కర్నూలులో కొత్త ఐడియా: ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద చలువ పందిళ్లు

ఫొటో సోర్స్, DL Narasimha
- రచయిత, డీఎల్ నరసింహ
- హోదా, బీబీసీ కోసం
తెలుగు రాష్ట్రాల్లోఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే జనం భయపడి పోతున్నారు. ఎండకు ఒక్క నిమిషం కూడా రోడ్డుపై నిలబడే పరిస్థితి లేదు.
ఇక ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. మండుటెండలో నరకయాతన అనుభవించాల్సిందే.
దీన్ని దృష్టిలో ఉంచుకొని కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఓ వినూత్నమైన ఆలోచన చేసింది. బాగా రద్దీగా ఉన్న కూడళ్ల దగ్గర వాహనదారులకు ఎండ తగలకుండా షేడ్ నెట్స్‌తో పందిళ్లను ఏర్పాటు చేసింది.
మండుటెండలో వెళ్లే వాహనదారులు సిగ్నల్స్ దగ్గరకు రాగానే కాస్త సేద దీరుతున్నారు. పందిళ్ల నీడలో వారికి కాసేపు ఊరట లభిస్తోంది.
తీవ్రమైన ఎండలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చూసేందుకు సామాజిక బాధ్యతతో ఈ పందిళ్లను ఏర్పాటు చేసినట్టు పురపాలక సంస్థ కమిషనర్ హరినాధరెడ్డి తెలిపారు.
రద్దీగా ఉండే కలెక్టర్ కార్యాలయం వద్ద మెుదట ఈ పందిళ్లను ఏర్పాటు చేశామని, ప్రజల నుంచి మంచి స్పందన ఉండటంతో పురపాలక సంస్థ కార్యాలయం ముందు, ప్రధాన ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, DL Narasimha
ఈ పందిళ్లు చాల ఉపయోగకరంగా ఉన్నాయని, ఎండ వేడిమి నుంచి కొంత ఉపశమనం కలిగిస్తున్నాయని వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మంచి ఉద్దేశ్యంతో ప్రజలకు ఉపయోగకరమైన పందిళ్లను ఏర్పాటు చేయటం అభినందనీయమని సంజీవరెడ్డి అనే వాహనదారుడు అన్నారు.
రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో కూడా ప్రభుత్వం ఇలా పందిళ్లను ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









