ఇండోనేసియా సునామీ: చర్చిలో 34 మంది విద్యార్థుల మృతదేహాలు

ఫొటో సోర్స్, Reuters
భూపంకం, సునామీలు సృష్టించిన విధ్వంసంతో చిన్నాభిన్నమైన ఇండోనేసియాలోని పాలూ నగరంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి.
ప్రకృతి విపత్తుతో సర్వం కోల్పోయిన నిరాశ్రయులు సాయం కోసం చూసిచూసి తీవ్ర నిరాశతో సహనం కోల్పోతున్నారు.
రోడ్లన్నీ దెబ్బతినడంతో నగరంలో ఆహారం, మంచినీళ్లు, ఇంధన కొరత తీవ్రమైంది. దాంతో దుకాణాల్లోంచి నిత్యావసర వస్తువులను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
పాలు నగరంలో ఓ చిన్న దుకాణానాన్ని లూటీ చేసేందుకు ప్రయత్నించి జనాలను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు, టియర్ గ్యాస్ ప్రయోగించినట్లు బీబీసీ ప్రతినిధి జొనాథన్ హెడ్ చూశారు. కొందరు పోలీసుల మీదకు రాళ్లు రువ్వారు.
మారుమూల ప్రాంతాలకు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
చర్చిలో 34 మంది విద్యార్థుల మృతదేహాలు
భారీ భూకంపం వల్ల కొండచరియలు విరిగిపడటంతో బురదలో కూరుకుపోయిన ఓ చర్చిలో 34 మంది విద్యార్థుల మృత దేహాలను గుర్తించినట్టు సహాయక సిబ్బంది తెలిపారు.
సిగి జిల్లాలో ఆ విద్యార్థుల మృతదేహాలను గుర్తించారు. ఈ జిల్లాలో శుక్రవారం రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో భూకంపం, సునామీ సంభవించాయి.
ఆ శవాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామని సహాయక సిబ్బంది బీబీసీతో చెప్పారు.
"అక్కడ బురద భారీగా పేరుకుపోయింది. ఆ ప్రమాద స్థలానికి చేరుకునేందుకు మేము గంటన్నర సేపు బురదలో నడవాల్సి వస్తోంది. దాంతో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందికరంగా మారింది" అని ఇండోనేసియా రెడ్ క్రాస్ సంస్థ అధికార ప్రతినిధి రిద్వాన్ సోబ్రి బీబీసీకి వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఇండోనేసియాలో శుక్రవారం సంభవించిన భారీ భూకంపం, సునామీ కారణంగా 844 మంది చనిపోయినట్టు గుర్తించారు. మారుమూల ప్రాంతాల్లో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
పెద్ద ఎత్తున నిర్మాణాలు ధ్వంసం కావడం, అప్పుడప్పుడు ప్రకంపనలు వస్తుండటం వల్ల సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి.
శిథిలాల కింద ఇంకా కొందరు క్షతగాత్రులు ఉండి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చర్చిలో చనిపోయిన విద్యార్థుల వివరాలను ఇంకా నిర్ధారించాల్సి ఉందన్నారు.
ఏఎఫ్‌పీ వార్తా సంస్థ కథనం ప్రకారం, సిగి బిరోమారు ప్రాంతంలోని చర్చి శిక్షణా కేంద్రానికి చెందిన 86 మంది విద్యార్థులు గల్లంతయ్యారు. అయితే, ఇప్పుడు గుర్తించిన మృతదేహాలు అదే బృందానికి చెందిన విద్యార్థులవేనా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
రోడ్లు, విమానాశ్రయం, సమాచార వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాంతో మారుమూల ప్రాంతాల్లో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బంది అవుతోంది.
ఆస్పత్రులు ధ్వంసం కావడంతో ఆరుబయటే క్షతగాత్రులకు వైద్యం అందిస్తున్నారు, మరో చోట మిలిటరీ ప్రాంగణంలో ఓ ఆస్పత్రి ఏర్పాటు చేశారు.
దాదాపు 300 మృతదేహాలను ఒకేచోట ఖననం చేసేందుకు భారీ గోతిని తవ్వుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- లక్ష్మీకుట్టీ అమ్మ: ‘విషానికి విరుగుడు ఈ బామ్మ నాటువైద్యం’
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
- గాంధీజీ 150వ జయంతి: మహాత్ముడి గురించి ఆయన వారసులు ఏమంటున్నారు?
- ఈ ఉద్యోగాలు కొన్నాళ్లు సేఫ్
- ఎన్నికల ముందు ఇచ్చే ఉద్యోగ హామీలు తీరవెందుకు?
- డ్రెస్‌కోడ్.. వారానికోసారి బట్టల్లేకుండా!
- మూడీస్ రేటింగ్‌తో మోదీ ప్రతిష్ఠ పెరుగుతుందా?
- ఇంటర్వ్యూకు వెళ్తున్నారా? ఈ ఐదు విషయాలు గుర్తుంచుకోండి!
- మహిళల ఉద్యోగాలను ఆటోమేషన్ మింగేస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








