‘గూగుల్ ప్లస్’ మూసివేత.. డాటా లీకేజీతో నిర్ణయం

గూగుల్ ప్లస్

ఫొటో సోర్స్, Getty Images

గూగుల్ తన సోషల్ నెట్‌వర్క్ గూగుల్ ప్లస్ (Google+)ని మూసివేయబోతోంది. యూజర్ల సమాచారం బహిర్గతమవటంతో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.

గూగుల్ ప్లస్ యూజర్ల ప్రైవేటు సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకు ఉద్దేశించిన సాఫ్ట్‌వేర్‌లో లోపం వల్ల.. ఆ సమాచారాన్ని థర్డ్ పార్టీలు కూడా పొందగలుగుతున్నారని చెప్తున్నారు.

దాదాపు 5,00,000 మంది యూజర్లు దీనివల్ల ప్రభావితులయ్యారని గూగుల్ వెల్లడించింది.

వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. ఈ విషయం గూగుల్ కంపెనీకి మార్చిలోనే తెలిసినా ఇంతవరకు బహిర్గతం చేయలేదు.

అలా చేసినట్లయితే ‘‘తక్షణమే నియంత్రణ దృష్టిలో’’ పడతామని గూగుల్ అంతర్గత మెమోలో పేర్కొన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఉటంకించింది.

గూగుల్ ప్లస్

ఫొటో సోర్స్, Getty Images

అయితే.. ఈ అంశం ప్రజలకు తెలియజేసేటంత సీరియస్ సమస్య కాదని గూగుల్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది.

‘‘ఈ అంశాన్ని మా ప్రైవసీ అండ్ డాటా ప్రొటెక్షన్ ఆఫీస్ సమీక్షించింది. ఇందులో ఇమిడివున్న సమాచారం ఎలాంటిది, యూజర్లకు సమాచారం ఇవ్వటానికి ఖచ్చితంగా గుర్తించగలమా, దుర్వినియోగమైనట్లు ఏదైనా ఆధారం ఉందా తదితర అంశాలను పరిశీలించింది. ఇవేవీ సమీక్షలో తేలలేదు’’ అని వివరించింది.

విఫల ప్రయోగం

ఫేస్‌బుక్‌కు పోటీగా 2011లో గూగుల్ ప్లస్‌ని ప్రారంభించారు. అది వెంటనే విఫల ప్రయత్నమని తేలిపోయింది.

దీనిని మూసివేస్తారని కొన్నేళ్లుగా సాగిన ఊహాగానాల అనంతరం ఇప్పుడు గూగుల్ ప్లస్‌కు తెరపడనుంది.

గూగుల్ ప్లస్

ఫొటో సోర్స్, Getty Images

అయితే.. ఈ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగిస్తున్న వాణిజ్య సంస్థలకు ప్రైవేటు గూగుల్ ప్లస్ నెట్‌వర్క్‌ను కొనసాగిస్తామని సంస్థ తెలిపింది.

గూగుల్ ప్లస్ వినియోగ సమాచారాన్ని వెల్లడించటానికి ఈ సంస్థ గతంలో అంగీకరించలేదు. అయితే.. ఇప్పుడు డాటా లీక్ వివాదం నేపథ్యంలో దీని ప్రాధాన్యాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

‘‘గూగుల్ ప్లస్ కన్జూమర్ వెర్షన్ వినియోగం తక్కువగా ఉంది. గూగుల్ ప్లస్ యూజర్ల సెషన్లలో 90 శాతం ఐదు సెకన్లకన్నా తక్కువే ఉన్నాయి’’ అని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ బెన్ స్మిత్ సోమవారం ఒక బ్లాగ్‌లో పేర్కొన్నారు.

ఈ పరిణామం నేపథ్యంలో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబె షేర్ల విలువ 1.23 శాతం పడిపోయింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)