్సూల్‌లో పరీక్ష నమూనాలు, 90 కిలోల సరకులను పంపించారు.
కాప్స్యూల్ జీఎంటీ 11:00 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు) అంతరిక్ష కేంద్రానికి అనుసంధానం కావాల్సి ఉంది.
ఈ వాహనం భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతరిక్ష కేంద్రం దగ్గరకు ముందు వైపు నుంచి వెళుతుంది. అంతర్గతంగా ఉన్న కంప్యూటర్లు, సెన్సర్ల సాయంతో తన దిశను నిర్దేశించుకుంటూ అనుసంధానమవుతుంది.
అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు హెచ్‌డీ కెమెరాలతో ఈ కాప్స్యూల్ అనుసంధానాన్ని నిశితంగా గమనిస్తారు. ఈ వాహనం సక్రమంగా పనిచేస్తోందో లేదో చూస్తూ, అవసరమైతే రంగంలోకి దిగటానికి సిద్ధంగా ఉంటారు.

ఈ ప్రక్రియ స్పేస్-ఎక్స్ సంస్థ సాంకేతిక పరిజ్ఞానంలో మరో ముందడుగు. ఇప్పటివరకూ అంతరిక్ష కేంద్రానికి పంపుతున్న సరకు నౌకలను స్పేస్ స్టేషన్‌కు అనుసంధానించి ఉన్న రోబో హస్తం సాయంతో పట్టుకుని లాగుతూ అనుసంధానం చేయాల్సి వస్తోంది.
సరకు రవాణా చేసే ఆ అంతరిక్ష నౌకలకు తమకు తాముగా అనుసంధానమయ్యే సాంకేతిక పరిజ్ఞానం లేదు.
తాజాగా ప్రయోగించిన డ్రాగన్ కాప్స్యూల్ శుక్రవారం వరకు అంతరిక్ష కేంద్రం వద్ద ఉంటుంది. ఆరోజున అది దాని నుంచి తనకు తానుగా విడివడి భూమికి తిరుగు ప్రయాణమవుతుంది.
కాప్స్యూల్ భూమి వాతావరణంలో నుంచి నిప్పులు చిమ్ముకుంటూ అత్యంత వేగంగా నేలకు దిగివచ్చే ఆ దశ మీదే తనకు చాలా ఆందోళనగా ఉందని స్పేస్-ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ చెబుతున్నారు.
డ్రాగన్ ఉపరితలం మీద ఉష్ణోగ్రతను తట్టుకునేందుకు అమర్చిన కవచం (హీట్‌షీల్డ్) ఆకారం అసమాకృతిలో ఉండటం వల్ల.. ధ్వని వేగం కన్నా అత్యంత వేగంతో (హైపర్‌సోనిక్) ప్రయాణించేటపుడు కాప్స్యూల్ మీద ఉష్ణోగ్రతల్లో చాలా తారతమ్యాలు ఏర్పడటానికి అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, NASA
''అది బాగానే ఉండాలి. కానీ, తిరిగి వచ్చేటపుడు అది బాగానే పని చేస్తోందని నిర్ధరించుకోవటం ముఖ్యం'' అని మస్క్ పేర్కొన్నారు.
''ఇప్పటివరకూ అంతా సానుకూలంగానే కనిపిస్తోంది. ఏదైనా పొరపాటు జరిగితే తప్ప.. ఈ ఏడాదిలో, ఈ వేసవిలోనే మనుషులను అంతరిక్ష ప్రయాణానికి తీసుకెళతామని నేను అనుకుంటున్నాను'' అని కూడా ఆయన చెప్పారు.
అంతరిక్ష కేంద్రానికి సిబ్బందిని పంపించటాన్ని స్పేస్-ఎక్స్‌కు కాంట్రాక్టు ఇవ్వాలని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా యోచిస్తోంది.
గతంలో అంతరిక్ష నౌక డిజైన్‌కు సంబంధించి అన్ని అంశాల మీదా నాసా ఇంజనీర్ల పూర్తి నియంత్రణ ఉండేది. నౌకను తానే కొనుగోలు చేసి నిర్వహించేది. ఇప్పుడు పరిశ్రమతో సంబంధం పూర్తిగా మారిపోతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం.. అది తన అవసరాలేమిటో చెబుతోంది. ఆ అవసరాలను ఎలా తీర్చాలనే విషయంలో పరిశ్రమకు చాలా వెసులుబాటు కల్పిస్తోంది.
అయితే, ప్రతి దశనూ నాసా అధికారులు తనిఖీ చేస్తారు. ఈ విధానం మరింత సమర్థమైనదని భావిస్తున్నారు.
''ఇది కొత్త శకం. మేం ఒక సంస్థ, ఒక దేశం లాగానే ఒక వినియోగదారుడిగా ఉండబోతున్నాం'' అని నాసా చీఫ్ జిమ్ బ్రిడెన్‌స్టీన్ వ్యాఖ్యానించారు.
''భూమికి స్వల్ప దూరంలోని కక్ష్యకు సంబంధించిన బలమైన వాణిజ్య మార్కెట్‌లో మేం కూడా చాలా మంది వినియోగదారుల్లో ఒకరుగా చారిత్రకంగా సాధ్యం కాని రీతిలో ఖర్చులను తగ్గించుకుని, విస్తృతిని పెంచుకోగలమని ఆశిస్తున్నాం'' అని చెప్పారు.
అంతరిక్ష కేంద్రానికి సిబ్బందిని రవాణా చేయటానికి సంబంధించి బోయింగ్ సంస్థతో కూడా నాసా పనిచేస్తోంది. బోయింగ్ కూడా సొంతంగా 'స్టార్‌లైనర్' అనే కాప్స్యూల్‌ను తయారు చేసింది. దీనిని కూడా రాబోయే రెండు నెలల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు.
ఇవి కూడా చదవండి:
- అభినందన్ పాకిస్తాన్ సైన్యంతో కలిసి డాన్స్ చేయడం నిజమేనా...
- భారత్ నిజంగానే జైషే మొహమ్మద్ శిబిరాలపై వైమానిక దాడులు చేసిందా... ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు...
- ఎఫ్-16లను భారత్‌పై ఎందుకు ప్రయోగించారు? - పాక్‌ను ప్రశ్నించిన అమెరికా
- 1971లో భారత్‌పై పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న విషయం RAW కి ముందే ఎలా తెలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








