ఆసియా బీబీ: 'దైవదూషణ కేసులో ఆమె నిర్దోషి...' మళ్ళీ తీర్పు చెప్పిన పాకిస్తాన్ సుప్రీం కోర్టు

దైవదూషణ కేసులో ఆసియా బీబీని నేరస్థురాలిగా ప్రకటించి, మరణ శిక్ష విధిస్తూ కింది కోర్టు చెప్పిన తీర్పును రద్దు చేసి ఆమెను నిర్దోషిగా ప్రకటించిన పాకిస్తాన్ సుప్రీం కోర్టు తన తీర్పుకు కట్టుబడి ఉంటున్నట్లు ప్రకటించింది.
క్రైస్తవ మహిళ అయిన ఆసియా బీబీకి దైవదూషణ కేసులో విముక్తి కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పాక్ అత్యుతన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
మహమ్మద్ ప్రవక్తను అవమానించే విధంగా మాట్లాడారనే ఆరోపణలతో నమోదైన కేసులో పాకిస్తాన్ కోర్టు 2010లో ఆమెకు మరణదండన విధించింది. ఆమె ఎనిమిదేళ్ళుగా తనకు మరణశిక్ష విధించడం న్యాయం కాదని పోరాడుతూ వచ్చారు.
పాకిస్తాన్ దేశాన్నంతా ఒక్కటి చేసిన ఆ కేసులో ఆమె మాత్రం తాను ఏ తప్పూ చేయలేదని చెబుతూ వచ్చారు.

ఫొటో సోర్స్, EPA
గత ఏడాది అక్టోబర్ నెలలో సుప్రీం కోర్టు ఆమెకు విధించిన శిక్షను రద్దు చేసినప్పుడు దేశంలో చాలా చోట్ల హింసాత్మక నిరసన ప్రదర్శనలు జరిగాయి. దైవదూషణ విషయంలో చట్టాలు కఠినంగా ఉండాలని వాదించే సంప్రదాయ మత పెద్దలు సుప్రీం తీర్పును తీవ్రంగా నిరసించారు. అయితే, ఉదారవాదులు మాత్రం ఆమెను విడుదల చేయాలని వాదించారు.
సుప్రీం తన తీర్పును వెనక్కి తీసుకోవాలని మతవాదులు పిటిషన్ దాఖలు చేశారు.
"అన్ని విషయాలను పరిశీలించిన తరువాత ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నాం" చీఫ్ జస్టిస్ అసిఫ్ సయీద్ ఖోసా మంగళవారం నాడు ప్రకటించారు.
ఆసియా నోరీన్‌గా సుపరిచుతులైన ఆసియా బీబీ, అపీలు పెండింగ్‌లో ఉన్నందున పాకిస్తాన్ నుంచి వెళ్ళలేకపోయారు.
"ఇప్పుడు ఆమె స్వేచ్ఛగా తన కుటుంబ సభ్యులను కలుసుకోవచ్చు. ఏ దేశంలోనైనా రక్షణ పొందవచ్చు" అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇప్పుడేం జరుగుతుంది?
ఆసియా బీబీని అధికారులు ఇస్లామాబాద్‌లో ఒక రహస్య ప్రదేశంలో ఉంచారని, ఈ తీర్పుతో ఆమె పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోవడానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయని బీబీసీ ఇస్లామాబాద్ ప్రతినిధి ఎం ఇల్యాస్ ఖాన్ వివరించారు.
ఆమె ఎప్పుడు పాకిస్తాన్ విడిచి వెళతారు, ఏ దేశానికి వెళతారన్నది ఇంకా తెలియదు. అయితే, చాలా దేశాలు ఆమెకు ఆశ్రయం ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. అయితే, ఇప్పటికే ఆమె కుటుంబ సభ్యులు కొందరు విదేశాలకు వెళ్ళిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే, పాకిస్తాన్‌లో దైవదూషణ-వ్యతిరేక ప్రదర్శనలను హింసాత్మకంగా నిర్వహించిన తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ సంస్థ వైఖరిని ఈ తీర్పు ఏ విధంగా ప్రభావితం చేస్తుందన్నది వేచి చూడాలి. ఆసియా బీబీని విడుదల చేస్తూ మొదటిసారి తీర్పు వెలువడిన తరువాత అక్టోబర్ నెల నుంచి ఆ సంస్థకు చెందిన చాలా మంది నాయకులు అరెస్టయి జైల్లో ఉన్నారు.
పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రజాందోళనలను కట్టడి చేయడానికి ఈ వార్త గురించి వ్యూహాత్మకంగా హడావిడి చేయడం లేదు.
అయితే, దైవదూషణ కేసుల విషయంలో పాకిస్తాన్ చట్టాలను అమలు చేసే తీరును ఈ తీర్పు ప్రభావితం చేస్తుందని చాలా మంది పరిశీలకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- జార్జి ఫెర్నాండెజ్: దేశద్రోహం కేసులో నిందితుడి నుంచి రక్షణ మంత్రి వరకూ...
- Fact Check: ఈ అన్నాచెల్లెళ్ళ మధ్య తేడా ఆరు నెలలేనా?
- #MyVoteCounts: ఉద్యోగాలు ఇచ్చే పార్టీకే ఓటేస్తా
- ప్రజల ఖాతాల్లోకి డబ్బు: ఈ పథకం ఎలా ఉంటుందంటే..
- 'కీలెస్ కార్లు'... ఈజీగా కొట్టేస్తున్న దొంగలు... ఈ కార్లను కాపాడుకోవటం ఎలా?
- గాంధీజీ మెచ్చిన పెన్ను రాజమండ్రిలో తయారైంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








