ఇరాన్‌కు అణుబాంబు దొరక్కుండా చూడాలని ఐక్యరాజ్యసమితిని కోరిన ట్రంప్

డోనల్ట్ ట్రంప్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి అధ్యక్షత వహించిన ట్రంప్

ఇరాన్ దేశానికి ఎప్పటికీ అణుబాంబు దొరక్కుండా చేయాలని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సభ్యులను కోరారు.

సామూహిక మారణాయుధాల వ్యాప్తి నిరోధానికి సంబంధించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సదస్సుకు అధ్యక్షత వహించిన ట్రంప్, ఇరాన్ మీద మళ్ళీ ఆంక్షలను విధించడాన్ని సమర్థించుకున్నారు. ఆ దేశం "దుష్టబుద్ధి" అందుకు కారణం అని ఆయన అన్నారు.

మంగళవారం నాడు సర్వసభ్య సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, మధ్య ప్రాచ్యంలో హింస, విధ్వంసాలను ఇరాన్ ప్రేరేపిస్తోందని ఆరోపించారు.

సిరియా హింసకు ఇరాన్, రష్యాలే కారణం

ఇరాన్, రష్యా దేశాలు సిరియాలో మారణకాండకు "వీలు కల్పిస్తున్నాయి" అని ఆయన ఆరోపించారు.

అయితే, ఇడ్లిబ్‌లో తిరుగుబాటుదారుల మీద సాగుతున్న యుద్ధం నుంచి విరమించుకున్న మూడు దేశాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ బుధవారం నాడు భద్రతామండలికి అధ్యక్షత వహించారు. రొటేషన్ పద్ధతిన ప్రస్తుతం అమెరికా మండలికి అధ్యక్షత వహిస్తోంది.

అమెరికా-ఇరాన్ దేశాల మధ్య గత కొన్ని దశాబ్దాలుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కొనసాగుతున్నాయి. అందుకే, టెహ్రాన్‌ను విమర్శించేందుకు లభించే ఏ అవకాశాన్నీ ట్రంప్ వదులుకోలేదు.

థెరెసా మే, ఇమాన్యుయెల్ మాక్రన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయెల్ మాక్రన్, బ్రిటిష్ ప్రధానమంత్రి థెరెసా మే కూడా ఈ సదస్సులో ప్రసంగించారు.

"ఇరాన్ పాలకుల స్వభావం మారేలా భద్రతామండలిలోని అన్ని దేశాలు చర్యలు తీసుకోవాలి. ఆ దేశానికి ఎప్పటికీ అణుబాంబు అందకుండా చూసుకోవాలి" అని ట్రంప్ అన్నారు.

ప్రపంచ అగ్రదేశాలకు, ఇరాన్‌కు మధ్య కుదిరిన 2015 ఒప్పందం నుంచి అమెరికా వైదొలగిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఇరాన్ మీద అమెరికా కొత్త ఆంక్షలు విధించింది. ఆ చర్యతో అమెరికాకు, ఐరోపా దేశాలకు మధ్య దూరం బాగా పెరిగింది.

ఇప్పటికీ 2015 ఒప్పందాన్ని సమర్థిస్తున్న ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రన్, ఈ విషయంలో "దీర్ఘకాలిక వ్యూహం"తో ముందుకు వెళ్ళాలని సూచించారు.

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో చైనా జోక్యం...

ఇదే సందర్భంగా ట్రంప్ తన విమర్శనాస్త్రాలను చైనా మీదకు కూడా మళ్ళించారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో చైనా "జోక్యం" చేసుకుంటోందని, తమ రిపబ్లికన్ పార్టీ విజయాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని కూడా ట్రంప్ భద్రతామండలి సదస్సులో ఆరోపించారు.

ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, అమెరికా బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శించిన ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ

ఇరాన్ ఏమంటోంది?

ఇరాన్ ప్రస్తుతం భద్రతామండలిలో సభ్య దేశం కాదు. అందుకే, అది ఈ సదస్సుకు హాజరు కాలేదు. కానీ, మంగళవారం నాడు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ట్రంప్ చేసిన తీవ్రమైన విమర్శలకు ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ఘాటుగా స్పందించారు. ఆయన సర్వసభ్య సమావేశంలో బదులిస్తూ, "అన్యాయమైన ఆంక్షలు", బెదిరింపులకు ముగింపు పలకడం ద్వారానే చర్చలు ప్రారంభం కావాలని అన్నారు. అమెరికా 'దాదాగిరి' చలాయిస్తోందని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

ఇజ్రాయెల్ గురించి ట్రంప్ ఏమన్నారు?

బుధవారం నాడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో సమావేశమైన ట్రంప్, "ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల సమస్యకు 'రెండు-దేశాల' పరిష్కారమే మేలైన మార్గమని భావిస్తున్నా"నని అన్నారు.

అధ్యక్షుడిగా తొలి విడత పదవీకాలం పూర్తయ్యేలోగా శాంతి ప్రణాళికను అమలు చేయాలన్నది తన 'కల' అని ట్రంప్ అన్నారు.

గతంలో కూడా ట్రంప్ ప్రభుత్వం, ఇరు వర్గాలకు అంగీకారమైతే రెండు-దేశాల పరిష్కారానికి తాము మద్దతు ఇస్తామని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)