బీబీసీ లైబ్రరీ: గ్రాఫిక్స్ లేని కాలంలో... బొమ్మలతో విజువల్ ఎఫెక్ట్స్ ఇలా చేసేవారు...

సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకుల్ని అబ్బురపరిచేందుకు ఏటా వందల కోట్లు ఖర్చుచేస్తుంటారు. కానీ పూర్తిస్థాయి డిజిటల్ శకంలోకి ప్రవేశించడానికి ముందు ప్రొడక్షన్ టీంలు వీలైనంత తక్కువ వ్యయంలోనే అవసరమైన వనరుల్ని సమకూర్చుకోవాల్సి వచ్చేది.
1970ల్లో బీబీసీ సైన్స్ ఫిక్షన్ ప్రొడక్షన్ ఎలా ఉండేదో ఈ ఆర్కైవ్స్ వీడియో చూపిస్తోంది.
చంద్రునిపై మనిషి అప్పటికే కాలుమోపిన రోజులవి. విశ్వం ఆవల ఏముందో తెలుసుకోవాలన్న ఉత్సుకత పెరుగుతున్న సమయం.
బుల్లితెరపై సైన్స్ ఫిక్షన్‌ను ప్రేక్షకులు చాలా ఆసక్తిగా చూస్తుండేవారు. అప్పట్లో అలాంటి షోల సెట్లన్నింటినీ ఎలా నిర్మించారో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది.
‘‘చంద్రుని మీద స్థావరాన్ని చూపించేటపుడు వివిధ రకాల నమూనాలను ఉపయోగించేవాళ్లం. అన్నిటికన్నా తేలికగా తయారుచేసిన నమూనా ఇది. చంద్రుడి మీద ఉండే ఈ బండికి సులభంగా తిరిగే చక్రాలున్నాయి. దీన్ని ఓ నైలాన్ దారంతో లాగొచ్చు’’ అని ఆనాటి బీబీసీ విజువల్ ఎఫెక్ట్స్ డిజైనర్ మాట్ ఇర్విన్ ఈ వీడియోలో తెలిపారు.
‘‘ఈ నమూనాలతో చేసే షూటింగ్‌లో ఒ కీలకమైన అంశం.. హైస్పీడ్ ఫిల్మింగ్. ఈ నమూనా వస్తువుల కదలికలు.. వాటి వాస్తవ రూపాలైన వస్తువుల కదలికలు వేర్వేరుగా ఉంటాయి. దీనిని అధిగమించటానికి మేం రెండు రెట్లు, మూడు రెట్లు వేగంతో ఒక్కోసారి అంతకన్నా ఎక్కువ వేగాన్ని ఉపయోగించి చిత్రీకరిస్తాం. చివరిగా మామూలు వేగంతో ఈ దృశ్యాలను ప్రదర్శించినప్పుడు అన్నీ సక్రమంగా వస్తాయి’’ అని ఆయన వివరించారు.

ఈ స్పేస్ మిషన్‌లో ఒక్కోసారి ఇంట్లో వాడే సాధారణ వస్తువులను కూడా ఉపయోగించారు. ఉదాహరణకు ఒక స్పేస్ క్రాఫ్ట్ ను రెండు హెయిర్ డ్రయర్లు ఉపయోగించి తయారు చేశారు.
చిన్న చిన్న చిట్కాలతో వీటిని రూపొందించినా ఇవి నిజమైనవిలా కనిపించేవి.
ప్రస్తుతం అనుసరిస్తున్న డిజిటల్ ప్రొడక్షన్ విధానాలతో పోలిస్తే ఈ చిన్న చిన్న వస్తువులు మన ఊహలను ప్రపంచం ఆవలికి నడిపించటం ఒక అద్భుతమే.
అసలైన అంతరిక్ష నౌకలతో పోలిస్తే.. ‘బిగ్ బ్యాంగ్’ ప్రభావాన్ని తెలుసుకునే క్రమంలో ధ్వంసం చేయటానికి ఇవి అంతటి ఖరీదైనవేం కాదు.
- గాంధీజీ 150వ జయంతి: మహాత్ముడి గురించి ఆయన వారసులు ఏమంటున్నారు?
- బిగ్ బాస్-2: ’’ఈక్వల్ గేమ్ ఎలా అవుతుంది‘‘- బాబు గోగినేని
- చరిత్ర: బ్రిటిష్ వలస పాలనలో ‘జాత్యహంకారం’.. కళ్లకు కడుతున్న ఫొటోలు
- పదహారేళ్లప్పుడు నన్ను రేప్ చేశారు... 32 ఏళ్లుగా బాధను భరిస్తూనే ఉన్నాను
- బిగ్ బాస్: పోటీదారులను ఎలా ఎంపిక చేస్తారు? నిబంధనలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









