నేరము-వింత శిక్ష: జింకను చంపినందుకు కార్టూన్ చూడాలని శిక్ష

ఫొటో సోర్స్, Alamy
ఏదైనా నేరం చేసినందుకు మీకు బాగా బోరు కొట్టే పనిని శిక్షగా విధిస్తే ఎలా ఉంటుంది.
ఇటీవల ఒక వేటగాడికి ఒక ఏడాది వరకూ జైల్లో ఉండి నెలలో కనీసం ఒకసారి డిస్నీ బాంబీ కార్టూన్ చూడాలని శిక్ష వేశారు.
అమెరికాలోని ముస్సోరీలో ఉంటున్న డేవిడ్ బేరీని జింకలను వేటాడిన కేసులో దోషిగా తేల్చారు.
కార్టూన్ చూశాక డేవిడ్ ఆలోచన మారిందా, లేదా అనే వివరాలు మాత్రం బయటికి రాలేదు. కానీ ఒక నేరానికి ఇలా వింత శిక్ష విధించడం, ఇదే మొదటిసారి కాదు.

ఫొటో సోర్స్, Getty Images
గాడిదతో మార్చ్ చేయాలని శిక్ష
2003లో షికాగోలో ఇద్దరు యువకులకు 45 రోజుల వరకూ జైలు శిక్ష విధించడంతోపాటు తమ స్వగ్రామంలో ఒక గాడిదతోపాటు మార్చ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
క్రిస్మస్ ముందు రోజు సాయంత్రం ఇద్దరూ ఒక చర్చి నుంచి బాల ఏసు విగ్రహాన్ని దొంగిలించి, దాన్ని ధ్వంసం చేసినందుకు వారికి ఈ శిక్ష విధించారు.
జెసికా లాంగ్, బయాన్ పాట్రిక్ ఇద్దరికీ అప్పుడు 19 ఏళ్లు. వాళ్లు గాడిదతోపాటు మార్చ్ చేస్తూ ఒక పోస్టర్ కూడా తీసుకెళ్లాల్సి వచ్చింది. అందులో "తెలివితక్కువ నేరం చేసినందుకు చింతిస్తున్నాం" అని రాసుంది.

ఫొటో సోర్స్, Getty Images
పదేళ్లు చర్చికి రావాలని శిక్ష
ఒక్లహామాలో ఒక హైస్కూల్ విద్యార్థికి ఒక వ్యక్తి మరణానికి కారణమైనందుకు దోషిగా నిర్ధారించారు. కానీ అతడు జైలుకెళ్లకుండా ఒక ఆష్షన్ ఇచ్చారు.
2011లో 17 ఏళ్ల టేలర్ ఎల్రెడ్ మద్యం మత్తులో కారు డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ చేశాడు. ఆ ప్రమాదంలో అతడి స్నేహితుడే చనిపోయాడు.
జైలుకు వెళ్లకుండా ఉండాలంటే, హైస్కూల్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలని ఆ విద్యార్థికి చెప్పారు.
ఒక ఏడాది పాటు డ్రగ్స్, మద్యం, నికోటిన్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుందని, మృతుడి కోసం ఏర్పాటు చేసిన ప్యానల్‌లో భాగం కావాల్సి ఉంటుందని సూచించారు.
పదేళ్ల వరకూ చర్చికి రావాలని ఎల్రెడ్‌కు వింత శిక్ష విధించారు.

ఉద్యోగం వెతుక్కోవాలని శిక్ష
స్పెయిన్‌లో ఎండాలుసియాలోని అమ్మనాన్నలు పాకెట్ మనీ ఇవ్వడం ఆపేశారని ఒక యువకుడు కోర్టుకు వెళ్లాడు.
అమ్మనాన్నలు తనకు నెలకు 355 పౌండ్లు ఇవ్వాలని అతడు డిమాండ్ చేశాడు.
కానీ, మలాగాలోని ఒక ఫ్యామిలీ కోర్టు ఆ యువకుడికే వింత శిక్ష విధించింది. అతడు 30 రోజుల్లో అమ్మనాన్నలతో ఉంటున్న ఇల్లు వదిలి వెళ్లిపోవాలని, తన కాళ్లపై తాను నిలబడడం నేర్చుకోవాలని తీర్పు ఇచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
శాస్త్రీయ సంగీతం వినాలని శిక్ష
కారులో చెవులు పగిలిపోయేంత గట్టిగా మ్యూజిక్ పెట్టుకున్నాడనే ఆరోపణలు రావడంతో 2008లో ఆండ్రూ వెక్టర్ అనే వ్యక్తికి 120 పౌండ్ల జరిమానా విధించారు.
ఆ సమయంలో వెక్టర్ తనకు ఇష్టమైన ర్యాప్ మ్యూజిక్ వింటున్నారు.
జడ్జి ఆ జరిమానాను 30 పౌండ్లకు తగ్గిస్తానని చెప్పారు. బదులుగా అతడు 20 గంటలపాటు బీథోవిన్, బాఖ్, షోపెన్ శాస్త్రీయ సంగీతం వినాలని తీర్పు ఇచ్చారు.
ఆ జడ్జి ఇష్టం లేని సంగీతం వింటే ఎలా ఉంటుందో వెక్టర్‌కు తెలిసేలా చేయాలనుకున్నారు.
కానీ వెక్టర్ ఆ శాస్త్రీయ సంగీతం 15 నిమిషాలు మాత్రమే వినగలిగాడు.
తర్వాత బాస్కెట్ బాల్ ప్రాక్టీస్ వదలుకోవడం తనకు ఇష్టం లేదని, అందుకే ఆ సంగీతం వినలేకపోయానని చెప్పుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
- రాయలసీమ కరవు: అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు కథ
- ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి కాంగ్రెస్తో పొత్తు ఉంటుందా, ఉండదా
- భారత్లో పెరుగుతున్న పోర్న్ వీక్షణ
- కేసీఆర్ ప్రధాని అవుతారా?
- టీఆర్ఎస్ ప్రస్థానం: పోరు నుంచి పాలన వరకు కారు జోరు
- కోడి పందేలు: వ్యాపారంగా, ఉపాధి మార్గంగా కోడి పుంజుల పెంపకం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








