గే సెక్స్ సన్నివేశాలు రాసినందుకు చైనా శృంగార రచయిత్రికి 10 ఏళ్ళ జైలు శిక్ష

చైనా రచయిత

ఫొటో సోర్స్, iStock

ఫొటో క్యాప్షన్, పురుషుల స్వ లింగ సంపర్కం గురించిన సన్నివేశాలే కాకుండా లైంగిక విపరీత ధోరణులు కూడా ఈ రచనలో ఉన్నాయన్నది ఆరోపణ

గే సెక్స్ సన్నివేశాలతో నవల రాసినందుకు చైనా రచయిత్రి లీవోకు అక్కడి కోర్టు పదేళ్ళ జైలు శిక్ష విధించింది.

అన్హూయీ ప్రావిన్స్‌లోని న్యాయస్థానం ఆమెను "అశ్లీల సాహిత్యాన్ని" రాసి, పంపిణీ చేసిన నేరానికి గత నెలలో జైల్లో పెట్టింది.

"ఆక్యుపేషన్" అనే పేరుతో లీవో రాసిన నవలలో "పురుషుల స్వలింగ సంపర్కం, లైంగిక విపరీత ధోరణులకు సంబంధించిన, హింస, అనుచిత ప్రవర్తన" వంటి అంశాలున్నాయి.

అయితే, ఆమెకు మరీ పదేళ్ళ జైలు శిక్ష విధించడం ఏమిటంటూ సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

బీజింగ్ న్యూస్ వివరాల ప్రకారం, ఆన్‌లైన్‌లో టియాన్ యీగా సుపరిచితురాలైన లీవో తనకు విధించిన జైలు శిక్షను సవాలు చేస్తూ అపీలు చేసుకున్నారు.

చైనాలో పోర్నోగ్రఫీ చట్టవిరుద్ధం.

'మరీ ఎక్కువ'

వూహూ స్థానిక వార్తల వెబ్‌సైట్ కథనం ప్రకారం, లాభార్జన కోసం "అశ్లీల సాహిత్యం" రాసి, పంపిణీ చేసిన నేరానికి పీపుల్స్ కోర్ట్ ఆఫ్ వూహూ అక్టోబర్ 31న జైలు శిక్ష విధించింది.

అయితే, చైనా మీడియాలో ఈ కేసు విచారణకు సంబంధించిన వార్తలు ఈ వారమే వెలుగు చూశాయి.

ఆన్‌లైన్లో ఆమె నవలకు ప్రాచుర్యం బాగా పెరిగిపోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

'ఆక్యుపేషన్'తో పాటు మరికొన్ని శృంగార నవలల ప్రతులను 7,000కు పైగా విక్రయించి 21,000 డాలర్లకు పైగా లాభాన్ని ఆర్జించినట్లు స్థానిక గ్లోబల్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.

అయితే, ఆమెకు మరీ ఎక్కువ కాలం శిక్ష విధించారని సోషల్ మీడియా యూజర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

" ఒక నవలకు 10 ఏళ్ళ జైలు శిక్షా? ఇది మరీ ఎక్కువ" అని ఒక సోషల్ మీడియా యూజర్ వైబో సైట్లో వ్యాఖ్యానించారు.

మరొక యూజర్ కూడా, "అత్యాచారానికి పాల్పడిన నేరస్థుడికి 10 ఏళ్ళ కన్నా తక్కువ జైలు శిక్ష పడుతుంది. ఒక రచయితకేమో 10 ఏళ్ళ జైలా?" అని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)