సిడ్నీ టెస్ట్: విజయానికి వాతావరణం అడ్డుగా నిలిచినా, కోహ్లీ సేన కొత్త చరిత్ర సృష్టించడం ఖాయం

ఫొటో సోర్స్, EPA
భారత్-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, ఆస్ట్రేలియా
భారత్ మొదటి ఇన్నింగ్స్-622/7 డిక్లేర్డ్(పుజారా 193, పంత్ 159*-లియాన్ 178/4)
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్-300 ఆలౌట్(హారిస్ 79, లాబుషోన్ 38-కుల్దీప్ 99/5)
(ఫాలోఆన్) ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్-6/0
సిరీస్‌లో భారత్ 2-ఆస్ట్రేలియా 1
సిడ్నీలో భారత్ జట్టు మరో విజయం అందుకోడానికి వాతావరణం అడ్డుగోడగా నిలిచింది.
వాతావరణం సరిగా లేకపోయినా విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు సోమవారం కొత్త చరిత్ర లిఖించడం ఖాయమైపోయింది.
ఇప్పటివరకూ భారత్ ఆస్ట్రేలియాలో ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలుచుకోలేదు. నాలుగు మ్యాచ్‌ల ప్రస్తుత సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న కోహ్లీ సేన ఆ లోటును తీర్చేయబోతోంది.
కానీ, ఈ విజయం 3-1 ఆధిక్యంతో ఉండాలని భారత జట్టు భావిస్తోంది. అందుకు, ఆఖరి రోజు భారత బౌలర్లు 10 ఆస్ట్రేలియా వికెట్లు పడగొట్టాల్సి ఉంటుంది.
కానీ, సిడ్నీలో వాతావరణం భారత జట్టుకు కలవరం కలిగిస్తోంది. సోమవారం కూడా సిడ్నీలో వర్షం కురిసే అవకాశం ఉంది. ఆట ఆగిపోయే ప్రమాదం పొంచి ఉంది.

ఫొటో సోర్స్, EPA
కుల్దీప్ మాయ
వర్షం వల్ల వెలుతురు సరిగా లేకపోవడంతో ఆదివారం ఆట 25.2 ఓవర్లు మాత్రమే కొనసాగింది.
నాలుగో రోజు మూడు గంటలు ఆలస్యంగా ఆస్ట్రేలియా ఆరు వికెట్లకు 236 పరుగుల దగ్గర తమ బ్యాటింగ్ కొనసాగించింది.
శనివారం నాటౌట్‌గా ఉన్న పాట్ కమిన్స్ ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 25 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర మహమ్మద్ షమీ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
హాండ్స్‌కాంబ్ బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. నాథన్ లియాన్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు.
కానీ మిచెల్ స్టార్క్, జోష్ హేజల్‌వుడ్ చివరి వికెట్‌కు 42 పరుగులు జోడించారు. చివరి వికెట్ కోసం భారత బౌలర్లు గంట సేపు వేచిచూడాల్సివచ్చింది.
హేజల్‌వుడ్‌ను 21 పరుగుల దగ్గర అవుట్ చేసిన కుల్దీప్ యాదవ్ ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌ను 300 పరుగులకు పరిమితం చేశాడు. ఇది మొదటి ఇన్నింగ్స్‌లో కుల్దీప్‌కు ఐదో వికెట్.
ఆరో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న కుల్దీప్ యాదవ్ కెరీర్లో రెండోసారి ఐదు వికెట్లు సాధించాడు.
31 ఏళ్ల తర్వాత ఆతిథ్య జట్టు ఫాలోఆన్
ఆస్ట్రేలియా 300 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్‌కు 322 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాకు ఫాలోఆన్ ఇచ్చింది.
ఆస్ట్రేలియా జట్టు స్వదేశంలో ఫాలోఆన్ ఆడడం 31 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి.
ఇంతకు ముందు 1988లో ఇంగ్లండ్ సిడ్నీలో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియాకు ఫాలోఆన్ ఇచ్చింది. భారత జట్టు కూడా 1986లో సిడ్నీలోనే ఆతిథ్య జట్టును ఫాలోఆన్ ఆడించింది.
రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు మార్క్స్ హారిస్, ఉస్మాన్ ఖ్వాజా నాలుగు ఓవర్లలో ఆరు పరుగులు చేశారు. ఆ తర్వాత వెలుతురు సరిగా లేకపోవడంతో ఆట ఆగిపోయింది.
ఆస్ట్రేలియా భారత మొదటి ఇన్నింగ్స్ స్కోరు కంటే 316 పరుగులు వెనకబడి ఉంది.
ఇవి కూడా చదవండి:
- మీ సిమ్ కార్డ్ మిమ్మల్ని ఒక్క రాత్రికే బికారిగా మార్చొచ్చు
- ఎవరీ పృథ్వీ షా? సచిన్ ఈ కుర్రాడి గురించి ఏమన్నాడు?
- రోహిత్ లాంగ్ ఇన్నింగ్స్ రహస్యమేంటి?
- టీం ఇండియా దశ, దిశ మార్చా.. నన్నే టీంలోంచి తీసేశారు
- ద్రవిడ్ గురించి ఆయన భార్య విజేత ఏమన్నారు?
- టికెట్ కలెక్టర్ నుంచి ట్రోఫీ కలెక్టర్ వరకూ ఎంఎస్ ధోనీ జర్నీ
- వీవీఎస్ లక్ష్మణ్: నంబర్ త్రీగా ఆడడం వెనుక అసలు చరిత్ర
- సచిన్ టెండూల్కర్ ‘లిటిల్ మాస్టర్’ ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








