గ్వాటెమాలా అగ్నిపర్వతం పేలుడు: విమాన వేగంతో లావా ప్రవాహం.. 75 మంది మృతి

ఫొటో సోర్స్, Reuters
మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలాలో ఆదివారం ఫ్యూగో అగ్నిపర్వతం బద్దలైన ఘటనలో వెలువడిన లావా విమాన వేగంతో ప్రవహించింది. ఈ ప్రవాహ మార్గంలో ఎవరున్నా తప్పించుకునే అవకాశం దాదాపు ఉండదు.
ఫ్యూగో బద్దలయ్యాక వేడివాయువు, అగ్నిపర్వతంలోని పదార్థాలతో నిండిన, శర వేగంగా కదిలే ప్రవాహాలు ఏర్పడ్డాయి. అగ్ని పర్వతానికి దగ్గర్లోని ఎల్‌రోడియో, శాన్ మిగుయెల్ లాస్ లోటెస్, ఇతర ప్రాంతాలను ఇవి ముంచెత్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ప్రవాహాల వేగం గరిష్ఠంగా గంటకు 700 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది సుదూర గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణ విమానాల వేగంతో సమానం.
ఈ ప్రవాహాలను 'పైరోక్లాస్టిక్ ఫ్లోస్' అంటారు. ఈ ప్రవాహాల్లో వాయువు, శిలల ఉష్ణోగ్రతలు 200 డిగ్రీల సెల్సియస్ నుంచి 700 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి.
మంగళవారం మళ్లీ వెలువడిన వేడివాయువులు
ఫ్యూగో పేలుడుతో ఇప్పటివరకు 75 మంది చనిపోయారు. మరో 192 మంది ఆచూకీ తెలియడం లేదు.
అగ్నిపర్వతానికి దగ్గర్లో ఉన్న గ్రామాలు అందులోంచి వెలువడిన బూడిద, బురదలో కూరుకుపోయాయి.
మంగళవారం సహాయ చర్యలు కొనసాగుతుండగా అగ్నిపర్వతంలోంచి వేడి వాయువులు వెలువడ్డాయి.
అగ్నిపర్వతం దక్షిణం వైపున కరిగిన శిలల ప్రవాహాలు కనిపించాయి.

ఫొటో సోర్స్, Reuters
పది కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన బూడిద
ఆదివారం అగ్నిపర్వతం బద్దలైనప్పుడు బూడిద ఆకాశంలో పది కిలోమీటర్ల (33 వేల అడుగుల) ఎత్తు వరకు వెళ్లింది. సమీప భవిష్యత్తులో మళ్లీ పేలుడు ఉండదని అగ్నిపర్వతాల పరిశోధకులు అప్పుడు చెప్పారు. అయినా మంగళవారం మళ్లీ పేలుడు సంభవించడంతో చాలా మంది విస్మయం చెందారు.
అగ్నిపర్వతం బద్దలు కావడం 17 లక్షల మందికి పైగా ప్రజలపై ప్రభావం చూపింది. మూడు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కుటుంబ సభ్యులందరినీ కోల్పోయిన బాధితులు ఎంతో మంది ఉన్నారు.
ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా అప్రమత్తం చేసే హెచ్చరికలేవీ ఆదివారం అగ్నిపర్వతం బద్దలుకావడానికి ముందు జారీచేయలేదని గ్వాటెమాలా విపత్తు సహాయ సంస్థ సారథి సెర్జియో కాబనాస్‌ను ఉటంకిస్తూ ఏఎఫ్‌పీ వార్తాసంస్థ తెలిపింది.
అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలో స్థానికులకు శిక్షణ ఇచ్చామని, కానీ అగ్నిపర్వతం బద్దలైన తర్వాత స్పందించేందుకు వారికి తగినంత సమయం లేకపోయిందని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









