2013 ఈజిప్ట్ నిరసనలు: 75 మందికి మరణ శిక్ష

ఫొటో సోర్స్, Getty Images
ఈజిప్ట్‌లో 2013లో అప్పటి అధ్యక్షుడు మహ్మద్ మోర్సీని సైనిక తిరుగుబాటుతో పదవీచ్యుతుడిని చేసిన తరువాత చోటుచేసుకున్న నిరసనలు, అల్లర్లకు సంబంధించి పలువురు ముస్లిం నేతలు సహా 75 మందికి అక్కడి న్యాయస్థానం మరణ శిక్ష ఖరారు చేసింది.. మరో 47 మందికి యావజ్జీవ ఖైదు విధించింది.
ఇది రాజ్యాంగ విరుద్ధమని, అసమంజసమని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది.
ఈజిప్ట్ రాజధాని కైరోలోని రబా అల్ అదావియా స్క్వేర్ వద్ద 2013 ఆగస్ట్‌లో జరిగిన నిరసనల సమయంలో హింస చెలరేగగా భద్రతాదళాలు కాల్పులు జరిపాయి. ఆ హింస, కాల్పుల్లో వందలాది మంది మరణించారు.
రబా కేసుగా పిలిచే ఈ కేసులో 700 మందికి పైగా విచారణను ఎదుర్కొన్నారు.
రబా కేసు, ఆ తరువాత 2013 జులై నుంచి 2016 జనవరి మధ్య ఘటనలకు సంబంధించి సైనికాధికారులపై కేసుల్లేకుండా ఈజిప్ట్ పార్లమెంట్ చట్టపరమైన రక్షణ కల్పిస్తూ ఈ ఏడాది ప్రారంభంలో నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడు శిక్షలు పడినవారిలో అత్యధికులపై భద్రతకు భంగం కలిగించడం, హింసా ప్రజ్వలన, హత్య, చట్టవ్యతిరేకంగా నిరసనలు చేపట్టడం వంటి అభియోగాలు నమోదు చేశారు.
కాగా జులైలోనే 75 మంది మరణ శిక్షలు వేయగా తాజా తీర్పులో వాటిని ఖరారు చేశారు. మిగతావారికీ శిక్షలు విధించడంతో ఈ సామూహిక విచారణ ముగిసినట్లయింది.

ఫొటో సోర్స్, EPA
ప్రస్తుతం నిషేధం ఎదుర్కొంటున్న ముస్లిం బ్రదర్‌హుడ్ సంస్థకు చెందిన కీలక నేతలు, రాజకీయ నాయకులతో పాటు ఆ సంస్థ అధినేత మొహమ్మద్ బేదీకి యావజ్జీవ ఖైదు ఖరారు చేశారు.
ఈ కేసులో షాకాన్‌గా అందరికీ సుపరిచుతుడైన ఫోటో జర్నలిస్ట్ మహమూద్ అబూ జీద్‌కు అయిదేళ్ల జైలు శిక్ష పడింది.
ప్రదర్శనకారులను చెదరగొడుతున్న సమయంలో ఫొటోలు తీస్తున్న ఆయన్ను కూడా అప్పట్లో నిర్బంధించారు. ఇప్పటికే అయిదేళ్లుగా జైలులో ఉండడంతో ఆయన్ను ప్రస్తుతం విడిచిపెట్టొచ్చని భావిస్తున్నారు.
2013లో అప్పటి అధ్యక్షుడు మోర్సీని.. ప్రస్తుత అధ్యక్షుడు, అప్పటి సైన్యాధ్యక్షుడు అయిన అబ్దెల్ ఫతా అల్ సిసీ సైనిక తిరుగుబాటు చేసి తొలగించిన తరువాత నిరసనలు మొదలయ్యాయి. మోర్సీకి అనుకూలంగా ప్రజలు ఆందోళనలు చేశారు.
ఈ సందర్భంగా 817 మంది ప్రదర్శనకారులను ఈజిప్ట్ భద్రతాదళాలు కాల్చి చంపాయని హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ ఆరోపించింది.
ఈజిప్ట్ ప్రభుత్వం మాత్రం.. నిరసనకారుల్లో చాలామంది సాయుధులున్నారని.. ఈ ఆందోళనల్లో 43 మంది పోలీసులు మరణించారని చెబుతోంది. ఆ కారణంగానే ముస్లిం బ్రదర్‌హుడ్ సంస్థను 'ఉగ్రవాద సంస్థ'గా ప్రకటించామని ఈజిప్ట్ ప్రభుత్వం అంటోంది.
ఇవి కూడా చదవండి
- బ్యాగరి మహిళలు: శవాల మధ్య బతుకు పోరాటం
- కేరళ వరదలు: ఈ పెను విపత్తుకు కారణాలేమిటి?
- కొరియా కుటుంబాలు: 60 ఏళ్ల కిందట యుద్ధంతో విడిపోయారు.. ఇప్పుడు కలుస్తున్నారు
- ‘ఇండియాలోని భారతీయులకంటే బ్రిటన్‌లోని భారతీయులే సంప్రదాయబద్ధంగా జీవిస్తున్నారు’
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








