యాపిల్‌కు చైనా షాక్: ఒక్క రోజులో 5.25 లక్షల కోట్లు ఆవిరి

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా మల్టీనేషనల్ కంపెనీ యాపిల్ షేర్ల విలువ గురువారం ఒక్కరోజే 10 శాతం పడిపోయింది. చైనాలో యాపిల్ అమ్మకాలు తగ్గిపోవడంతో రెవెన్యూ తగ్గిందని కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో) టిమ్ కుక్ వెల్లడించడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
షేర్ల విలువ పది శాతం పడిపోవడం అంటే దాదాపు 75 బిలియన్ డాలర్లు నష్టపోయినట్లు లెక్క. రూపాయల్లో చెప్పాలంటే ఈ విలువ 5.25 లక్షల కోట్లు.
2018 చివరి త్రైమాసికానికి సంబంధించి 84 బిలియన్ డాలర్లు ( సుమారు రూ.5.9 లక్షల కోట్లు) రెవెన్యూ అంచనా వేసినా, చైనాలో పరిస్థితుల కారణంగా ఆ అంచనాలను అందుకోలేకపోయినట్లు బుధవారం కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
యూరప్ కంపెనీలకు ఇదే పరిస్థితి ఎదురైంది. దుస్తుల కంపెనీ బర్బెరీ అమ్మకాలు 6 శాతం పడిపోయాయి. ఎల్‌వీఎంహెచ్, హెర్మస్ షేర్లు కూడా పడిపోయాయి.
ఈ కంపెనీలకు చైనా ప్రధాన మార్కెట్‌గా ఉంది. అక్కడ అమ్మకాలు తగ్గడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

ఫొటో సోర్స్, AFP
అన్ని ఉత్పత్తి సంస్థల మాదిరిగానే క్రిస్‌మస్ సీజన్ యాపిల్‌కు కూడా బలమైన త్రైమాసికం. కానీ, ఈ సారి కంపెనీ రెవెన్యూ గత ఏడాది ఇదే సమయంలో నమోదైన రెవెన్యూ కంటే 5 శాతం తగ్గిపోయింది. 2016 తర్వాత కంపెనీ రెవెన్యూ ఒక త్రైమాసికంలో తగ్గిపోవడం ఇదే మొదటిసారి.
అమ్మకాలు పడిపోవడం, షేర్ల పతనంతో 15 ఏళ్లలో తొలిసారి ఇన్వెస్టర్లకు సంబంధించిన మార్గదర్శకాలను కంపెనీ బుధవారం సవరించింది.
ఇప్పటి వరకు అమెరికాలో అతిపెద్ద ప్రైవేటు కంపెనీగా యాపిల్ ఉంది. ఇప్పుడు దాని సంపద మైక్రోసాఫ్ట్, అమోజాన్, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తర్వాత స్థానంలో ఉంది.
చైనాలో సమస్యలు
గ్రేటర్ చైనా పరిధిలో అమ్మకాలు పడిపోయాయని ఇన్వెస్టర్లకు బుధవారం కుక్ లేఖ రాశారు. హాంకాంగ్, తైవాన్, చైనాను కలిపి గ్రేటర్ చైనాగా పిలుస్తారు. ఇక్కడ నుంచి 20 శాతం రెవెన్యూ పడిపోవడమే యాపిల్ షేర్ల పతనానికి ప్రధాన కారణం.
'వృద్ధిచెందుతున్న మార్కెట్‌లలో ఊహించినట్లుగానే మేం సవాళ్లను ఎదుర్కొన్నాం. కానీ, చైనాలో నెలకొన్న ఆర్థిక పరిణామాలను మేం ఊహించలేదు'' అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
కొనసాగుతున్న అనిశ్చితి
కొన్నాళ్లుగా డాలర్ బలోపేతం అవడం, ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్న నేపథ్యంలో విదేశీ మార్కెట్‌లో రెవెన్యూ తగ్గే అవకాశం ఉందని గత నవంబర్‌లోనే ఇన్వెస్టర్లను ఉద్దేశిస్తూ యాజమాన్యం హెచ్చరికలు జారీ చేసింది.
అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు కూడా యాపిల్ రెవెన్యూ పడిపోడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల వినియోగదారులు కొనుగోళ్లకు మొగ్గుచూపడం లేదని యాపిల్ కంపెనీ పేర్కొంది.
'ఆర్థిక వ్యవస్థలో ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. దీని ప్రభావం వినియోగదారుడిపై కూడా పడింది. చైనాలోని మా రిటైల్ స్టోర్స్, భాగస్వామ్య సంస్థల్లో ఈ త్రైమాసికంలో అమ్మకాలు పడిపోయాయి' అని కంపెనీ ముఖ్యకార్యనిర్వహణ అధికారి టిమ్ కుక్ ఒక లేఖలో తెలిపారు.
యాపిల్ ఫోన్లను వినియోగదారులకు చేరువ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని, అలాగే, కంపెనీకి సంబంధించిన ఇతర ఉత్పత్తులను మరింత బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు.
'షేర్ల పతనం కారణంగా మా మార్గదర్శకాలను సవరించడంతో కాస్త నిరాశ చెందాం. కానీ, ఇదే సమయంలో వివిధ సవాళ్లను అధిగమిస్తూ చక్కటి ప్రదర్శన కనబర్చాం' అని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








