అభిప్రాయం: తొగాడియాను సాగనంపటానికి కారణాలేంటి? సంఘ్, మోదీల లక్ష్యం ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అఖిలేష్ శర్మ
- హోదా, రాజకీయ వ్యవహారాల సంపాదకుడు, ఎన్‌డీటీవీ ఇండియా
దిల్లీని ఆనుకొని ఉన్న గురుగ్రామ్ నుంచి వచ్చిన ఆ చిత్రాలు ఆందోళనకరంగా ఉన్నాయి. భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ అక్కడ ఓ ఎన్నిక జరిగింది.
ఎన్నికలకు భద్రతా ఏర్పాట్లు మామూలే కానీ అక్కడ జరిగిన ఎన్నిక వినూత్నమైంది. అందుకే భద్రతా ఏర్పాట్లు కూడా దానికి తగినట్టుగానే చేశారు.
53 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారి విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ అధ్యక్ష పదవికి ఓటింగ్ జరిగింది. అలా ఎందుకు జరిగిందో తెలియాలంటే దాని వెనకున్న కథను అర్థం చేసుకోవడం చాలా అవసరం.
ఈ వివాదమంతా వీహెచ్‌పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తొగాడియాతో మొదలైంది. తొగాడియా, నరేంద్ర మోదీల మధ్య వైరం గురించి అందరికీ తెలిసిందే.
ఒకానొక కాలంలో ఈ ఇద్దరు నేతలు కలిసి పనిచేశారు. కానీ క్రమక్రమంగా ఇద్దరి మధ్య సంబంధాలు చెడిపోతూ వచ్చాయి.

ఫొటో సోర్స్, SAM PANTHAKY/AFP/Getty Images
తొగాడియా ఆరోపణలు
వీరి మధ్య విభేదాలు ఎంతగా ముదిరిపోయాయంటే, గుజరాత్, రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వాలు తనను హత్య చేసేందుకు కుట్ర పన్నాయని తొగాడియా ఇటీవలే ఆరోపణలు చేశారు.
తర్వాత ఆయన చాలా నాటకీయంగా అదృశ్యమయ్యారు. మళ్లీ అంతే నాటకీయంగా ఒక ఆసుపత్రిలో ప్రత్యక్షమయ్యారు. ఇదంతా ఆయన కావాలని చేసిన డ్రామా అని తెలిసిన వాళ్లంటారు.
అంతకు ముందు గుజరాత్ ఎన్నికల్లో కూడా ఆయన పాత్రపై సంఘ్ పరివార్‌లో అనేక మంది సందేహాలు వ్యక్తం చేశారు.
పటేల్ ఉద్యమాన్ని రెచ్చగొట్టడంలో తొగాడియా క్రియాశీలక పాత్ర పోషించారని కూడా ఆరోపణలున్నాయి. ఎన్నికల సమయంలో ఆయనకు సంబంధించిన అనేక వీడియోలు వాట్సాప్‌లో చక్కర్లు కొట్టాయి.
అయితే ఏప్రిల్ 9న ఆయన నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ వీటన్నింటికీ పరాకాష్ఠ అని చెప్పొచ్చు. ఆ కాన్ఫరెన్స్‌లో బీజేపీ రామమందిర నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు.

ఫొటో సోర్స్, VHP
వీహెచ్‌పీ అధ్యక్ష పదవికి ఎన్నిక అందుకే
అయోధ్యలో బీజేపీ రామమందిరానికి బదులు మసీదును నిర్మించొచ్చని కూడా ఆయన ఆ సందర్భంగా అన్నారు.
ఆ తర్వాతే ఇక తొగాడియా వీహెచ్‌పీలో కొనసాగడం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చినట్టు సంఘ్ వర్గాలు తెలిపాయి.
14 ఏప్రిల్ ఎన్నికకు స్క్రిప్ట్ ఈ ప్రెస్ మీట్ తర్వాతే సిద్ధమైంది.
అయితే తొగాడియా దీన్ని పసిగట్టారు. వీహెచ్‌పీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగబోతోందని ఆయనకు అర్థమైంది.
వాస్తవానికి, ఇప్పటి వరకూ వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడిగా ఉన్న రాఘవరెడ్డి తొగాడియాకు దగ్గరి వాడని భావిస్తారు.
కార్యనిర్వాహక అధ్యక్షుడినీ, ఇతర కార్యవర్గ సభ్యులనూ అంతర్జాతీయ అధ్యక్షుడే నియమిస్తారు.

ఫొటో సోర్స్, SANJAY KANOJIA/AFP/Getty Images
సంఘ్ పథకం
అందుకే, రాఘవరెడ్డి స్థానంలో మరెవ్వరినైనా అంతర్జాతీయ అధ్యక్షుడిగా నియమించాలనే పథకం రూపొందించారు.
అప్పటికప్పుడు వీహెచ్‌పీ అధ్యక్ష ఎన్నికల సంఘం జాబితాను తయారు చేశారు. అందరినీ రమ్మని పిలిచారు. ఇందులో కొందరు అంతర్జాతీయ ఓటర్లు కూడా ఉన్నారు.
అయితే ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని తొగాడియా ఆరోపించారు. ఆర్‌కే పురంలో ఉన్న వీహెచ్‌పీ కార్యాలయం వద్ద ఆయన తన మద్దతుదారులతో కలిసి గొడవకు దిగారు.
ఈ సందర్భంగా పరస్పరం కొట్టుకున్నారని కూడా ఫిర్యాదులొచ్చాయి.
ఈ ఘటన తర్వాతే ఏప్రిల్ 14వ తేదీ శనివారం నాడు పోలింగ్ సందర్భంగా భద్రత కట్టుదిట్టం చేశారు. దాంతో ఫలితం సంఘ్ ఆశించినట్టుగానే వచ్చింది.
హిమాచల్‌ప్రదేశ్ మాజీ గవర్నర్, మాజీ జడ్జి జస్టిస్ విష్ణు సదాశివ్ కోక్జే ఎన్నికైనట్టుగా ప్రకటించారు.

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/AFP/Getty Images
ఇక తొగాడియా ‘యుద్ధం’ మొదలైనట్లేనా?
మాజీ న్యాయమూర్తి జస్టిస్ విష్ణు సదాశివ్ కోక్జేకు 131 ఓట్లు రాగా, రాఘవరెడ్డికి 60 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు చెల్లలేదు.
ఎన్నికైన వెంటనే కోక్జే కార్యవర్గ సభ్యులను నామినేట్ చేశారు. తొగాడియా స్థానంలో ఆలోక్ కుమార్‌ను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు.
ఆలోక్ కుమార్ దిల్లీలో ఆర్ఎస్ఎస్ ప్రముఖ నేతల్లో ఒకరు. బీజేపీలో కూడా ఆయన చాలా కాలం పాటు పని చేశారు.
వెంటనే తొగాడియా తాను వీహెచ్‌పీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. నిరాహారదీక్షకు కూర్చుంటానని కూడా ఆయనంటున్నారు.
అయితే, వీహెచ్‌పీ ప్లాట్‌ఫాం లేకుండా ఆయనకు మునుపటి శక్తి ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ బీజేపీని, ముఖ్యంగా నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని తొగాడియా తన దాడి కొనసాగించవచ్చు.

ఫొటో సోర్స్, NARINDER NANU/AFP/Getty Images
తొగాడియాను కాంగ్రెస్ వాడుకుంటుందా?
తొగాడియా ఒక పుస్తకం కూడా రాస్తున్నారనీ, అందులో ఆయన మోదీపై మరిన్ని ఆరోపణలు చేయొచ్చని కూడా చెబుతున్నారు.
అలాగే ఇటీవల ఆయన కాంగ్రెస్ నేతలకూ, హార్దిక్ పటేల్‌కూ దగ్గరగా ఉంటున్నారనే చర్చ కూడా జరుగుతోంది.
ఆయన నాటకీయ పరిస్థితుల్లో అదృశ్యమై, ఆ తర్వాత ఓ ఆసుపత్రిలో ప్రత్యక్షమైన తర్వాత హార్దిక్ పటేల్, కాంగ్రెస్ నేత అర్జున్ మోఢ్వాడియా ఆ ఆసుపత్రికి వెళ్లి ఆయనను కలిశారు.
అయితే, తొగాడియాకు ఉన్న వివాదాస్పద ఇమేజ్, రెచ్చగొట్టే ప్రకటనలు చేసే తీరు.. వీటిని చూసినపుడు కాంగ్రెస్ అతన్ని దగ్గరకు రానివ్వకపోవచ్చు.
అయితే, బీజేపీని, ప్రత్యేకించి ప్రధాని మోదీని టార్గెట్ చేయడానికి తొగాడియాను ఉపయోగించుకోవడానికి మాత్రం కాంగ్రెస్ వెనుకాడకపోవచ్చు.

ఫొటో సోర్స్, MANPREET ROMANA/AFP/Getty Images
సంఘ్ ఎలా గుణపాఠం నేర్చుకుంది?
అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఒక విషయం తేటతెల్లమైంది. ప్రధాని నరేంద్ర మోదీకి ఎదురయ్యే అడ్డంకులన్నీ దూరం చేయడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్వసన్నద్ధంగా ఉంది.
ఇది వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో ఎదురైన చేదు అనుభవాల నుంచి నేర్చుకున్న గుణపాఠం.
ఎందుకంటే, అప్పుడు సంఘ్ ఒక సూపర్ పవర్ లాగానే కాకుండా, అసలైన హైకమాండ్ లాగా ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్నట్టు కనిపించేది.
అది సంఘ్ ఇమేజికీ ఉపయోగపడలేదు. వాజ్‌పేయి ప్రభుత్వానికీ మేలు జరగలేదు.
ఆ సమయంలో ప్రభుత్వ పనితీరు పట్ల సంఘ్ అనుబంధ సంఘాలైన స్వదేశీ జాగరణ్ మంచ్, భారతీయ కిసాన్ సంఘ్, భారతీయ మజ్దూర్ సంఘ్ వంటివి పలు అడ్డంకులు సృష్టించడంతో ప్రభుత్వ ఇమేజ్ బాగా దెబ్బతింది.

ఫొటో సోర్స్, PRAKASH SINGH/AFP/Getty Images
సంఘ్, బీజేపీ సంబంధాలు ఇప్పుడెలా ఉన్నాయి?
అంతేకాదు, ప్రభుత్వం గద్దె దిగిన తర్వాత కూడా అప్పటి సంఘ్ అధిపతి ఎస్ సుదర్శన్ ప్రధానమంత్రి కార్యాలయం గురించీ, వాజ్‌పేయి దత్తత తీసుకున్న అల్లుడు రంజన్ భట్టాచార్య గురించీ చేసిన కటువైన వ్యాఖ్యల వల్ల కూడా సంఘ్, బీజేపీ రెండింటి ఇమేజ్ దెబ్బతింది.
గత నాలుగేళ్లలో ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా వచ్చాయి. కాకపోతే స్వదేశీ జాగరణ్ మంచ్ కొన్ని సార్లు నీతి ఆయోగ్ కార్యకలాపాలపై వ్యాఖ్యలు చేసింది.
అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నీతి ఆయోగ్ పనిని సమీక్షించడం కోసం ఏర్పాటు చేసిన మారథాన్ సమావేశంలో స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రతినిధులను కూడా పిలిచారు. అలా ఫిర్యాదులేమున్నా పరిష్కారం చేయొచ్చని భావించారు.
సంఘ్, బీజేపీల మధ్య సమన్వయ సమావేశం ఇప్పుడు ప్రతి మూడు నెలలకొసారి జరుగుతుంది.
సంఘ్ అధిపతి, ప్రధానమంత్రి, బీజేపీ అధ్యక్షుడు నిరంతరం సంప్రదింపులు జరుపుకుంటూ ఉంటారు. అలా ప్రముఖ విషయాలన్నింటిపై ఎలాంటి గందరగోళం లేకుండా ఉండాలి.. పరస్పర ఆమోదంతో నిర్ణయాలు వెంట వెంటనే తీసుకోవాలని వారి ఉద్దేశం.

ఫొటో సోర్స్, NARINDER NANU/AFP/Getty Images
మోదీ విషయంలో సంఘ్ ఆకాంక్ష ఏంటి?
ఆర్ఎస్ఎస్‌ను దగ్గరగా గమనిస్తున్న వాల్టర్ అండర్సన్, శ్రీధర్ కామ్లేలు ఒక పుస్తకం రాస్తున్నారు.
మోదీ విషయంలో సంఘ్‌కు దీర్ఘకాల పథకం ఉందని ఈ ఇద్దరు రచయితలూ వేర్వేరు ఇంటర్వ్యూలలో చెప్పారు.
మోదీ చాలా కాలం అధికారంలో ఉండాలనీ, తద్వారా భారత్ 'విశ్వగురు'గా ఎదగాలనే ఆర్ఎస్ఎస్ లక్ష్యాన్ని చేరుకోవచ్చని సంఘ్ కోరుకుంటోందని వారు అన్నారు.
అందుకే ప్రభుత్వ వ్యవహారాల్లో అడ్డంకులు కల్పించకుండా, దాని మార్గం సుగమం చేయడం కోసం పని చేస్తున్నట్టుగా కనిపించడం కోసం సంఘ్ ప్రయత్నిస్తోంది.
తొగాడియా లాంటి ముళ్లను దారిలో లేకుండా ఏరివేయడం ఈ వ్యూహంలోనే భాగమని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, PTI
సంఘ్ లక్ష్యాల సాధనకు మోదీ అవసరం
సంఘ్ లక్ష్యాలను నెరవేర్చడంలో ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషించగలదనీ, పోషిస్తోందని మోహన్ భాగవత్‌కు తెలుసు.
నరేంద్ర మోదీతో సమానమైన శక్తిమంతుడు గానీ, ఓట్లు రాబట్టగల మరో నేత గానీ బీజేపీలో లేరన్న విషయం కూడా ఆయనకు స్పష్టంగానే తెలుసు.
అందుకే మోదీకి పూర్తి అండదండలు ఇవ్వాలని సంఘ్ భావిస్తోంది.
అందుకే, తొగాడియా అయినా, మరొక నేత ఎవరైనా సరే.. మోదీతో వ్యక్తిగతంగా పోటీ పడాలని అనుకునే వారెవరికీ ఇది తగిన సమయం కాదు.
ఈ దృష్టితోనే, తొగాడియాను తన దారిని తానే ఎంచుకునేలా స్వతంత్రంగా వదిలేశారు. అశోక్ సింఘాల్ చనిపోయాక వీహెచ్‌పీకి గట్టి దెబ్బ తగిలింది.
ఎంఎస్ గోల్వల్కర్, ఎస్ఎస్ ఆప్టే వంటివారు కేఎం మున్షీ, కేశవరామ్ కాశీరామ్ శాస్త్రి, మాస్టర్ తారాసింగ్, స్వామి చిన్మయానంద్ వంటి మహామహులతో కలిసి ఏర్పాటు చేసిన వీహెచ్‌పీలో సింఘాల్ మృతి తర్వాత వెలితి ఏర్పడింది.

ఫొటో సోర్స్, MANPREET ROMANA/AFP/Getty Images
‘రామ మందిరం’లో వీహెచ్‌పీ పాత్ర!
సింఘాల్ అనంతరం ఆయన స్థానాన్ని చేపట్టడంలో తొగాడియా విఫలమయ్యారు. ఆయనలో ఉన్న రాజకీయ కాంక్ష, మోదీతో ఆయనకున్న వ్యక్తిగత వైరమే దీనికి కారణం.
ఇప్పుడు వీహెచ్‌పీ పగ్గాలు అందుకున్న కోక్జే, ఆలోక్ కుమార్‌లు సంఘ్ ఏం చెప్పినా శిరసావహించి నడుచుకునే వారే.
ఈ నేపథ్యంలో, రానున్న రోజుల్లో రామమందిరం విషయంలో వీహెచ్‌పీ పాత్ర ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది.
వేర్వేరు పక్షాల మద్దతుదారులను కూడగట్టి కోర్టుకు ఆవల కూడా ఈ వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం జరగొచ్చు.
కాబట్టి, ఈ పరిస్థితిలో తొగాడియా అంత దూకుడుతనం లేని కొత్త నాయకత్వం చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. కోక్జే, ఆలోక్ కుమార్‌ల నుంచి బహుశా సంఘ్ ఆశిస్తున్నది ఇదేనేమో.
(ఇది రచయిత వ్యక్తిగత అభిప్రాయం.)
ఇవి కూడా చదవండి:
- మోదీ-అమిత్ షా ద్వయాన్ని ఎదుర్కోగల ప్రతిపక్షమేదీ?
- మోదీ-తొగాడియాల దోస్తీ ఎక్కడ బెడిసి కొట్టింది?
- ప్రవీణ్ తొగాడియా: ‘నన్ను ఎన్కౌంటర్ చేసే కుట్ర జరుగుతోంది’
- ముస్లిం పాలకులు విదేశీయులైతే మరి మౌర్యులు?
- బీజేపీకి ఇది స్వర్ణయుగమైతే ముందున్నది ముసళ్ల పండగేనా!?
- ‘దేవతల గుహ’లో దాగిన రహస్యాలు
- మహాత్మా గాంధీ: ‘ఏసుక్రీస్తును అలా భావించలేను.. మీ స్టాంపును వాడలేను’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








