ఏ వార్త రాసినందుకు 'ద న్యూయార్క్ టైమ్స్', 'న్యూయార్కర్'లకు పులిత్జర్ పురస్కారం దక్కింది?

ఫొటో సోర్స్, AFP/GETTY
ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్‌స్టీన్ వెల్లువెత్తిన లైంగిక వేధింపుల ఆరోపణలపై రిపోర్టింగ్ చేసినందుకు గాను 'ద న్యూయార్క్ టైమ్స్', 'న్యూయార్కర్' పత్రికలు సంయుక్తంగా ఈ యేడాది పులిత్జర్ పురస్కారం గెల్చుకున్నాయి.
హాలీవుడ్ సినీ సామ్రాజ్యంలో అగ్రస్థానంలో ఉన్న హార్వే వైన్‌స్టీన్‌పై అనేక మంది మహిళలు, నటీమణులు లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణలు చేశారు.
దాంతో, సినీ పరిశ్రమల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా #MeToo పేరుతో పెద్ద ఉద్యమమే నడిచింది. ప్రపంచవ్యాప్తంగా వేల మంది మహిళలు బయటకు వచ్చి తమకు ఎదురైన లైంగిక వేధింపులపై గళమెత్తారు.
ఏంజెలినా జోలీ, రోస్ మెక్‌గోవన్, గ్వెనెత్ పాల్త్రోలు సహా డజన్ల సంఖ్యలో నటీమణులు వైన్‌స్టీన్ మీద ఆరోపణలు చేశారు.
అయితే, తాను వారి ఆమోదంతోనే సెక్స్ చేశానని వైన్‌స్టీన్ వాదిస్తూ వచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో పాత్రికేయ రంగంలో ఇచ్చే పురస్కారాల్లో పులిత్జర్ అత్యంత ప్రతిష్ఠాత్మకమైందిగా భావిస్తారు.
మీడియాతో పాటు, సాహిత్యం, కళలు రంగాల్లోనూ పులిత్జర్ ప్రైజెస్ బోర్డు అవార్డులు ప్రకటించింది.
అలబామాకు చెందిన సెనేట్ అభ్యర్థి రాయ్ మూరేపై కొన్ని దశాబ్దాల కింద వచ్చిన లైంగిక ఆరోపణలను బహిర్గతం చేసినందుకు వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ ప్రైజ్ దక్కింది.
ఓ టీనేజీ అమ్మాయితో మూరే అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు వచ్చాయి. ఆయన మాత్రం వాటిని తోసిపుచ్చారు.
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణలపై రిపోర్టింగ్ చేసిన ది న్యూయార్క్ టైమ్స్‌కు కూడా ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ ప్రైజ్ లభించింది.

ఫొటో సోర్స్, Reuters
మాదక ద్రవ్యాల దందాపై ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో ఉక్కుపాదం మోపడం గురించి కథనాలు అందించినందుకు వార్తా సంస్థ రాయిటర్స్‌కు మరో పులిత్జర్ పురస్కారం దక్కింది.
రోహింజ్యా సంక్షోభాన్ని కవర్ చేసినందుకు ఉత్తమ ఫొటోగ్రఫీ విభాగంలో రాయిటర్స్‌కు మరో అవార్డు వచ్చింది.
1917 నుంచి పులిత్జర్ పురస్కారాలు ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








